సర్కారువారి బకాయి!

ABN , First Publish Date - 2022-05-02T05:47:41+05:30 IST

సామాన్యుడు వంద రూపాయల బిల్లు కట్టలేకపోతే గడువు తీరిన మరునాడే విద్యుత్‌ శాఖ సిబ్బంది రంగంలోకి దిగుతారు.

సర్కారువారి బకాయి!

  1. రూ.3,028 కోట్ల విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌ 
  2. జాబితాలో 37 ప్రభుత్వ విభాగాలు
  3. అత్యధికంగా హంద్రీ నీవా రూ.2,554 కోట్లు
  4. పంచాయతీలు చెల్లించాల్సింది రూ.321.42 కోట్లు
  5. తహశీల్దారు కార్యాలయాలకు సరఫరా నిలిపివేత
  6. నిధులు విడుదల చేయని ప్రభుత్వం

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): 

  సామాన్యుడు వంద రూపాయల బిల్లు కట్టలేకపోతే గడువు తీరిన మరునాడే విద్యుత్‌ శాఖ సిబ్బంది రంగంలోకి దిగుతారు. కనెక్షన్‌ కట్‌ చేస్తారు. అలాంటి విద్యుత్‌ శాఖకు జిల్లాలో రూ. 3 వేల కోట్లకు పైగా మొండి బకాయిలు ఉన్నాయంటే నమ్మగలరా? కానీ నిజం. ఇంతకూ బకాయిపడిందెవరో తెలుసా? 32 ప్రభుత్వ శాఖలు. అంటే సాక్షాత్తూ సర్కారే. కొన్ని శాఖలు నెలలుగా...మరికొన్ని శాఖలు ఏళ్లుగా బిల్లులు కట్టడం లేదు. ట్రాన్స్‌కో అధికారులు ‘అయ్యా.. బాబూ’ బిల్లులు కట్టండని ఆ శాఖల అధికారులను బతిమలాడినా ఫలితం కనిపించలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని సరిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు విద్యుత్‌ శాఖ కదిలింది. కొన్నిచోట్ల తహసీల్దార్‌ కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు పవర్‌ కట్‌ చేశారు. దీంతో సంబంధిత అధికారులు చీకట్లో విధులు నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ పెద్దల చొరవతో సరఫరా పునరుద్ధరించారు. కానీ బకాయిలపై దృష్టి పెట్టలేదు. హంద్రీ నీవా ఎత్తిపోతల ఇరిగేషన్‌ విభాగం ఒక్కటే రూ.2,554.64 కోట్లు బకాయి పడింది. ప్రభుత్వం సంబంధిత శాఖలకు నిధులు మంజూరు చేయకపోవడమే బకాయిలకు మూలం. 


ఏళ్లుగా అదే తీరు

 వ్యక్తిగత గృహావసరాలు, ప్రైవేట్‌ పారిశ్రామిక రంగం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖలు అనే మూడు విభాగాలు విద్యుత్‌ను వినియోగిస్తాయి. విద్యుత్‌ అధికారులు  వినియోగం మేరకు జెన్‌కోకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే సరఫరా విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే విద్యుత్‌ అధికారులు బిల్లుల వసూలులో ముందుంటారు. ప్రజల నుంచి నిబంధనల మేరకు కచ్చితంగా వసూలు చేస్తుంటారు. ఈ విషయంలో ప్రజలకన్నా ముందుండాల్సింది ప్రభుత్వ శాఖలు. కానీ జిల్లాలో మొండి బకాయిలన్నీ ప్రభుత్వ శాఖలవే. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆ శాఖల అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. ఇదే కారణంతో సంబంధిత శాఖలపై ట్రాన్స్‌కో ఒత్తిడి చేయలేకపోతోంది. దీంతో బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో నాలుగు రోజుల క్రితం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి, ఆస్పరి మండల తహసీల్దారు కార్యాలయాలకు పవర్‌ కట్‌ చేశారు. వెంటనే మంత్రి జోక్యంతో విద్యుత్‌ అధికారులు కనెక్షన్‌ ఇచ్చారు. బిల్లులు మాత్రం రాలేదు.  


హంద్రీ నీవాయే అధికం

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో 37 ప్రభుత్వ విభాగాలు రూ.3,028.39 కోట్లు బకాయి ఉంటే ...అందులో హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్‌ ఒక్కటే రూ.2,554.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. శ్రీశైలం ఎగువన మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందిస్తున్నారు. 11 స్టేజీల్లో లిఫ్టులు పని చేస్తున్నాయి. ఒక టీఎంసీ నీటిని ఎత్తి పోయడానికి విద్యుత్తు బిల్లు దాదాపు రూ.60 కోట్లు వస్తుంది. ఈ ఏడాది 26.65 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసినట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ లెక్కన రూ.1,599 కోట్లు విద్యుత్‌ బిల్లు వస్తుంది. జగన్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి హంద్రీనీవా ప్రాజెక్టు విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో బకాయి రూ.3,028.39 కోట్లకు చేరింది. రెండు జిల్లాల్లో లక్షలాది ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు కావడం వల్ల రూ.వేల కోట్లు బకాయి ఉన్నా పవర్‌ కట్‌ చేయలేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు.


నిధుల మళ్లింపుతో..:

హంద్రీనీవా ప్రాజెక్టు తరువాత బకాయిల స్థానం పంచాయతీ రాజ్‌దే. వీధి లైట్లు, తాగునీటి సరఫరా పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.321.41 కోట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 973 గ్రామ పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.310 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. వాటి ఖాతాలు ఖాళీ చేసింది. ఇప్పటి కీ ఆ నిధులు విడుదల చేయలేదు. దీంతో కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయి.   ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే విద్యుత్‌ శాఖ బకాయి పూర్తిగా చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణం స్పందించి నిధులు విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు. ఏపీఎస్‌ఐడీసీ ఎత్తిపోతల పథకాల ద్వారా రూ.59.20 కోట్లు, గ్రామీణ తాగునీటి విభాగం రూ.44.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

మంత్రి నియోజకవర్గంలో పవర్‌ కట్‌: 

పరిపాలనతో కీలకమైన రెవెన్యూ శాఖ రూ.5.40 కోట్లు చెల్లించాలి. నోటీసులు పంపినా స్పందన కరువు. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహించే ఆలూరు నియోజకవర్గంలో ఐదు మండలాల తహసీల్దారు కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేశారు. మంత్రి నియోజకవర్గంలో పవర్‌ కట్‌ చేస్తే జిల్లా అధికారులు స్పందిస్తారని ట్రాన్స్‌కో అధికారులు భావించారు. వారి ఆలోచనకు అనుగుణంగానే శనివారం కలెక్టరు రూ.10 లక్షలు బకాయి చెల్లించారని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు పూర్తి బకాయి చెల్లిస్తే జెన్‌ కో అప్పు చేయాల్సిన అవసరం ఉండదని, వడ్డీల రూపంలో అదనపు భారం పడదని అంటున్నారు. 

నోటీసులు జారీ చేశాం - కె.శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ, కర్నూలు: 

 ఉమ్మడి జిల్లాలో 37 ప్రభుత్వ విభాగాలు రూ.3,028.39 కోట్ల బకాయి పడ్డాయి. నోటీసులు జారీ చేశాం. సాగునీటి ప్రాజెక్టుల బిల్లులు ప్రభుత్వ నిధులపై ఆధారపడి ఉంటుంది. ఇతర శాఖలు సకాలంలో చెల్లించడం లేదు. రెవిన్యూ శాఖ బకాయి చెల్లించకపోవడంతో  కొన్ని తహసీల్దారు కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేశాం. వెంటనే మళ్లీ సరఫరా కొనసాగించాం. 

అత్యధిక బకాయి ఉన్న శాఖలు.. బకాయి రూ.కోట్లలో: 

--------------------------------------------------------------

ప్రభుత్వ శాఖ బకాయి

---------------------------------------------------------

హంద్రీ నీవా 2,554.64

పంచాయతీలు 321.42

ప్రభుత్వ లిఫ్టులు (ఏపీఎస్‌ఐడీసీ) 59.20

గ్రామీణ తాగునీటి విభాగం 44.78

శ్రీశైలం ప్రాజెక్టు 22.39

మున్సిపాలిటీలు 7.70

రెవెన్యూ శాఖ 5.40

వైద్య ఆరోగ్య శాఖ 3.35

ఏపీ ట్రాన్స్‌కో 3.22

విద్యా శాఖ 2.39

రోడ్డు రవాణా శాఖ 0.82

------------------------------------------------------------


Updated Date - 2022-05-02T05:47:41+05:30 IST