గోపాలమిత్రల గోస

ABN , First Publish Date - 2022-08-20T05:23:39+05:30 IST

గోపాలమిత్ర సిబ్బంది గౌరవ వేతనం అందక గోస పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఏడు నెలల గౌరవ వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పశు సంపద అభివృద్ధి కోసం గ్రామాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నా సక్రమంగా వేతనాలు రాక సతమతమవుతున్నారు.

గోపాలమిత్రల గోస

ఏడు నెలలుగా అందని గౌరవ వేతనం

కృత్రిమ గర్భధారణ లక్ష్యం పూర్తికాకుంటే జీతంలో కోత

చాలీచాలని వేతనంతో సతమతం

జిల్లాలో పనిచేస్తున్న 70 మంది గోపాలమిత్రులు


సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 19: గోపాలమిత్ర సిబ్బంది గౌరవ వేతనం అందక గోస పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఏడు నెలల గౌరవ వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పశు సంపద అభివృద్ధి కోసం గ్రామాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నా సక్రమంగా వేతనాలు రాక సతమతమవుతున్నారు. 


పాడిరైతులకు అందుబాటులో

2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్‌ లైవ్‌స్టాక్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ డీఎల్‌డీఏ) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాల మిత్రులు పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతోపాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందులు, వాక్సినేషన్‌, బీమా చేయడం పశువైద్యుల సూచనల మేరకు అన్ని రకాల వైద్య సేవలను వారు అందిస్తున్నారు. 


రూ.40 చొప్పున కట్‌

ఆయా మండలాల్లో ఉన్న గోపాలమిత్ర సిబ్బంది నెలకు 60 నుంచి 80 పశువులకు కృత్రిమ గర్భధారణ (సేమన్‌) చేయాలి. దీనికి గోపాలమిత్ర సిబ్బంది రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా నిర్ధేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాల్సిందే. లేదంటే నెల జీతంలో కోత తప్పదు. ఒక్కో పశువుకు రూ.40 చొప్పున వారి వేతనం నుంచి కట్‌ చేస్తారు. ఒక్కోనెల అనుకున్న లక్ష్యం పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కనీసం రెండు వేలు కూడా రావడం లేదని పలువురు గోపాలమిత్ర సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. 


ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారం

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ(డీఎల్‌డీఏ) ద్వారా పశు సంవర్ధకశాఖలో జిల్లాలో 70 మంది గోపాలమిత్ర సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8500 చొప్పున గౌరవవేతనం అందిస్తుంది. చాలీచాలనీ ఈ వేతనం కూడా ప్రతి నెలా అందడం లేదు. జిల్లాలో ఇప్పటికే గోపాలమిత్రలకు ఏడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంది.. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పారితోషికం సైతం రాలేదు. దీనితో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గోపాలమిత్ర సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.


ఉద్యోగ భద్రత కల్పించాలి

ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. చాలిచాలని గౌరవ వేతనంతో చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. కృత్రిమ గర్భధారణ చికిత్సకు టార్గెట్‌ లేకుండా చూడాలి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రతి నెలా తప్పనిసరిగా కనీస గౌరవ వేతనం వచ్చేలా చూడాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

Updated Date - 2022-08-20T05:23:39+05:30 IST