కొ‘నిషా’గింపేనా?

ABN , First Publish Date - 2021-10-09T05:35:47+05:30 IST

‘మద్యంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్య నిషేధం పక్కాగా అమలుచేస్తాం. ఆడపడచులకు కన్నీళ్లు లేకుండా చేస్తాం’... సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇది. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మద్యం విక్రయాలు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ఏడాదికి 25 శాతం చొప్పున దుకాణాలు తగ్గించి.. నాలుగేళ్లలో పూర్తిగా మూసివేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఈ రెండున్నరేళ్లలో ఒక్కసారి మాత్రమే షాపులు తగ్గించారు. తాజాగా మూడోసారి మద్యం పాలసీని ప్రకటించినా... షాపుల తగ్గింపు ఊసేలేదు. పైగా కొత్తగా పర్యాటకం మాటున బార్లకు అనుమతిచ్చారు. దీంతో మద్య నిషేధం ఉత్తమాటేనని తేలిపోయింది. ............................

కొ‘నిషా’గింపేనా?
రాజాంలో ప్రభుత్వ మద్యం దుకాణం

నూతన మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

గత ఏడాది షాపులు యథాతథం

25 శాతం తగ్గింపు తొలి ఏడాదికే పరిమితం

(రాజాం)

‘మద్యంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్య నిషేధం పక్కాగా అమలుచేస్తాం. ఆడపడచులకు కన్నీళ్లు లేకుండా చేస్తాం’... సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇది. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మద్యం విక్రయాలు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ఏడాదికి 25 శాతం చొప్పున దుకాణాలు తగ్గించి.. నాలుగేళ్లలో పూర్తిగా మూసివేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఈ రెండున్నరేళ్లలో ఒక్కసారి మాత్రమే షాపులు తగ్గించారు. తాజాగా మూడోసారి మద్యం పాలసీని ప్రకటించినా... షాపుల తగ్గింపు ఊసేలేదు. పైగా కొత్తగా పర్యాటకం మాటున బార్లకు అనుమతిచ్చారు. దీంతో మద్య నిషేధం ఉత్తమాటేనని తేలిపోయింది. 

............................

మద్య నిషేధం ఎన్నికల హామీగా మిగిలిపోయింది. సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులేస్తున్నట్టు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది. ఇప్పుడున్న మద్యం దుకాణాలనే మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 సెప్టెంబరు 22 వరకూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబరు 1 నూతన మద్యం పాలసీని ప్రకటించింది. రాష్ట్ర ఆదాయం దృష్ట్యా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపేందుకు నిర్ణయించింది. ఏడాదికి 25 శాతం షాపులను తగ్గించనున్నట్టు ప్రకటించింది. కానీ గత ఏడాది మార్చి తరువాత 19 షాపులను తగ్గించిన ప్రభుత్వం.. తరువాత రెండు మద్యం పాలసీలను ప్రకటించినా తగ్గింపు ఊసు ఎత్తలేదు. దీనికితోడు మద్యం భవిష్యత్‌ ఆదాయంపై రుణాలు తేవడంతో అసలు ప్రభుత్వానికి మద్యం నిషేధించాలన్న ఆలోచన లేదని తేటతెల్లమైంది.


 ఇదీ పరిస్థితి

టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 239 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిచేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని రద్దు చేసింది. 2019 అక్టోబరులో వైసీపీ ప్రభుత్వమే నేరుగా 187 దుకాణాలను ఏర్పాటు చేసింది. షాపునకు ఇద్దరు సేల్స్‌మేన్లు, ఒక సూపర్‌వైజర్‌ చొప్పున నియమించి మద్యం విక్రయిస్తోంది. 2020 మార్చి తరువాత షాపుల కుదింపులో భాగంగా జిల్లావ్యాప్తంగా 29 షాపులను తగ్గించారు. దీంతో అప్పటి నుంచి 158 మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. 2020 అక్టోబరులో రెండోసారి మద్యం పాలసీని ప్రకటించారు. కానీ షాపులను మాత్రం తగ్గించలేదు. 14 చోట్ల మాల్స్‌ను అదనంగా ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన మూడో మద్యం పాలసీలో కూడా అదే పరిస్థితి. కనీసం షాపులు తగ్గించే ప్రతిపాదనలు ఏవీ లేవు.


 ఆది నుంచీ తప్పులే...

మద్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆది నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ధరలు అమాంతం పెరగడం... నాసిరకం బ్రాండ్ల విక్రయాలు... షాపుల సమయం మార్చడం తదితర వాటిపై పెద్ద దుమారమే రేగింది. అన్ని పక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. మందుబాబులను మద్యం నుంచి దూరం చేయడంలో భాగమేనని ప్రభుత్వం సమర్థించుకుంటూ వచ్చింది. మద్యం ధరల ప్రభావంతో మందుబాబులు సారా వైపు మొగ్గారు. ఒడిశా మద్యం సైతం పెద్ద ఎత్తున దిగుమతి అయ్యింది. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా సారా ఏరులై ప్రవహిస్తోంది. మద్యం, సారా అక్రమ రవాణాకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగం కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. కేవలం తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో షాపులు మూతపడినా మద్యం విక్రయాలు సాగాయి. అప్పట్లో కొందరు సిబ్బంది పాత్రతోనే ఇది జరిగిందని విచారణలో తేలింది. కానీ ప్రభుత్వ మాత్రం తూతూమంత్రపు చర్యలకే పరిమితమైంది. 


బార్లు రెడీ!

- పర్యాటకం ముసుగులో అనుమతి

- సన్నాహాలు చేస్తున్న ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మద్య నిషేధంలో భాగంగా షాపులు తగ్గిస్తామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రైవేటుకు ‘బార్లు’ తెరుస్తోంది. పర్యాటకం ముసుగులో కొత్తగా మరికొన్ని బార్లకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ కొత్తగా 20 చోట్ల బార్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 158 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అక్కడ తాగేందుకు అనుమతి లేకుండా కేవలం విక్రయాలే జరుగుతున్నాయి. అందుకే తాజాగా బార్లకు అనుమతిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కొత్తగా తెరవనున్న బార్లలో మందుబాబులు కూర్చొని మద్యం తాగే ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పటికే శ్రీకాకుళంలో 3, రాజాంలో ఒక మద్యం బారు ఉంది. తాజాగా భావనపాడు, కోటబొమ్మాళి, టెక్కలి, నరసన్నపేట, బెజ్జిపురం, పొందూరు, హిరమండలం, మడ్డువలస, గార,  పాలకొండ, పైడిభీమవరం, చల్లవానిపేట, జాడూరు, బైరి, బైపల్లి పర్యాటక ప్రదేశాలుగా ఎంపిక చేసి కొత్త బార్లను తెరవనున్నారు. కొత్త బార్ల ఏర్పాటు విషయంపై ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఏసుదాసు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... జిల్లాలో పర్యాటక కేంద్రాలలో కొత్త బార్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. పర్యాటక శాఖ నిర్వహణలో బార్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఇండెంట్‌ ప్రకారం మద్యం సరఫరా చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-10-09T05:35:47+05:30 IST