ఆదిలోనే ఆహ్లాదం ఆవిరి!

ABN , First Publish Date - 2022-03-12T05:30:00+05:30 IST

రాష్ట్రంలోనే తొలిగా జిల్లాలో తలపెట్టిన గ్రామ కొలనుల నిర్మాణం ఆదిలోనే ఆగిపోయాయి.

ఆదిలోనే  ఆహ్లాదం  ఆవిరి!
నిలిచిన ఉదయగిరి గ్రామ కొలను పనులు

రాష్ట్రంలోనే తొలిగా గ్రామకొలనుల నిర్మాణం

47 చెరువుల అభివృద్ధికి రూ.6.1 కోట్లు

నిధుల మంజూరులో చేతులెత్తేసిన ప్రభుత్వం

మూడు నెలలకుపైగా ఆగిన పనులు


నెల్లూరు (జడ్పీ), మార్చి 12 : రాష్ట్రంలోనే తొలిగా జిల్లాలో తలపెట్టిన గ్రామ కొలనుల నిర్మాణం ఆదిలోనే ఆగిపోయాయి. చెరువులు అంటే సాగునీటి కేంద్రాలే కాదని ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే పర్యాటక ప్రాంతాలుగా మార్చవచ్చని ఆలోచన చేసి కలెక్టర్‌ చక్రధర్‌బాబు రాష్ట్రానికి మోడల్‌గా నెల్లూరులో తొలిగా గ్రామ కొలనుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని నెల్లూరు నగరం మినహా 9 నియోజకవర్గాల్లో 47 చెరువులను గ్రామ కొలనులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొంది, ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. 47 చెరువుల అభివృద్ధికి రూ.6.10 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మెటీరియల్‌ వర్క్‌ ఇరిగేషన్‌ శాఖకు, కూలీల పనులు డ్వామా శాఖకు అప్పగించి పనుల ప్రారంభానికి ఆరు నెలల క్రితం శ్రీకారం చుట్టారు.  ఎంపిక చేసిన చెరువు కట్టలపై పిచ్చి మొక్కలు తొలగించి  కూలీల ద్వారా మట్టిపనులు చేయించి వాకింగ్‌ రోడ్డు, బెంచీల ఏర్పాటు, ఆహ్లాదం కోసం పచ్చిగడ్డి, పూల మొక్కలు నాట్టడం వంటి పనులను ఇరిగేషన్‌ శాఖ ద్వారా చేయించేలా ప్రణాళికలు రూపొందించారు. చెరువు పరిధిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులు కేటాయించారు. కొన్ని చెరువుల పనులు ప్రారంభం కావడంతో తమ ఊరి చెరువు ఆహ్లాదంగా తయారవుతుందని గ్రామస్థులు సంతోషపడ్డారు. 


ఆగిపోయిన పనులు

జిల్లాలో ప్రారంభమైన గ్రామ కొలనుల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తొలిగా కొన్ని చెరువులకు పిచ్చి మొక్కల తొలగింపు, గుంతల చదును జరగ్గా వాటికి కొంతమేర బిల్లులు మంజూరయ్యాయి. 6 మండలాల పరిధిలోని కొన్ని చెరువులకు మాత్రమే బిల్లులు మంజూరవగా ఆ తర్వాత ఆగిపోయాయి. దీనికితోడు వర్షాలు కురవడం, నిండుకుండలా చెరువులు మారడంతో పనులను పూర్తిగా ఆపివేశారు. రాష్ట్రానికే మోడల్‌గా తీర్చిదిద్దాలని జిల్లాలో తలపెట్టిన గ్రామ కొలనులు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.


నిధులు లేకనే..

గ్రామ కొలనుల పనులకు నిధులు లేకపోవడంతోనే పనులు నిలిచిపోయాయని పలువురు అధికారులే పేర్కొంటున్నారు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, పనులు చేస్తే సకాలంలో నిధులు మంజూరయ్యే అవకాశం లేకపోవడంతోనే గ్రామ కొలనుల పనుల్లో పురోగతి ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది.  ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తే తప్ప గ్రామ కొలనులకు గ్రహణం వీడే అవకాశం లేదు. 


 మంజూరైన గ్రామ కొలనులు ఇవే..

ఆత్మకూరు నియోజకవర్గానికి ఆరు, గూడూరుకు 5, కావలికి 4, కోవూరుకు 5, నెల్లూరు రూరల్‌కు 1, సర్వేపల్లికి 5, సూళ్లూరుపేటకు 6, వెంకటగిరికి 6, ఉదయగిరికి 9 చొప్పున మొత్తం 47 గ్రామ కొలనులు మంజూరయ్యాయి.


వచ్చే నెలలో పనుల పునఃప్రారంభం

బిల్లుల మంజూరుకు టెక్నికల్‌ సమస్య ఏర్పడటం, వర్షాలతో చెరువులు నిండి ఉండటం తదితర కారణాల వల్ల గ్రామ కొలనుల పనులకు కొంత బ్రేక్‌ పడింది. టెక్నికల్‌ సమస్య అతి త్వరలోనే పరిష్కారమవుతుంది. దీంతో ఏప్రిల్‌ నుంచి మళ్లీ పనులు ప్రారంభమవుతాయి. 

- ఎం.తిరుపతయ్య,  డ్వామా పీడీ 

Updated Date - 2022-03-12T05:30:00+05:30 IST