సాగు యోగ్యం..సబ్సిడీ భాగ్యం

ABN , First Publish Date - 2020-07-02T11:36:43+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు అనుకూలంగా ఉన్న ఆయిల్‌పామ్‌పై రైతాంగం ఆసక్తి కనబరుస్తోంది.

సాగు యోగ్యం..సబ్సిడీ భాగ్యం

ఉమ్మడి జిల్లాలో పెరుగుతోన్న సాగు

తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో దీర్ఘకాలిక ఆదాయం

మొక్కలు, డ్రిప్‌, నాలుగేళ్లపాటు సాగుకు భారీ సబ్సిడీ

అంతరపంటల సాగుకూ ప్రభుత్వం దన్ను

నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సాగుకు ప్రోత్సాహం

బీచుపల్లిలోనే నూనె మిల్లు ఏర్పాటు

రైతులు సద్వినియోగం చేసుకోవాలి : సాయిబాబా, జిల్లా ఉద్యానవన అధికారి


 మహబూబ్‌నగర్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు అనుకూలంగా ఉన్న ఆయిల్‌పామ్‌పై రైతాంగం ఆసక్తి కనబరుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆయిల్‌మిల్లును పునరుద్ధరించడం ద్వారా మార్కెటింగ్‌ సదుపాయం కూడా కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం, సాగుకు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. మొక్కలపై, డ్రిప్‌పై భారీ సబ్సిడీలతో పాటు సాగుకు నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకం కూడా అందిస్తోంది. 


భారీ సబ్సిడీలతో సాగుకు ఊతం

ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలిస్తూ ఊతమిస్తోంది. మొక్కలకు వాస్తవ విలువ రూ.127 గాను రూ.100 సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం రూ.27కే రైతులకు అందిస్తోంది. డ్రిప్‌ ఇరిగేషన్‌కు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీతో ఇస్తోంది. పంట చేతికొచ్చే నాలుగో ఏడాదివరకు ప్రతియేటా ప్రతి ఎకరాకు సాగు నిమిత్తం రూ. 2 వేల చొప్పున ప్రోత్సాహకమిస్తోంది. అంతరపంటల సాగుకు కూడా ఎకరాకు రూ. 2 వేల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. ఇలా దాదాపు పెట్టుబడి అంతా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఇస్తుండటంతో ఈ సాగుకు చిన్న సన్నకారు రైతుల్లో ఆసక్తి పెరిగింది.


దీంతో ఉమ్మడి  జిల్లాలో సాగువిస్తీర్ణం మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లాల ఉద్యానవన శాఖాధికారులు నివేదికలు పంపారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 1791 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రణాళిక ఖరారు చేయగా, ఇప్పటివరకు 388 ఎకరాల్లో మొక్కలు నాటారు. మిగిలిన విస్తీర్ణంలో ఈసీజన్‌లో సాగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 


సాగుకు అనుకూలమవడంతో ప్రోత్సాహం 

 నీరు ఇంకే, తేలికపాటి నేలలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలం కావడం ఉమ్మడి జిల్లాలో నేలలు ఇందుకు అనుకూలం కావడంతో ఈ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టు, సంగంబండ , కోయిల్‌సాగర్‌ , నెట్టెంపాడు పథకాల ఆయకట్టు ప్రాంతాలతో పాటు బోరుబావుల్లో పుష్కలంగా నీరున్న ప్రాంతాలను సాగుకు ఎంపిక చేశారు. ఎకరాకు 58 మొక్కలు నాటే ఈ తోటల్లో ఒక్కో మొక్కకు వానాకాలంలో ప్రతిరోజూ కనీసం 200 లీటర్ల వరకు, వేసవిలో 300 లీటర్ల వరకు నీరు అందించాల్సి ఉంటుంది. రైతులు రెండు అంగుళాల బోరునీటితో ఐదెకరాల ఆయిల్‌పామ్‌ తోటను సాగుచేయవచ్చని అధికారులు చెబుతున్నారు.


మూడేళ్ల వరకు అంతరపంటలు సాగు చేయవచ్చు. తోటల్లో నాలుగో సంవత్సరం నుంచి దిగుబడులు తీసుకోవచ్చు. నాలుగోయేడాది నుంచి ఎకరాకు 8 టన్నులు ఆ తర్వాత, యేడాది నుంచి ఎకరాకు కనీసం 12 టన్నుల దిగుబడి వస్తుందని, కనీసం ఎకరాకు రూ. 1 లక్ష విలువ చేసే పంట దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. నాలుగో యేడాది నుంచి 30వ సంవత్సరం వరకు ఇదేరీతిలో దిగుబడులు వస్తాయని చెబుతున్నారు. 


బీచుపల్లిలోనే ఆయిల్‌ మిల్లు

 ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆయిల్‌పామ్‌ దిగుబడితో జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద గల ఆయిల్‌మిల్‌లో ముడి పామాయిల్‌ తయారు చేస్తారు. అక్కడి నుంచి మరో చోట్ల రీఫైన్డ్‌ చేసి మార్కెట్‌లోకి వంట నూనెను సరఫరా చేస్తారు. 


 తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలసాయం 

 నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభం ఆయిల్‌పామ్‌ సాగుతో రైతుకు లభిస్తోంది. జిల్లాలో ముందు నిర్ణయించుకున్న లక్ష్యం కంటే ఎక్కువ మంది రైతులు ముందుకొస్తుండటంతో విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వానికి నివేదించాం. సాగుకు ముందుకొచ్చిన ప్రతి రైతుకు సబ్సిడీలు అందించేలా చర్యలు తీసుకుంటాం.

-  సాయిబాబా, జిల్లా ఉద్యానవనశాఖాధికారి, మహబూబ్‌నగర్‌

Updated Date - 2020-07-02T11:36:43+05:30 IST