గుజరాత్‌ సీఎం రాజీనామా

ABN , First Publish Date - 2021-09-12T08:03:29+05:30 IST

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

గుజరాత్‌ సీఎం రాజీనామా

ప్రధాని సొంత రాష్ట్రంలో కీలక పరిణామం

విజయ్‌ రూపానీని తప్పించిన బీజేపీ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ(65) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన వెంట రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి భూపేంద్ర యాదవ్‌, కేంద్ర మంత్రులు పురుషోత్తమ్‌ రూపాలా, మన్సుఖ్‌ మాండవీయ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, ఇతర మంత్రులు ఉన్నారు. కాగా, రూపానీ రాజీనామాకు తక్షణ కారణాలేంటో తెలియకపోయినప్పటికీ.. ప్రధాని సొంత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి అంత సానుకూలంగా లేవని, రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని అధిష్ఠానానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబరులో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగించి పాలనను సమర్థంగా నిర్వహించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.


అందుకే రూపానీని రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. 2016 ఆగస్టు 7న ఆనందీ బెన్‌ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ రూపానీ 2017 ఎన్నికల్లో తిరిగి బీజేపీ విజయం తర్వాత  రెండోసారి సీఎంగా కొనసాగారు. అయితే.. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో గుజరాత్‌ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, సీఎం రూపానీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అవి ఢిల్లీ దాకా చేరడంతో సీఎంను మార్చక తప్పలేదని తెలుస్తోంది. కాబోయే సీఎంగా.. డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌, మంత్రి ఆర్‌సీ ఫలూదా, కేంద్రమంత్రులు పురుషోత్తమ్‌ రూపాలా, మన్సుఖ్‌ మాండవీయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం ఆదివారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-09-12T08:03:29+05:30 IST