కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.150కోట్లు

ABN , First Publish Date - 2020-07-13T14:43:17+05:30 IST

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వ అసంపూర్తి పనుల పూర్తికి రూ.150 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడు విడతలుగా నిధుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు..

కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.150కోట్లు

కేఎల్‌ఐ డీ-82 కాల్వ పనుల పూర్తికి గ్రీన్‌ సిగ్నల్‌

మూడు విడుతల్లో నిధులిచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

నిర్వాసితులకు పరిహారం, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు 

40వేల ఎకరాలకు త్వరలో అందనున్న సాగునీరు 

సీఎం ఆధ్వర్యంలో కేఎల్‌ఐపై ప్రగతిభవన్‌లో సమీక్ష 

కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ వెల్లడి


ఆమనగల్లు(రంగారెడ్డి) : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వ అసంపూర్తి పనుల పూర్తికి రూ.150 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడు విడతలుగా నిధుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు.. అని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఇక్కడి విలేకరులకు తెలిపారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్‌ అనంత్‌రెడ్డి, ఈఈ శ్రీకాంత్‌ ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో కేఎల్‌ఐ డీ-82 కాల్వ అసంపూర్తి పనులు, భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు తదితర విషయాల గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే వివరించారు.


కేఎల్‌ఐ డీ-82 కాల్వ కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు 60 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారని తెలిపారు. అయితే కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆయా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించినట్లు తెలిపారు. డీ-82 కాల్వ పనులు పూర్తయితే వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల పరిధిలోని 40 వేల ఎకరాలకు సాగునీరందుతుందని, వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కాల్వ ద్వారా నియోజకవర్గం పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని కోరినటు ్లతెలిపారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని, వెంటనే రూ.50 కోట్లు విడుదలకు అధికారులకు ఆదేశించారని జైపాల్‌యాదవ్‌ వివరించారు. మరో రెండు విడుతల్లో రూ.100 కోట్లు విడుదల చేసి పనులు పూర్తి చేయడంతో పాటు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని సీఎం సూచించినట్లు ఎమ్మెల్యే వివరించారు. వీలైనంత త్వరగా కేఎల్‌ఐ డీ-82 కాల్వ పనులు పూర్తి చేయించి రైతులకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఈనెల 16న కల్వకుర్తి పట్టణంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ రైతుల చిరకాల స్వప్నం సాకారం చేస్తున్నందుకు కల్వకుర్తి ప్రజల, రైతాంగం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ కృజ్ఞతలు తెలిపారు.


ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు కరోనా కట్టడికి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మాడ్గుల, కడ్తాల, వెల్దండ మండలాలకు చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య,ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లాలయ్యగౌడ్‌, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-13T14:43:17+05:30 IST