వ్యవసాయ యాంత్రీకరణకే మొగ్గు

ABN , First Publish Date - 2021-06-14T04:29:22+05:30 IST

సామర్లకోట, జూన్‌ 13: వ్యవసాయ యాంత్రీకరణ విధానం అమలు చేస్తేనేగానీ వ్యవసాయం మరింత అభివృద్ధి చెందదని, అధికశాతం రైతులను ఆకట్టుకునేందుకు దీని అమలుకు ఎట్టకేలకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఇందుకోసం అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు(సీహెచ్‌సీ)

వ్యవసాయ యాంత్రీకరణకే మొగ్గు

రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు 

నెలకొల్పేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు 

యాంత్రీకరణ సామగ్రి అందించేందుకు ప్రణాళికలు 

సామర్లకోట, జూన్‌ 13: వ్యవసాయ యాంత్రీకరణ విధానం అమలు చేస్తేనేగానీ వ్యవసాయం మరింత అభివృద్ధి చెందదని, అధికశాతం రైతులను ఆకట్టుకునేందుకు దీని అమలుకు ఎట్టకేలకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఇందుకోసం అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు(సీహెచ్‌సీ) నెలకొల్పేందుకు తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం ఏడాదిన్నరగా వాయిదా వేస్తూ వస్తున్న సీహెచ్‌సీలపై స్పష్టమైన ప్రణాళిక జారీ చేసింది. తొలి దశలో జిల్లాలో మూడోవంతు రైతు భరోసా కేంద్రాల్లో రైతు ఉత్పత్తిదారులుగ్రూపులుగా ఏర్పడినవారికి మాత్రమే వ్యవసాయ యాంత్రీకరణ సామగ్రి అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసేలా ఆయా మండల వ్యవసాయాధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 8న ఎంపిక చేసిన రైతు భరోసా కేంద్రాల్లోని సీహెచ్‌సీల్లో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీలో భాగంగా జిల్లాలో కూడా అదేరోజున ప్రారంభించనున్నట్టు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.


 రూ.15 లక్షలతో పరికరాలు 

జిల్లాలో 1084 రైతు భరోసా కేంద్రాలకుగాను తొలి విడతగా 343 రైతు భరోసా కేంద్రాల్లో ఈ పథకాన్ని వచ్చే నెల 8న ప్రారంభించనున్నారు. తొలి విడతలో 325 గ్రూపులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేస్తారు. దీని ద్వారా ఒక్కొక్క సీహెచ్‌సీలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు రైతు సభ్యులతో కూడిన రైతు ఉత్పత్తిదారుల గ్రూపునకు రూ.15 లక్షల విలువైన పరికరాలను అందజేయనున్నారు. అందులో 50 శాతం బ్యాంకుల నుంచి రుణాలుగా మంజూరు చేస్తారు. సహకార బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. మిగిలిన 50శాతం గ్రూపులోని ఐదుగురు రైతుల భరించాల్సి ఉంది. అందులో 40శాతం అనగా రూ.6 లక్షలను ప్రభుత్వం రాయితీ రూపంలో నేరుగా గ్రూపు బ్యాంకు ఖాతాకు మంజూరు చేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చనుంది. ఈ నెలలోనే గ్రూపులవారీగా వాటా ధనం చెల్లించిన గ్రూపులను ఎంపిక చేసే ప్రక్రియను ఇప్పటికే వ్యవసాయాధికారులు శ్రీకారం చుట్టారు. వాటి పంపిణీ ప్రారంభానికి మొదటి విడతలో కొన్ని కేంద్రాలను ఎంపిక చేసేందుకు వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ సీహెచ్‌సీల్లో యాంత్రీకరణ పరికరాలను సిద్ధం చేసే బాధ్యతలను వ్యవసాయ సహాయ సంచాలకులకు అప్పగించారు. 


మండలానికి ఐదు కేంద్రాలు

సెప్టెంబరులో రెండో విడత, డిసెంబరులో మూడో విడత సీహెచ్‌సీ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఒక్కో కేంద్రంలో సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, వరినాట్లు యంత్రాలు, రోటోవేటర్లు, స్ర్పేయర్లు వంటి పరికరాలను అందజేయనున్నారు. ప్రతి మండలంలో ఐదు సీహెచ్‌సీ కేంద్రాలు ఎంపిక చేసి వరికోత యంత్రాలను సరఫరా చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా రూ.25 లక్షలు కేటాయించనున్నారు. నియోజకవర్గానికి ఒక హైటెక్‌ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. సహకార సొసైటీలు లేదా రైతు ఉత్పత్తిదారుల కేంద్రాలకు వీటి బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ రీతిలో ఏర్పాటు చేసే హైటెక్‌ హబ్‌కు రూ.1.50 కోట్ల నిధులను ప్రభుత్వం నేరుగా సమకూర్చనుంది. మరో వారంరోజుల్లో దీనిపై ప్రభుత్వం పూర్తి కసరత్తులు చేసి జిల్లాలో ఎన్ని హబ్‌లు ఏర్పాటు చేయాలన్న అంశాన్ని ఖరారు చేయనున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-14T04:29:22+05:30 IST