అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ABN , First Publish Date - 2020-12-03T05:39:48+05:30 IST

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఆహార భద్రత కమిషన్‌ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌ అన్నారు.

అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఏవోను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఆహార భద్రత కమిషన్‌ సభ్యుడు ఆనంద్‌

ఆహార భద్రత కమిషన్‌ సభ్యుడు ఆనంద్‌

శంకరపట్నం, డిసెంబరు 2: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఆహార భద్రత కమిషన్‌ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌ అన్నారు. బుధవారం మండలంలోని మొలంగూర్‌, కేశవపట్నం గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మండలంలోని మొలంగూర్‌ సహకారసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంతవరకు మండల డిప్యూటీ తహసీల్ధార్‌, నోడల్‌ అధికారి నాగర్జున క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించకపోవడం చాలా బాధాకరమన్నారు. మొలంగూర్‌లో తన పర్యటన ఉందని సమాచారం ఇచ్చినా స్పందించకపోవడం విచారకరమన్నారు. వీరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలంలో రైతుల నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి 3-4కిలోల వరకు అధికంగా కాంటాలు వేస్తున్నట్లు రైతులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్న సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాంటాలు వేసి రైతులకు తగిన న్యాయం చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఉద్యోగులను హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మోరె అనూష, మెట్‌పల్లి సింగిల్‌ విండో అధ్యక్షుడు పొద్దుటూరి సంజీవరెడ్డి, మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌, సంఘం సీఈవో సదయ్య, రైతులు వెంకటేశం, కుమార్‌, వీరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:39:48+05:30 IST