అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2020-03-27T09:48:02+05:30 IST

ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించినందున కరోనా కంట్రోల్‌ టీమ్‌ అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ ఆదేశించారు.

అందుబాటులో ఉండాలి

సమాచారం వెంటనే కాల్‌ సెంటర్‌కు తెలపాలి

విదేశాల నుంచి వచ్చినవారిని 14 రోజులు హోం క్వారంటైన్‌లో పెట్టాలి

పర్యవేక్షణ అధికారులకు డీఎంహెచ్‌ఓ ఆదేశం


అనంతపురం వైద్యం, మార్చి 26: ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించినందున కరోనా కంట్రోల్‌ టీమ్‌ అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక వైద్యశాఖ జిల్లాకార్యాలయంలో గురువారం కరోనా కంట్రోల్‌ టీమ్‌ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ఇప్పటికే అనేక విధాలుగా చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కి ప్రధానకారకులైన విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో బయటి ప్రాంతాల్లో తిరగకుండా చూడాలన్నారు.


అలాంటి వారి సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలో పర్యటిస్తూ విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం తెలుసుకోవాలన్నారు. వెంటనే అక్కడి పరిస్థితులను జిల్లా, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలో మరోసారి విదేశాల నుంచి వచ్చినవారి సమాచారం సేకరించాలన్నారు. కరోనా కంట్రోల్‌ టీమ్స్‌ అధికారులు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలన్నారు. ఇతర శాఖలను సమన్వయం చేసుకుని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పద్మావతి, రామసుబ్బారావు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు సుజాత, గంగాధర్‌రెడ్డి, ఇర్షాద్‌, శ్రీదేవి, డెమోలు ఉమాపతి, నాగరాజు, గంగాధర్‌, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T09:48:02+05:30 IST