విలేకరులతో మాట్లాడుతున్న కమిషనర్ వెంకటరావు
పంచదార ఉత్పత్తితో ఫ్యాక్టరీ నడవడం కష్టమే
రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ వెంకటరావు
చోడవరం, జనవరి 27: పంచదార ఉత్పత్తితోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మనుడ సాధించాలంటే కష్టమని, ఇథనాల్ యూనిట్ లేదా ఇతర అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో ఫ్యాక్టరీ గట్టెక్కగలదని రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ వి.వెంకటరావు అభిప్రాయపడ్డారు. గురువారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సహకార రంగంలో గోవాడ మినహా మిగిలిన ఫ్యాక్టరీలు నడవడం లేదని, ప్రైవేటు ఫ్యాక్టరీలలో సైతం కేవలం నాలుగు మాత్రమే నడుస్తున్నాయని చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాదికి ఎన్ని ఫ్యాక్టరీలు నడుస్తాయనేది సందేహమేనన్నారు. కేవలం పంచదార ఉత్పత్తితోనే ఫ్యాక్టరీ నడిచే పరిస్థితి కనిపించడం లేదని, అందువల్ల ప్రత్యామ్నాయాలు కూడా అన్వేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఫ్యాక్టరీకి మనుగడకు ఇబ్బంది ఉండదని, దీనికి కనీసం రూ100 కోట్లు ఖర్చు అవసరం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక, గోవాడ పరిధిలోని చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.25 కోట్లు ఉన్నాయని, అదే స్థాయిలో ఆప్కాబ్ అప్పు కూడా ఉందని చెప్పారు. రైతుల బకాయిలు త్వరలోనే క్లియర్ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ ఏడాది క్రషింగ్ జరగని ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును గోవాడ తరలించాలని సూచించామన్నారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కేన్ కమిషనర్ జీవీవీ సత్యనారాయణ, గోవాడ షుగర్స్ ఎండీ వి.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.