సెప్టెంబరులో పుంజుకున్న జీఎస్‌టీ వసూళ్ళు

ABN , First Publish Date - 2020-10-01T23:16:48+05:30 IST

కోవిడ్ కష్టాల్లో కాసింత కాంతి రేఖ కనిపించింది. కంటికి కనిపించని వైరస్ సృష్టిస్తున్న బీభత్సం ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మన దేశంలో జీఎస్‌టీ

సెప్టెంబరులో పుంజుకున్న జీఎస్‌టీ వసూళ్ళు

న్యూఢిల్లీ : కోవిడ్ కష్టాల్లో కాసింత కాంతి రేఖ కనిపించింది. కంటికి కనిపించని వైరస్ సృష్టిస్తున్న బీభత్సం ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మన దేశంలో జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) వసూళ్లు పుంజుకోవడం చెప్పుకోదగ్గ విషయమే. దేశ ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉన్న సమయంలో ఇది శుభవార్త!


కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం, సెప్టెంబరులో జీఎస్‌టీ వసూళ్ళు రూ.95,480 కోట్లు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికం. 


గత ఏడాది సెప్టెంబరులో వసూలైన జీఎస్‌టీతో పోల్చుకుంటే ఈ ఏడాది సెప్టెంబరులో వసూలైన జీఎస్‌టీ 4 శాతం ఎక్కువ. వస్తువుల దిగుమతిపై పన్ను 102 శాతం, సేవల దిగుమతితో సహా దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన ఆదాయంపై పన్ను 105 శాతం వసూలైంది. 


ఈ ఏడాది సెప్టెంబరులో వసూలైన గ్రాస్ జీఎస్‌టీ రెవిన్యూ రూ.95,480 కోట్లు కాగా, దీనిలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.17,741 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ రూ.23,131 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.47,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలైన రూ.22,442 కోట్లు సహా), సుంకం రూ.7,124 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలైన రూ.788 కోట్లు సహా). 


ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మే నెలలో రూ.62,151 కోట్లు, జూన్‌లో రూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబరులో రూ.95,480 కోట్లు వసూలైంది.


Updated Date - 2020-10-01T23:16:48+05:30 IST