హామీలు హాంఫట్‌!

ABN , First Publish Date - 2022-05-17T05:51:06+05:30 IST

‘ఒక్క అవకాశమివ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం...’ అంటూ ఎన్నికల ముందు జొన్నలగడ్డ పద్మావతి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.

హామీలు  హాంఫట్‌!
విభేదాలకు కారణమైన నార్పలలోని ఇంటి స్థలాలు

-నార్పల మండలంలో ఎమ్మెల్యేపై ప్రజల గుస్సా

-హామీల దాటవేతపై సర్వత్రా అసహనం

-సొంతపార్టీలోనే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సెగ

నార్పల, మే16: ‘ఒక్క అవకాశమివ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం...’ అంటూ ఎన్నికల ముందు జొన్నలగడ్డ పద్మావతి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. హామీలు అమలు చేస్తారని అమాయకంగా ఓటేసిన ప్రజలు ఇప్పుడు ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హామీలు ఇవ్వడం ఎందుకు.. ఇప్పుడు మొహం చాటేయడం ఎందుకంటూ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో సమస్యల పరిష్కారానికి నోచుకోక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.


మండల నాయకుడు వర్సెస్‌ ఎమ్మెల్యే


ఇక ఇంటి స్థలాల విషయానికొస్తే.. మండలానికి చెందిన ముఖ్యమైన మండల వైసీపీ నాయకుడికి ఎమ్మెల్యేకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఏదైనా సమావేశాల్లో మాత్రమే మాట్లాడుకుంటారనీ, సదరు నాయకుడికి ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నట్లు సమాచారం. ఆ నాయకుడు ఏదైనా పనికోసం అధికారులు వద్దకు వెళ్తే.. ఏపనీ జరగకుండా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అడ్డుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలే బహిరంగంగానే చెబుతుంటారు. ఇదే క్రమంలో ఆ నాయకుడి వర్గానికి చెందిన నార్పల ఎంపీటీసీ బాలనాగి ఇంటి స్థలాలు అర్హులైన వారికి ఇవ్వడం లేదని తాను పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నామని ఆ పార్టీ నాయకులకు అధికారులకు రాజీనామ పత్రాన్ని అందజేశారు. అంతటితో ఆగని ఎంపీటీసీ బాలనాగి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఇంటి స్థలాల విషయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె తల్లి ఇద్దరు కలిసి వారికి ఇష్టం వచ్చిన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని ఆరోపించారు.  అర్హులైన వైసీపీ కార్యకర్తలకు ఎందుకు పట్టాలు ఇవ్వరంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎమ్మెల్యే, మండల నాయకులకు మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయి. 


‘గడప గడపకూ...’ జరిగేనా?


నార్పలలో ప్రధానంగా బస్టాండు లేకపోవడం, బ్రిడ్జి, గ్రంథాలయం నిర్మించకపోవడం, ఇంటి స్థలాలు పంపిణీ చేయకపోవడం, నార్పలలో పందుల బెడద ఇలా ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీనికి తోడు రేషనకార్డులు, పింఛన్ల తొలగింపు, విద్యుత ఛార్జీలు పెంచడం తదితర ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ఇప్పటికే రెట్టింపు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి తోడు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలున్నాయి. ఇన్ని సమస్యల మధ్య ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ‘గడపగడపకు..’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే ప్రజా సమస్యలు ఓ వైపు, పార్టీలో అంతర్గత కుమ్ములాటల నడుమ ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఆ కార్యక్రమంలో నార్పల మండల కేంద్రంలో జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


సోషల్‌ మీడియాలో వైసీపీ వర్గపోరు!


  గడపగడపకూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నిర్వహిస్తే... అడ్డుకుంటామని మండల వైసీపీ నాయకుని అనుచరులైన బాలనాగి, నరేష్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టారు. బ్రిడ్జి, ఇంటి స్థలాలు, ఇసుక అమ్ముకున్నామని వస్తారా? ఏమి చేశామని.. ప్రజలకు ఏం చేశారని? వస్తారంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడంతో ఇందుకు చాలా మంది ఆ మండల వైసీపీ నాయకుల అనుచరులే ఇది వందశాతం నిజమని కామెంట్స్‌ చేశారు. ఎమ్మెల్యేను అడ్డుకుంటామని ఆ పోస్టింగ్‌లో తెలిపారు. అలాగే ఒక  వలంటీర్‌ కూడా ఎమ్మెల్యేను అడ్డుకోండి రా అంటూ వెటకారంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టారు. ఇందుకు ఆ వలంటీర్‌ నిజంగానే ఎమ్మెల్యేను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో పెట్టినట్లు సమాచారం. అయితే నార్పల మండలంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇందుకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు గడపగడపకూ ప్రోగ్రామ్‌కు ఎమ్మెల్యేను రానివ్వకుండా అడ్డుకోవాలని ముందస్తు వ్యూహాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.


కూతలేరు.. కూల్చివేతకు మూడేళ్లు


ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి గెలిచి మూడేళ్లవుతుంది. అప్పట్లో నార్పలలో కూతలేరు బ్రిడ్జి, ఇంటి స్థలాలు, గ్రంథాలయం తదితర వాటిని నిర్మిస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో మండల ప్రజలు ఎప్పుడు అభివృద్ధి పనులు చేస్తారా? అని ఎదురుచూస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఏదో ఒక పనిమీద నార్పలకు వచ్చి కూతలేరు బ్రిడ్జిపైనే వెళ్లాలి. అలాంటి పరిస్థితుల్లో బ్రిటీష్‌ కాలంలో కట్టిన ఈ బ్రిడ్జిని వైసీపీ ప్రభుత్వం రాగానే.. గత మూడేళ్ల క్రితం ఆ బ్రిడ్జిని కూల్చివేసి డైవర్షన రోడ్డును పక్కనేవేసి చిన్న పిల్లర్లు వేసి బ్రిడ్జిని అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా ఆ డైవర్షన రోడ్డుపైనే నీళ్లు వెళ్తాయి. నీళ్లు వెళ్లడం వల్ల నార్పల ప్రజలు ఎక్కడివారక్కడే నిలిచిపోతున్నారు. మూడేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాత్రం బ్రిడ్జి గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు బహిరంగంగానే చేస్తున్నారు. మండల కేంద్రంలో గ్రంథాలయం కూడా నిర్మించకుండా మాటలతో కాలయాపన చేస్తున్నారు.







Updated Date - 2022-05-17T05:51:06+05:30 IST