కరువు తీరా..!

ABN , First Publish Date - 2020-10-30T10:15:51+05:30 IST

యాచారం మండలంలో పన్నెండేళ్లుగా తీవ్ర కరువుతో రైతులు నానాతంటాలు పడ్డారు. 2000 ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క నీరు రాక రైతులు అప్పు లపాలయ్యారు.

కరువు తీరా..!

నాడు నెర్రలు బారిన చెరువులు, కుంటలు.. 

భారీ వర్షాలతో నేడు నిండు కుండలా మారిన వైనం

యాచారం మండలంలో మూడేళ్లపాటు పంటలకు నీరు పుష్కలం

ఆనందంలో రైతులు.. మత్స్యకారులకు ఉపాధి


యాచారం :  యాచారం మండలంలో పన్నెండేళ్లుగా తీవ్ర కరువుతో రైతులు నానాతంటాలు పడ్డారు. 2000 ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క నీరు రాక రైతులు అప్పు లపాలయ్యారు. భూగర్భజలం గణనీయంగా పడి పోయింది. వరుణుడి కోసం రైతులు పూజలు చేసినా కరుణించ లేదు. కొన్నేళ్లుగా రైతులు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ జీవనం సాగించారు. ఎండాకాలంలో పాడిపశువులకు గ్రాసం లేక కబేళాలకు తరలించారు. కరువు కారణంగా పంటలు చేతికందక మండలంలోని మేడిపల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లితండా, తక్కళ్లపల్లి తండాల్లో నలుగురు రైతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. 


కాగా, ఈ ఏడాది మండలంలో నెలరోజులపాటు పుష్క లంగా వర్షాలు కురిసి మండలంలోని 24 పంచాయతీల్లో 154 కుంటలు, చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మండలంలోని పలు గ్రామాల్లో వట్టిపోయిన బోర్ల నుంచి ప్రస్తుతం నీరు పైకి ఉబికి వస్తుండడం విశేషం. పదేళ్లుగా కుంటలు, చెరువులకు టిక్కి వరకు కూడా నీరు రాలేని పరిస్థితి. ఈ ఏడాది బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కరువుతీరా వర్షాలు కురియడంతో అన్నదాతల ఆనందానికి అవధు ల్లేకుండా పోయాయి. చెరువులు, కుంటలు సామర్థ్యానికి మించి నీరు ఉండడంతో భూగర్భజలం బాగా పెరిగిందని, గతంలో వేసిన బోర్లలో నేడు పుష్కలంగా నీరందిస్తుందని పలువురు రైతులు తెలిపారు. 


కళకళలాడుతున్న పొలాలు

పుష్కలంగా వర్షాలు కురియడంతో మండలంలో వరి, కూరగాయ తోటలు కళకళలాడుతున్నాయి. మరో మూడు నాలుగేళ్ల పాటు వర్షాలు కురవకున్నా పంటలు సాగు చేసుకోవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. తాడిపర్తి, కుర్మిద్ద, మేడిపల్లి, నానక్‌నగర్‌, మల్కీజ్‌గూడ, చింతపట్ల, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, నందివపర్తి తదితర గ్రామాల్లోని చెరువులు నిండి నల్లగొండ జిల్లా హాలియా, పెద్దవూర ప్రాంతాలకు నీరు తరలుతుండటం పదేళ్లుగా ఇదే మొదటి సారని రైతులు చెబుతున్నారు. బంధం చెరువు కింద 500ఎకరాలు, నానక్‌నగర్‌లోని తలాబ్‌చెరువుకింద 150 ఎకరాలు, గండికుంట కింద 400ఎకరాలు, వెంకటాయ కుంటకింద 150ఎకరాలు, సింగాయకుంటకింద 65 ఎకరాలు, ఎర్ర కుంట, లచ్చిరెడ్డికుంటల కింద 70ఎకరాలు, ఇవి కాకుండా మరో పది కుంటల కింద 400 ఎకరాలు, సాలిచెరువు కింద 150 ఎకరాలు, ఎక్వచెరువు కింద 210 ఎకరాలు, ఊర చెరువుకింద 174ఎకరాలు, చింతపట్ల లక్ష్మణ్‌ చెరువుకింద 219ఎకరాల్లో వరి, కూరగాయ తోటలు సాగు చేస్తారు. తాడిపర్తి, నానక్‌నగర్‌, మేడిపల్లి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఆనాటి పాత వ్యవసాయ బావులు నిండి అలుగు పారుతున్నాయి. మేడిపల్లిలోని సాలిచెరువు కింద చెరువులు, కుంటలు అలుగు పారుతుండడంతో పలు గ్రామాల్లో నాటి వ్యవసాయ బోర్లలో నీరుపైకి ఉబికి వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరో రెండేళ్ల పాటు వర్షాలు కురవకున్నా భూగర్భజలం ఆధారంగా వరి, కూరగాయ పంటలు పండించుకోవచ్చని రైతులు అంటున్నారు.


మత్స్యకారులకు చేతినిండా ఉపాధి

చెరువులు, కుంటలు నిండడంతో వాటిల్లో పుష్కలంగా చేపలున్నాయి. మరో నాలుగునెలలు దాటితే తమకు చేతి నిండా ఉపాధి దొరుకుతుందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిపర్తి బందంచెరువు, నానక్‌నగర్‌ పెద్దచెరువుల్లో మరో రెండేళ్లపాటు నీరుంటుందని తద్వారా చేపలు పుష్కలంగా పెరుగుతాయని, దీంతో తమకు ఆసరాగా ఉంటుందని చెప్పారు. 


కరువు తీరింది.. - కలకొండబీరప్ప రైతు మేడిపల్లి

పన్నెండేళ్లుగా మండ లంలో వర్షాలు కురియక పోవడంతో కరువుతో తీవ్ర ఇబ్బందిపడ్డాం. ఈసారి బాగా వర్షాలు కురవడంతో భూగర్భజలం పెరిగింది. మరో రెండు మూడేళ్లపాటు మెట్ట, తరి పంటలు బాగా పండుతాయనే ఆశ ఉంది. ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే రైతులకు మేలవుతుంది. ఒకవిధంగా పూర్తిగా కరువు తీరిపోయింది. 

Updated Date - 2020-10-30T10:15:51+05:30 IST