అమ్మకు వందనం

ABN , First Publish Date - 2021-05-09T05:57:22+05:30 IST

భూ గోళంలో అందమైనవి ఎన్నో ఉన్నా అమృతం లాంటి నీ మనసు ముందు అవి చిన్నబోవాల్సిందే. స్వర్గం గొప్పదే అయినా నీ చల్లనైన సాన్నిహిత్యం ముందు ఓడిపోవాల్సిందే. అడిగితే దైవం అన్నీ ఇస్తాడో లేదో తెలియదు కానీ అడగకుండానే జన్మనిచ్చావు... నీ పొత్తిళ్లలో నా బొమ్మను చేశావు.. నీ ప్రాణం తృణప్రాయంగా నాకు ఊపిరి పోశావు.. నువ్వు నరకం చూస్తూ ప్రేమగా నన్ను ఈ లోకానికి తెచ్చావు... ఆశయాలు ఎన్ని ఉన్నా నా సంతోషమే నీ ఆశయంగా బతికావు, ఆవేదనలు ఎన్ని ఉన్నా నా గెలుపే నీ అనందమని బతికావు... నీ ప్రేమలో లేదు లోపం.. అమ్మా నీ ప్రేమ అనంతం.. తల్లి బిడ్డలు కలిసున్నా.. కానరాని దూరాల్లో ఉన్నా నిత్యం పలవరించే పేగు బంధం ఆ రెండు మనసులకే తెలుసు.

అమ్మకు వందనం

అమ్మా.. కలకాలం వర్థిల్లు

నల్లగొండ, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భూ గోళంలో అందమైనవి ఎన్నో ఉన్నా అమృతం లాంటి నీ మనసు ముందు అవి చిన్నబోవాల్సిందే. స్వర్గం గొప్పదే అయినా నీ చల్లనైన సాన్నిహిత్యం ముందు ఓడిపోవాల్సిందే. అడిగితే దైవం అన్నీ ఇస్తాడో లేదో తెలియదు కానీ అడగకుండానే జన్మనిచ్చావు... నీ పొత్తిళ్లలో  నా బొమ్మను చేశావు.. నీ ప్రాణం తృణప్రాయంగా నాకు ఊపిరి పోశావు.. నువ్వు నరకం చూస్తూ ప్రేమగా నన్ను ఈ లోకానికి తెచ్చావు... ఆశయాలు  ఎన్ని ఉన్నా నా సంతోషమే నీ ఆశయంగా బతికావు, ఆవేదనలు ఎన్ని ఉన్నా నా గెలుపే నీ అనందమని బతికావు... నీ ప్రేమలో లేదు లోపం.. అమ్మా నీ ప్రేమ అనంతం.. తల్లి బిడ్డలు కలిసున్నా.. కానరాని దూరాల్లో ఉన్నా నిత్యం పలవరించే పేగు బంధం ఆ రెండు మనసులకే తెలుసు. ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని వైద్యులు చేతులెత్తేసినా తన కడుపు బలంతో కన్న బిడ్డలను బతికించుకుంటున్నారు. కంటేనే అమ్మా అన్న భావన అంతటా ఉన్నా... పేగు తెంపునకు పుట్టకపోయినా చేరదీసి.. సేవ చేసి.... విపత్కర పరిస్థితుల్లోనూ అనాథలను చేరదీస్తున్న మానవమూర్తులు ఎంతో మంది.. వారందరికీ వందనం. ఉమ్మడి జిల్లాలో కష్టపడుతున్న తల్లుల మానవీయ కథలు. 


అమ్మలకే అమ్మ పిచ్చమ్మ

నల్లగొండ టౌన్‌: అనాఽథ వృద్ధులను కంటి రెప్పలా కాపాడుతూ అమ్మలకే అమ్మగా నిలుస్తోంది నల్లగొండ మండలం పెద్దసూరారం గ్రామానికి చెందిన పిచ్చమ్మ. అక్షరం ముక్క నేర్వకపోయినా ఎంతోమందికి అండగా ఉంటోంది. దిక్కులేని వృద్ధులు, ఏతోడూ లేని అనాథలకు నీడనిస్తున్నారు. 35 ఏళ్ల క్రితం శాంతి మహిళా మండలిని ఏర్పాటు చేసి ఎంతో మంది ఒంటరి మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మన్ననలు పొందారు. అదేవిధంగా ఏ దిక్కూలేని వృద్ధులకు హాస్టల్‌ పెట్టాలని 25ఏళ్ల క్రితం శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. మొదట్లో ఏడుగురితో ప్రారంభమైన వృద్ధాశ్రామం నేడు 50మందితో కొనసాగుతోంది. మొదట్లో వృద్ధాశ్రమం అద్దెకు కూడా డబ్బులు కూడా లేకపోవడంతో ఇంటి యజమాని తాళం వేశారు. అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి, కలెక్టర్‌ చొరవతో యజమాని నుంచి సామాను తీసుకొని కలెక్టరేట్‌ సమీపంలో ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకొని కొనసాగిస్తున్నారు. దాతల సహకారంతో పాటు ప్రభుత్వం నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫండ్‌తోనే హాస్టల్‌ నడుస్తుంది. వృద్ధులు చనిపోతే తలకొరివి పెట్టేవాళ్లు లేకపోవడంతో పిచ్చమ్మే అన్నీతానై వారి అంత్యక్రియలు నిర్వహిస్తారు.  


సేవలోనే సంతృప్తి: పిచ్చమ్మ, ఆశ్రమ నిర్వాహకురాలు.

కలెక్టరేట్‌ సమీపంలో ప్రభుత్వం 10 గుంటల స్థలం కేటాయించింది. అందులో ముసలోల్లకోసం ఓ గూడ కట్టించడమే లక్ష్యం. కరోనా కష్ట కాలంలో  కొందరు దాతలు ముందుకొచ్చి ఆహారం అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. వృద్ధులకు కరోనా వ్యాక్సిన్‌ వేయించాల్సి ఉంది. అందుకు అధికారులు  చొరువ చూపాలి.  


అనాథలకు అండగా..

నల్లగొండ క్రైం, మే 8: నల్లగొండ పట్టణ పరిధిలోని చర్లపల్లిలో 2003లో కేతిరెడ్డి కవిత ఏర్పాటు చేసిన స్నేహ అనాథాశ్రమం ఎంతోమంది చిన్నారులకు చేయూతనిస్తోంది. 16 ఏళ్లుగా ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 20మందికి పైగానే చిన్నారులు ఉన్నారు. నిర్వాహకురాలు కవిత తానే స్వయంగా చిన్నారులకు పండుగ సమయాల్లో అవసరమైన పిండి వంటలు చేసి పెడతారు. లాక్‌డౌన్‌లో కూడా ఆశ్రమంలో వంట చేసి వృద్ధులు, బాటసారుల ఆకలి తీర్చారు. తన ఆశ్రమంలో చేరిన అమ్మాయిలకు చదువు అయిపోయాక, వివాహ వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు. ఆశ్రమంలోనే ఉంటూ పీజీ ఎంఎస్‌డబ్ల్యూ చదివిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన స్వప్నకు చిట్యాల మండలం శాపల్లికి చెందిన స్వామితో ఈనెల 2వ తేదీన నిశ్చితార్థం జరిపించారు. ఆశ్రమానికి అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి చిన్నారుల పరిస్థితిని వివరించి వారికి మెరుగైన వసతుల కోసం అభ్యర్థిస్తున్నారు. 


చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ధ్యేయం :కేతిరెడ్డి కవిత, స్నేహ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు 

ముగ్గురు చిన్నారులతో 2003లో స్నేహ అనాధ ఆశ్రమాన్ని  స్థాపించాం. ప్రస్తుతం 20మంది చిన్నారులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వారికి అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. విధి వక్రీకరించి, అమ్మానాన్నల ఘర్షణలతో అనాధలైన చిన్నా రులను చేరదీసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం. ఆశ్రమంలో ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేసి వివాహా వయస్సు వచ్చిన అమ్మాయిలకు దగ్గరుండి వివాహం చేస్తున్నాం. 



కంటి పాపలా కాపాడుకుంటూ..

విద్యుదాఘాతంతో చేతులు కోల్పోయిన కొడుకుకి తల్లి సపర్యలు

నల్లగొండ క్రైం, మే 8: నవమాసాలు మోసి కని పెంచిన తల్లి తన కుమారుడి బుడిబుడి నడకలు చూసి అతనే సర్వస్వంగా భావించింది. తెలిసీ తెలియని వయస్సులో కుమారుడు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకోగా రెండు చేతులూ కాలిపోయాయి. వైద్యులు వాటిని తొలగించారు. ప్రస్తుతం ఆ యువకుడి వయస్సు 20ఏళ్లు. అప్పటి నుంచీ ఆ తల్లి అన్నీ తానై కుమారుడికి సపర్యలు చేస్తోంది. నకిరేకల్‌ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ల ప్రశాంత్‌ తెలిసీ తెలియక ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. దీంతో అతని రెండు చేతులు కాలిపోయాయి. కుటుంబసభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడినా రెండు చేతులను తొలగించారు. అచేతనంగా ఉండే అతడు సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. అప్పటి నుంచి కుమారుడికి సపర్యలు చేస్తున్న తల్లి పెరుమాళ్ల ధనమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఆ తల్లి సేవలకు గ్రామస్థులు సెల్యూట్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-05-09T05:57:22+05:30 IST