యథేచ్ఛగా మట్టి అక్రమ తరలింపు

ABN , First Publish Date - 2021-10-13T04:49:47+05:30 IST

మట్టి తరలింపులో అధికార వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

యథేచ్ఛగా మట్టి అక్రమ తరలింపు

ఇష్టారాజ్యంగా వైసీపీ నేతలు 

జగనన్న ఇళ్ల స్థలాల లెవలింగ్‌ వంకతో దోపిడీ

అధికారులకు తెలిసినా మౌనం


తోటపల్లిగూడూరు, అక్టోబరు 12 : మట్టి తరలింపులో అధికార వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జగనన్న ఇళ్ల స్థలాల లెవలింగ్‌ వంకతో కొందరు మట్టి దోపిడీకి తెరదీశారు. అక్రమార్కుల నుంచి భారీగా ముడుపులు అందుతుండడంతో ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  మండలంలోని 22 గ్రామ పంచాయతీలో అధికారులు  39  జగనన్న ఇళ్ల స్థలాల లే అవుట్లను సిద్ధం చేశారు. లో లెవల్‌ ఉన్న ఇళ్ల స్థలాలను మట్టితో లెవలింగ్‌ చేయాల్సి ఉంది. ప్రభుత్వం అందుకు అనుమతులు మంజూరు చేసింది.  వాటిని అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అధికా రుల నుంచి అనుమతులు తీసుకుని అక్రమంగా మట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారమంతా అధికారులకు తెలిసే జరగడం గమనార్హం. వారి తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోడూరు, వరిగొండ, వరకవిపూడి, నరుకూరు, వెంకన్నపాళెం, తదితర పంచాయతీల్లో విచ్చలవిడిగా అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోంది. ఇప్పటికైనా సంబంధిత  శాఖల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మట్టి అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసి, మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-10-13T04:49:47+05:30 IST