‘రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై గవర్నర్ నిర్ణయం త్వరలో’

ABN , First Publish Date - 2021-01-21T23:19:07+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై

‘రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై గవర్నర్ నిర్ణయం త్వరలో’

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై తమిళనాడు గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ జాప్యం చేస్తుండటం పట్ల అత్యున్నత న్యాయస్థానం ఇటీవల విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడుగురు దోషుల విడుదలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. 


మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఏడుగురు దోషులకు విధించిన జీవిత ఖైదు శిక్షా కాలం పూర్తి కాకుండానే, వారిని విడుదల చేయడానికి తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం 2018లో సిఫారసు చేసింది. మంత్రివర్గ సిఫారసుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. మంత్రివర్గ సిఫారసులపై గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడం లేదు. 


ఈ నేపథ్యంలో ఏడుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరుపుతున్న అత్యున్నత న్యాయస్థానం గవర్నర్ నిర్ణయంలో జాప్యం జరుగుతుండటంపై విచారం వ్యక్తం చేసింది. ఈ దశలో తమ అధికార పరిధిని వినియోగించాలని అనుకోవడం లేదని తెలిపింది. ప్రభుత్వం చేసిన సిఫారసులు రెండేళ్ళ నుంచి పెండింగ్‌లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. 


గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మూడు లేదా నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. 


తమిళుల మనోభావాల అంశంగా...

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1991 మే 21న హత్యకు గురయ్యారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో ఈ దారుణం జరిగింది. ఈ కేసులో దోషులకు శిక్ష విదించడం తమిళుల భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా మారింది. తమిళనాడులో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ అంశంపై రచ్చ జరుగుతోంది. 


రాజీవ్ హంతకులు పెరారివలన్, మురుగన్, శాంతం, నళిని శ్రీహరన్, రాబర్ట్ పయస్, జయ కుమార్, రవి చంద్రన్‌లకు జీవిత ఖైదు విధించారు. వీరంతా తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. అధికార పార్టీ ఏదైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వీరిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. వీరు అత్యంత అమానుష నేరానికి పాల్పడ్డారని, వీరిని విడుదల చేయడం సరికాదని 2018 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వీరిని విడుదల చేయడం చాలా ప్రమాదకరమైన దృష్టాంతం అవుతుందని, భవిష్యత్తులో ఇతర నేరస్థుల ద్వారా అంతర్జాతీయ పర్యవసానాలు ఏర్పడతాయని తెలిపింది. 


Updated Date - 2021-01-21T23:19:07+05:30 IST