ఇళ్ల కాలనీలో గ్రావెల్‌ దందా

ABN , First Publish Date - 2022-08-11T06:49:47+05:30 IST

మండలంలోని రాయపురఅగ్రహారంలో అధికార పార్టీ నేత బరితెగించాడు. పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌లో గ్రావెల్‌ తవ్వేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నాడు.

ఇళ్ల కాలనీలో గ్రావెల్‌ దందా
రాయపురఅగ్రహారం లే-అవుట్‌లో గ్రావెల్‌ తవ్విన దృశ్యం.

ఆర్పీ అగ్రహారంలో అధికార పార్టీ నేత అరాచకం

సరిహద్దు రాళ్లు తొలగింపు

పైపులైన్లు, కొళాయిలు ధ్వంసం

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన


సబ్బవరం, ఆగస్టు 10: మండలంలోని రాయపురఅగ్రహారంలో అధికార పార్టీ నేత బరితెగించాడు. పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌లో గ్రావెల్‌ తవ్వేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నాడు. దీంతో కాలనీలో వేసిన నీటి పైపులైన్లు, కొళాయిలు ధ్వంసం అయ్యాయి. లబ్ధిదారులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే గ్రావెల్‌ దందాకు పాల్పడుతున్న వ్యక్తి వైసీపీ నాయకుడు కావడంతో ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.   

మండలంలోని రాయపురఅగ్రహారం గ్రామంలో సొంత ఇళ్లు లేని పేదల కోసం సుమారు ఏడాదిన్నర క్రితం సర్వే నంబరు 60లోని బోడిమెట్టపై  1.1 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. దీనిని లేఅవుట్‌గా అభివృద్ధి చేసి ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున 44 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. తరువాత గత ఏడాది చివర్లో లబ్ధిదారులకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి కోసం బోరు తవ్వి, పైపులైన్లు వేశారు. పలుచోట్ల కొళాయిలు కూడా ఏర్పాటు చేశారు. అయితే లే-అవుట్‌లోకి వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడంతో 30 అడుగుల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే నిర్ణీత గడువులోగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో, రెండో విడతలో ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో లేఅవుట్‌ ఖాళీ వుంది. ఇదే అదనుగా భావించిన వైసీపీ గ్రామస్థాయి నాయకుడొకరు లేఅవుట్‌లో గ్రావెల్‌ వ్యాపారం మొదలుపెట్టాడు. గ్రావెల్‌ తవ్వకాలకు తెరలేపాడు. ట్రాక్టర్‌కు రూ.300 వరకు వసూలు చేస్తున్నాడు. గ్రావెల్‌ తవ్వకాల కోసం ప్లాట్లు, రోడ్ల సరిహద్దు రాళ్లను తొలగించేశారు. నీటి పైపులైన్లు, కొళాయిలను ధ్వంసం చేశారు. గ్రావెల్‌ తవ్వకాలకు పాల్పడుతున్నది అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకుడు కావడంతో లబ్ధిదారులు భయపడి అడ్డుకోలేకపోయారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అక్రమంగా గ్రావెల్‌ తవ్వేసి లే-అవుట్‌ను ధ్వంసం చేశారని, ఇప్పుడు ఇళ్లు ఏ విధంగా నిర్మించుకోవాలో అర్థం కావడంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇళ్ల స్థలాల లేఅవుట్‌లో గ్రావెల్‌ తవ్వకాలపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, ధ్వంసం చేసిన పైపులైన్లు, కొళాయిల సొమ్మును అక్రమార్కుల నుంచి వసూలు చేయాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-11T06:49:47+05:30 IST