తాగునీటి పథకాల బోర్లలో అడుగంటిన భూగర్భజలాలు

ABN , First Publish Date - 2022-05-24T06:58:00+05:30 IST

వేసవి ఎండలు పెరిగేకొద్ది తాగునీటి బోర్లలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది.

తాగునీటి పథకాల బోర్లలో అడుగంటిన భూగర్భజలాలు

ఎర్రగొండపాలెం, మే  23 :  వేసవి ఎండలు పెరిగేకొద్ది తాగునీటి బోర్లలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. వేసవికాలం కావడంతో పశువులను  కూడా రైతులు ఇళ్లవద్దే ఉంచుతున్నారు. దీంతో నీటి వినియోగం గ్రామాల్లో పెరిగింది. మండలంలో అధికారుల లెక్కల ప్రకారం రోజుకు 232 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.  త్రీపేజ్‌ విద్యుత్‌ సరఫరా ఉండి ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేస్తేనే పల్లె ప్రజలకు గొంతు తడుస్తుంది. మండలంలోని గురిజేపల్లి, వాదంపల్లి, అమానిగుడిపాడు, గుర్రపుసాల గ్రామాలకు దూపాడు రక్షిత తాగునీటి పథకం నుంచి తాగునీటి సరఫరా చేయాల్సి ఉంది. ఆ పథకం నుంచి ఏ ఒక్క రోజు తాగునీరు సక్రమంగా జరిగిన సందర్భం లేదు.  అధికారులకు కూడా శాశ్వత తాగునీటి పథకాలకు మర్మతులు చేసి  తాగునీటి సమస్య పరిష్కరించాలన్న కార్యాచరణలేదు. ప్రస్తుతం  మండలంలో తాగునీటి సమస్యలను గుర్తించిన అధికారులు అమానిగుడిపాడు 37 ట్యాంకర్లు,  బట్టువారిపల్లె 6.  చిన్నబోయలపల్లి  5,  చిన్న కొలుకుల 5, చెన్నరాయునిపల్లి 8,  గంగుపల్లి 15,  గురిజేపల్లి 13, గుర్రపుసాల 30 ట్యాంకర్లు,  కాశీకుంట తాండ 8,  మెట్టబోడుతాండ 4, మిల్లంపల్లి వికేనగర్‌ 15, మురారిపల్లె 38,  మొగుళ్లపల్లి 7,  రేగులపల్లి 4,  తమ్మడపల్లి 20,  వాదంపల్లి 28,  వెంకటాద్రిపాలెం 17, ఇందిరమ్మ కాలని, ఎన్టీఆర్‌ నగర్‌కు 5 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు కురవక పోతే ఈ వారంలో తాగునీటి సమస్య పెరిగే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. గ్రామపంచాయతీల  సర్పంచులు తమ గ్రామాల్లో ట్యాంకర్లు సంఖ్యను పెంచాలని ఆర్‌డబ్ల్యూఎస్‌  అధికారులను కోరుతున్నారు. 


Updated Date - 2022-05-24T06:58:00+05:30 IST