కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం

ABN , First Publish Date - 2020-10-01T09:47:08+05:30 IST

రాష్ట్రప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా సర్కారు వైద్యసేవలను అందిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ‘ఎల్‌వోటీ’ ప్రారంభం


ఖమ్మం సంక్షేమవిభాగం, సెప్టెంబరు 30: రాష్ట్రప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా సర్కారు వైద్యసేవలను అందిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకు (ఎల్‌వోటీ)ను బుధవారం ఆయన కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రోగులకు కావాల్సిన వైద్యసౌకర్యాలను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నామని, ఈ క్రమంలోనే జిల్లా ఆసుపత్రిలో ఈ ఆక్సిజన్‌ ట్యాంకు ఏర్పాటు చేయించామన్నారు. కొవిడ్‌-19పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌కు మంచి వైద్యసేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మేయర్‌ పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ, డీఎంహెచ్‌వో మాలతి, ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు, ఏవో రాజశేఖర్‌గౌడ్‌, వైద్యులు సురేశ్‌, రాంప్రసాద్‌, నర్సింగ్‌ పర్యవేక్షకురాలు సుగుణ, హెడ్‌నర్స్‌ మేరీ, మెనేజరు ఆర్‌వీఎస్‌ సాగర్‌, నందగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


ఔషధశాఖ అభ్యంతరం

లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకు ప్రారంభం అనంతరం ఖమ్మం డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ సురేందర్‌రెడ్డి ఆక్సిజన్‌ సరఫరా ఏజెన్సీ అయిన ఇల్లెన్‌బెర్రి సంస్థ ప్రతినిధితో మాట్లాడారు. స్థానికంగా ఔషధ పర్యవేక్షకులు పరిశీలించకుండా ఆక్సిజన్‌ను ఎలా సరఫరా చేస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారికంగా తమ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, రాష్ట్ర స్థాయిలోనే పరీక్షల చేసిన అనంతరం ఖమ్మం జిల్లా ఆసుపత్రికి లిక్విడ్‌ ఆక్సిజన్‌ పంపుతామని, స్థానికంగా పరీక్షలు అవసరం లేదని ఇల్లెన్‌బెర్రి ప్రతినిధి సమాధానమిచ్చారు. అయితే ఉన్నత లక్ష్యంతో  అధికారిక ఒప్పందంతో ఎల్‌వోటీ ఏర్పాటు చేస్తే.. దానిపై ఔషధ పర్యవేక్షకులు అభ్యంతరం తెలపడం పట్ల జిల్లా ఆసుపత్రి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-01T09:47:08+05:30 IST