ప్రోత్సాహక నిధులు ఎప్పుడిస్తారో!

ABN , First Publish Date - 2021-02-25T06:42:54+05:30 IST

జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన 75 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పేర్కొన్నట్టుగా ప్రోత్సాహక పారితోషికం ఎప్పటిలోగా చెల్లిస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది.

ప్రోత్సాహక నిధులు ఎప్పుడిస్తారో!

  • జిల్లావ్యాప్తంగా 75 పంచాయతీలు ఏకగ్రీవం
  • వీటిలో 60చోట్ల కొలువుదీరిన పాలకవర్గాలు
  • మిగిలిన 15చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు
  • 2013లో ఏకగ్రీవాలైన వాటికి ఇప్పటివరకు అతీగతీ లేదు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన 75 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పేర్కొన్నట్టుగా ప్రోత్సాహక పారితోషికం ఎప్పటిలోగా చెల్లిస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది. 75 పంచాయతీల్లో ప్రస్తుతం 60చోట్ల పాలకవర్గాలు కొలువుదీరాయి. 15 గ్రామాల్లో ఇంకా ఏర్పడలేదు. మొత్తం ఈ ప్రక్రియ పూర్తయ్యాక పారితోషికానికి సంబంధించి రావాల్సిన నిధుల నివేదికను యంత్రాంగం ప్రభుత్వానికి పంపనుంది. అయితే 2013లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఇప్పటివరకు పారితోషిక నిధులు మంజూరు కాలేదు. దీంతో ఇప్పుడు ఏకగ్రీవమైన పంచాయతీలకు పారితోషికం విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు సర్పంచ్‌ల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయి మేజర్‌ పంచాయతీలు సైతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మొన్నటివరకు పాలక వర్గాల్లేక గ్రామాల్లో జవాబుదారీతనం లోపించింది. ప్రత్యేకాధికారులున్నా సొమ్ముల్లేక అభివృద్ధి కుంటుపడింది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో వైసీపీ అధికా రంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నీ అటకెక్కాయి. జిల్లాలోని 1072 పంచాయతీల పరిధిలో 11,994 వార్డుల్లో అభివృద్ధి పడకేసింది. ప్రత్యేక అధికారులున్నప్పటికీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మం జూరు చేయకపోవడంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగులో పడ్డాయి. 14వ ఫైనాన్స్‌ నిధులు అరకొరగా మం జూరు చేసినా అప్పటికే చేసిన పనుల బిల్లులకు కాంట్రాక్టర్లు ఆందోళన చేయడంతో వారికి వచ్చిన నిధుల్లో సింహభాగం చెల్లించాల్సి వచ్చింది. దీంతో వచ్చిన నిధులన్నీ బకాయిలకు పోవడంతో తదుపరి అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. స్థానిక పాలకవర్గాల్లేకపోవడం, ప్రత్యేకాధికారులున్నా నిధుల లేమితో మేజర్‌ పంచాయితీలన్నీ అడకత్తెరలో పోకచుక్కలా నలిగిపోతున్నాయి. మైనర్‌ పంచాయతీలకు మం జూరు చేస్తున్న అరకొర నిధులు విద్యుత్‌ బకాయిలకే సరిపోతున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లులు కోట్లల్లో పేరుపోయాయని విద్యుత్‌ శాఖ గగ్గోలు పెడుతోంది. పాలకవర్గాలుండే సమయంలో బకాయిలున్నప్పటికీ సర్పంచ్‌లు కొంత సొంత సొమ్ము వెచ్చించి పరిస్థితిని కాస్త గాడిలో పెడుతుండేవారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వీరు ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులతో చర్చించి ఎంతోకొంత నిధులు సమీకరించుకునేవారు. ఇప్పుడు ఎమ్మె ల్యేలు, ఎంపీలు, మంత్రులున్నా తమ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లేవారు కనిపించడం లేదు. ప్రత్యేకాధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడంతో నిధులు అడిగే సాహసం చేయడం లేదు. దీంతో పంచాయతీల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది. ఈ క్రమంలో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్‌, రక్షిత మంచినీటి విభాగాధికారులు పారిశుధ్య వారోత్సవాలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. దోమల సంతతి పెరుగుతున్నందున ప్రతీ గ్రామం శుభ్రంగా ఉండాల్సిన పరిస్థితి. కాని గ్రామాల్లో క్లోరినేషన్‌, బ్లీచింగ్‌ వెదజల్లడానికి ప్రత్యేకాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీర ప్రాంతాలు, ఏజెన్సీ మండలాల్లో అక్కడక్కడా తాగునీరు కలుషితమవుతుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాల్సిన సమయంలో రక్షిత నీటి విభాగానికి కూడా సరిపడా నిధులు రావట్లేదు. ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు, గతంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం మంజూరు చేసే ప్రోత్సాహక పారితోషికాన్ని సకాలంలో విడుదల చేస్తేనే గానీ పంచాయతీల్లో పేరుకుపోయిన ఆర్థిక అసమానతలు తొలిగే పరిస్థితి కనిపించట్లేదు.

జనాభా ప్రకారం పారితోషికం 

రెండువేలలోపు జనాభా ఉన్న ఏకగ్రీవ పంచాయతీ పాలకవర్గాలను మొదటి కేటగిరీలో పేర్కొన్నారు. వీటికి రూ.5 లక్షలు. 2 నుంచి 5వేల జనాభా కలిగిన రెండో కేటగిరీ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు. మూడో కేటగిరీలో 5 నుంచి 10వేల జనాభా కలిగిన ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షలు. 10వేల జనాభా పైబడి ఉన్న ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రూ.4.75 కోట్లు నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలుస్తోంది. 

Updated Date - 2021-02-25T06:42:54+05:30 IST