- గవర్నర్ రవి ఆకస్మిక ప్రయాణం
- అంతరార్థం ఏమిటో?
అడయార్(చెన్నై): రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి శనివారం ఆకస్మికంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. రాష్ట్రంలో ప్రస్తుతం గవర్నర్‌కు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. నీట్ పరీక్షల మినహాయింపు బిల్లు, మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసు ముద్దాయిలు ఏడుగురి విడుదలకు సంబంధించి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపటంలో తీవ్ర జాప్యం ప్రదర్శించినందుకు స్టాలిన్ గవర్నర్‌ను తీవ్రంగా విమర్శించారు. అంతే కాకుండా వీసీల నియామకపు చట్టాన్ని సవరించి వీసీల నియామకంపై గవర్నర్‌కు ఉన్న అధికారాల్లో కోతపెట్టారు. ఈ అనిశ్చిత వాతావరణం నెలకొనివున్న నేపథ్యంలో గవర్నర్ ఆకస్మికంగా ఢిల్లీకి పయనం కావడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు కూడా రాజీవ్ హత్య కేసు ముద్దాయిల విడుదల విషయంలో రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం 10.35 గంటలకు విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఆదివారం రాత్రి 8.10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఆయన నగరానికి తిరిగిరానున్నారు. అయితే, గవర్నర్ చేపట్టిన ఈ ఆకస్మిక పర్యటన వెనుక ఉన్న ఆంతర్యం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే, గత కొన్ని నెలలుగా గవర్నర్ తరచుగా హస్తినకు ప్రయాణాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లినపుడు ఉండే హడావుడి, తిరిగి వచ్చిన తర్వాత లేశమాత్రం కూడా కనిపించడం లేదు. ఢిల్లీలో ఆయన సొంత ఇల్లు కట్టుకుంటున్నారని ఆ నిర్మాణపు పనులను పరిశీలించేందుకే వెళ్ళారని కొందరు చెబుతుంటే ఢిల్లీలో ఉన్న కుమార్తెను చూసేందుకే వెళ్ళారని మరికొందరు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి