ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

ABN , First Publish Date - 2022-05-21T06:11:11+05:30 IST

వరి వద్దని ప్రభుత్వం, అది తప్ప మరోదారి లే క ఉమ్మడి జిల్లా రైతులు వరినే సాగు చేశారు.

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు
నాంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న నల్లగొండ డీఎ్‌సవో వెంకటేశ్వర్లు

 జూన్‌ మొదటి వారంలో పూర్తికి కసరత్తు

 ఉమ్మడి జిల్లాలో 4.64లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు

వరి వద్దని ప్రభుత్వం, అది తప్ప మరోదారి లే క ఉమ్మడి జిల్లా రైతులు వరినే సాగు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అనే అనుమానంతో రైతులు ధాన్యాన్ని దిగుబడి చేయగా, చివరి నిమిషంలో కొనుగోలు చేస్తామని ప్రభు త్వం ప్రకటించింది. సన్నధాన్యం సాగుచేసిన రైతులు నేరుగా మిల్లులకు విక్రయించగా, దొడ్డు ధాన్యం సాగు చేసిన రైతులు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలపై ఆధారపడ్డారు. 35 రోజులుగా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగగా, మరో 10 రోజు ల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా లో అధికారుల సమన్వయ లోపం కారణంగా ధాన్యం సేకరణ లక్ష్యానికి దూరంగా నిలిచింది.

- (ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)

ధాన్యం దిగుబడిలో ఆసియాలోనే ఉమ్మడి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. స్థానికంగా నీటి వనరులు అందుబాటులో ఉండడం, రైస్‌ మిల్లులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా అనే అంశాన్ని రైతులు పెద్దగా పట్టించుకోకుండా వరి సాగుకే మొగ్గు చూపారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో విస్తరించిన నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో రైతులు పెద్ద సంఖ్యలో సన్నాలను సాగు చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు గోదావరి జలాలు అందుబాటు లోకి రాగా, కొంత మేర సన్నధాన్యం, పెద్ద మొత్తం లో దొడ్డు ధాన్యం సాగు చేశారు. యాసంగి సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 4,73,017 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 4,37,955 ఎకరాల్లో, యాదాద్రి జిల్లా లో 2,45,086 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. క్వింటాకు రూ.1960 తక్కువ కాకుండా ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థ లు కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించాయి. అయితే సీఎం ప్రకటనకు ముందు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయలేకపోయారు. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభంకాగా, తొలుత గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బంది ఏర్పడింది. ఆ తరువాత మిల్లుల్లో స్థలాభావంతో ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు విముఖత చూపడంతో కొనుగోళ్లు జాప్యమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లా అధికారులు గతానుభవంతో రంగంలోకి దిగి సమస్యలను అధిగమించి ధాన్యం కొనుగోలుచేశారు. ప్రస్తుత నెలలో కొనుగోళ్లు ఊపందుకోగా, వరుణుడి కారణంగా ఆటంకాలు ఎదురైనా ప్రక్రియ చివరికి దశకు చేరింది. యాసంగిలో నల్లగొండ జిల్లాలో 3.70లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా, ఈ నెల 20వ తేదీ నాటికి 2.50లక్షల మెట్రిక్‌ టన్నులు 248 కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2.50కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. సూర్యాపేట జిల్లాలో 2.20లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యంగా కాగా, 1.50లక్షల మెట్రిక్‌ టన్నులు 327 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. యాదాద్రి జిల్లాలో 2.50లక్షల టన్నులు లక్ష్యంగా నిర్ణయించగా కేవలం 64వేల మెట్రిక్‌ టన్నులు 263 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ధాన్యం దిగుమతికి స్థలాభా వం, మిల్లర్లు సహకరించకపోవడం, స్థానికంగా గన్నీ బ్యాగులు, లారీల ద్వారా రవాణా విషయంలో ఇబ్బందులతో జాప్యం కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 4.64లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, రూ.420కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 15 కొనుగోలు కేంద్రాలను నిర్వాహకులు మూసివేశారు.


జూన్‌ మొదటి వారంలో కొనుగోళ్లు పూర్తిచేస్తాం :  వెంకటేశ్వర్లు, నల్లగొండ డీఎ్‌సవో 

ప్రతిరోజు సగటున 450 నుంచి 500 లారీల ద్వారా 12వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగో లు చేశాం. ఇంకా 60వేల టన్నుల వరకు ధాన్యం సేకరించాల్సి ఉంటుందని భావిస్తున్నాం. 5శాతం కటింగ్‌కు సంబంధించి 20 వేల టన్నుల ధాన్యం ఉంటుంది. సగటున 12 వేల టన్నులు తరలించినా వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తాం. వాతావరణం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో సమస్యలున్న కేంద్రాల్లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో పాటు పౌరసరఫరాల సంస్థ డీఎం నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలోని బృందం నిరంతరం పర్యటిస్తోంది. మిల్లర్లు సమస్యలు సృష్టించకుండా చూడడం, కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఉండకుండా తరలించేందుకు డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించడంతో 45 రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయగలుగుతున్నాం.

Updated Date - 2022-05-21T06:11:11+05:30 IST