ధాన్యం.. దైన్యం!

ABN , First Publish Date - 2022-05-26T05:40:24+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి.

ధాన్యం.. దైన్యం!
కొనుగోలు కేంద్రంలో కుప్పలు కుప్పలుగాఉన్న ధాన్యం కుప్పలు

- కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తప్పని తిప్పలు

- ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

- కొనుగోళ్లు జరుగక రోజుల తరబడి కుప్పల వద్దే కాపలా

- రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు

- కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కుతున్న రైతులు

- ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 1.84లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే

కామారెడ్డి, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రధానంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీల కొరత ఏర్పడడంతో కేంద్రాల్లోనే ధాన్యం నిలిచిపోతుంది. రైతులు కేంద్రాల వద్దకు వరి రాసులను భారీగా తరలిస్తున్నారు. కేంద్రాల్లో కుప్పలు, కుప్పలుగా వరి రాశు లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు కురుస్తున్న అకాల వర్షాలకు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడం ఆ ధాన్యాన్ని ఆరబెట్టే క్రమంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాల్లోనే కుప్పల వద్దే రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు రోడ్లెక్కి ఆందోళన చేపడుతున్నారు.

  ప్రభుత్వ నిర్ణయంతో కొనుగోళ్లలో ఆలస్యం

ఈ యాసంగి సీజన్‌లలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభు త్వం తర్జనభర్జన పడుతూ వచ్చింది. చివరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించింది. దీంతో మార్చి చివరి వారంలోనే ప్రారంభం కావాల్సిన కొనుగోళ్లు ఏప్రిల్‌ రెండో వారంలో మొదలయ్యాయి. దీంతో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కొనుగోళ్లలో కాస్తా జాప్యం నెలకొంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. భారీగా దిగుబడులు వస్తాయని సుమారు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 343 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెల రోజుల నుంచి రైతు లు ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే కొనుగోళ్లలో కాస్తా జాప్యం నెలకొంటుండడంతో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా రు. ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలుగా అకాల వర్షాలకు తడిసి ధాన్యాన్ని తరచూ ఆర బెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కేంద్రాల్లోనే రైతుల నిరీక్షణ

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొంటుంది. తెరుచుకున్న కేంద్రాల్లోని ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో కొనుగోళ్లకై రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తేమ శాతం వచ్చేందుకు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని ఆర బెడుతున్నారు. ఇదే క్రమంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం కాస్తా తడిసిపోతుంది. దీంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు, బార్దాన్‌లు అందుబాటులో ఉంచడం లేదని దీంతో వర్షాలు కురిసినప్పుడు ధాన్యం తడిసిపోతుందని, తడిసిన ధాన్యాన్ని ఆర బెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 343 కేంద్రాల్లో సుమారు 1.84లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సంబంధిత శాఖ అధికారులు కొనుగోలు చేశారు.


రోడ్డెక్కుతున్న రైతులు

ఆ యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ఆలస్యం గా జరగడం మరోవైపు కేంద్రాల్లో ధాన్యం ఎక్కడికక్కడే నిలిచిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వెనువెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాలని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మాచారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, కొనుగో లు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడం లేదని రైతులు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు.


గత అనుభవాలు గుణపాఠం కావా?

జిల్లాలో ప్రభుత్వం తరపున 343 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెల రోజుల నుంచి కేంద్రాలకు పెద్ద ఎత్తున రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. గతంలోనూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం నెలకొనడం, గోనె సంచుల కొరత, ట్రాన్స్‌ఫోర్ట్‌ సమస్య లాంటి కారణాలతో కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. ప్రతీ సీజన్‌లోనూ కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామంటూ అధికారులు చెబుతున్నా అది కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొనడం కేంద్రాల్లో కుప్ప ల వద్ద రైతులు రాత్రింబవళ్లు కాపలాకాస్తుండడం అదే క్రమంలో కుప్పల వద్దనే రైతులు గుండె ఆగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గతంలో దోమకొండ, బీబీపేట, లింగంపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులు సకాలంలో కొనుగోలు జరగక పోవడంతో నిరీక్షించి కుప్పల వద్దే రైతులు ప్రాణం వదిలిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడంలో లారీల కొరత ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని సంబంధిత శాఖ అధికారులను సంప్రదిస్తే గోదాంల్లోని సీఎంఆర్‌ను తరలించేందుకు ప్రభుత్వం వ్యాగన్లను ఏర్పాటు చేసినందున వాహనాలు ఆ వైపు వెళ్తున్నాయని అయినప్పటికీ మిగితా లారీలను కేంద్రాల్లోనే ఉంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని చెబుతున్నారు.

Updated Date - 2022-05-26T05:40:24+05:30 IST