ముసురు..గుబులు..

ABN , First Publish Date - 2020-08-07T10:41:32+05:30 IST

జిల్లాలో వానలు పడుతున్నందుకు ఆనందపడాలో.. తెరపివ్వకుండా రోజూ ఆకాశం మేఘావృతమవుతున్నందుకు ..

ముసురు..గుబులు..

పూత, ఊడలు దిగే దశలో వేరుశనగ పంట

రోజూ మేఘావృతంతో ఇబ్బందులు

పెరుగుతున్న పచ్చదోమ, లద్దెపురుగు ఉధృతి

గోధుమ రంగుకు మారుతున్న చెట్ల ఆకులు

వాతావరణం ఇలాగే ఉంటే బూడిద,

 కాండం కుళ్లు తెగులు సోకే ప్రమాదం

పంట దిగుబడిపై రైతుల్లో ఆందోళన


అనంతపురం వ్యవసాయం, ఆగస్టు 6: జిల్లాలో వానలు పడుతున్నందుకు ఆనందపడాలో.. తెరపివ్వకుండా రోజూ ఆకాశం మేఘావృతమవుతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు వేరుశనగ పంటకు ప్రతికూలంగా మారాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు నష్టపోవటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పడిన వర్షాలకు ఆశించిన స్థాయిలో వేరుశనగ పంట సాగైంది. ప్రస్తుతం పూత, ఊడలు దిగే దశల్లో పంట ఉంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటిదాకా 5 లక్షల హెక్టార్లల్లో వేరుశనగ పంట పెట్టారు. జూన్‌లో 2, జూలైలో 3 లక్షల హెక్టార్లల్లో సాగు చేశారు.


కొన్ని రోజులుగా తెరపివ్వకుండా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్నిచోట్ల ఓ మోస్తారు వర్షం పడుతోంది. ఈ పరిస్థితుల్లో రోజూ ఆకాశం మూసుకుంటుండటం వేరుశనగ పంటకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభం నెల జూన్‌ సాధారణ వర్షపాతం 63.9 మి.మీ., కాగా.. 106.8 మి.మి., జూలై సాధారణ వర్షపాతం 67.4 మి.మీ., కాగా 166.8 మి.మీ., నమోదైంది. ఈనెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ., కాగా ఇప్పటి దాకా 26.5 మి.మీ., కురిసింది. జిల్లాలో మరో ఐదు రోజులపాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత వచ్చే బులెటిన్‌ ఆధారంగా వర్షపాతం వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారకపోతే వేరుశనగ పంట దిగుబడులపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.


దిగుబడిపై ప్రభావం..

జిల్లాలో వాతావరణ పరిస్థితుల వల్ల వేరుశనగ పంటలో పచ్చదోమ, లద్దెపురుగు ఉధృతి అధికమవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పచ్చదోమ వేరుశనగ ఆకుల్లోని రసాన్ని పీల్చేస్తోంది. తద్వారా ఆకులన్నీ పసుపు పచ్చగా  మారిపోతున్నాయి. పసుపు పచ్చని వలయం మధ్య ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడ్డాయి. పచ్చదోమ కాటుతో ఆకులు ఒక్కసారిగా పసుపు పచ్చ రంగులోకి మారి, పాలిపోతున్నాయి. దీని మూలంగా ఊడలు దిగినా గట్టిపడవు. పిందెలు, కాయలు నాణ్యంగా ఏర్పడవని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో లద్దెపురుగు కనిపిస్తోంది. అది ఆకులను కొరికి తింటుంది. తద్వారా ఊడలు దిగే పరస్థితి ఉండదు.


తెరిపిస్తేనే పంట..

వేరుశనగ పంట కాలం 110 రోజులు. 50 రోజల వయసు నుంచి తగిన వర్షం పడితే ఊడలు బాగా దిగి, కాయలు ఊరే అవకాశం ఉంటుంది. జిల్లాలో కొన్ని రోజులుగా వర్షం పడుతూనే ఉంది. ఒకట్రెండు రోజులు తెరపిస్తే పంట దిగుబడి బాగా వస్తుంది. పంట 70-80 రోజుల వయసులో ఇలాగే వర్షం పడితే బూడిద, కాండం కుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది. తద్వారా భూమిలోనే ఊడలు, కాయలు బూడిదగా మారతాయి. ఇదే జరిగితే కాయలు ఏర్పడినా దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెరపివ్వకుండా వర్షాలు పడితే ఈసారి పంట పండినా దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-08-07T10:41:32+05:30 IST