ఖలిస్థాన్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలకు రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2020-12-17T19:26:27+05:30 IST

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ నెట్‌వర్క్‌పై

ఖలిస్థాన్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలకు రంగం సిద్ధం!

న్యూఢిల్లీ : దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ నెట్‌వర్క్‌పై విరుచుకుపడేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థలు, ఉగ్రవాదులు, సానుభూతిపరులపై దర్యాప్తును ముమ్మరం చేయబోతోంది. ఎన్ఐఏ, ఈడీ, సీబీఐ, ఎఫ్ఐయూ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని విధాలుగా ఈ దర్యాప్తును నిర్వహిస్తాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థలు హైజాక్ చేసినట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


పంజాబ్ పోలీసులు, పంజాబ్ రాష్ట్ర నిఘా సంస్థలు, కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థలు పంజాబ్ తదితర ప్రాంతాల్లో పట్టు పెంచుకుంటున్నాయి. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని హైజాక్ చేశాయి. ఖలిస్థాన్ అనుకూల సంస్థలకు, ఎన్‌జీవోలకు విదేశీ నిధులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే), బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ వంటి సంస్థలపై దర్యాప్తును మరింత తీవ్రం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బ్రిటన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి ఈ సంస్థలకు అందుతున్న నిధులపై దర్యాప్తు జరపాలని ఆదేశిస్తారని తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిథిలోని అన్ని సంస్థల ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలు, వాటి సానుభూతిపరులు రైతు ఉద్యమంలో ప్రవేశించడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై చర్చించినట్లు సమాచారం. 


ఖలిస్థాన్, కశ్మీరు (కే2) ప్లాన్‌తో పాకిస్థాన్ ఐఎస్ఐ అమలు చేస్తున్న కుట్రను భగ్నం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఖలిస్థాన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి సహకారం అందుతున్నట్లు నిఘా నివేదికలు చెప్తున్నాయి. 


Updated Date - 2020-12-17T19:26:27+05:30 IST