క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా?.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ప్రమాదం!

ABN , First Publish Date - 2021-07-20T01:21:21+05:30 IST

ప్రస్తుతం మనం ఉపయోగించే మొబైల్, కంప్యూటర్లు అన్నింటిలో ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్ గూగుల్ క్రోమ్.

క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా?.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ప్రమాదం!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం మనం ఉపయోగించే మొబైల్, కంప్యూటర్లు అన్నింటిలో ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్ గూగుల్ క్రోమ్. విండోస్, ఆండ్రాయిడ్‌లో బ్రౌజింగ్ కోసం విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్ ఇదే. వివాల్డి, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ బ్రౌజర్ వంటి అనేక ఇతర బ్రౌజర్లు కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్‌పైనే ఆధారపడి పనిచేస్తాయి. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. ఈ మేరకు సైబర్ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.


ప్రస్తుతం వాడుతున్న గూగుల్ క్రోమ్‌ను ఒక బగ్ సాయంతో హ్యాక్ చేయడం వీలవుతుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ బగ్ కోడ్‌ను హ్యాకర్లు మన మొబైల్స్ వంటి డివైజుల్లోకి ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందట. ఈ సెక్యూరిటీ లోపం ఇటీవలే బయటపడిందని గూగుల్ కంపెనీ తెలిపింది. అందుకే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించే వినియోగదారులు వెంటనే తమ క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ తెలిపింది. ఒకవేళ మనం వాడే క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ చేయకపోతే హ్యాకర్లు మన డేటా కాజేసే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది.


కొత్తగా వెలుగు చూసిన ఈ బగ్‌ను హ్యాకర్లు ఇప్పటికే వాడుతున్నట్లు గూగుల్ తన బ్లాగులో బయటపెట్టింది. మనకు తెలియకుండానే ఇలా హ్యాకర్లు మన డేటాను దొంగలిస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. హ్యాకర్లు ఈ దొంగిలించిన డేటాను మిలియన్ డాలర్లకు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెడుతున్నారట. అందుకే పాత గూగుల్ క్రోమ్ వెర్షన్‌లు వాడుతున్న యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ తెలిపింది. కచ్చితంగా గూగుల్ క్రోమ్ వెర్షన్ 91.0.4472.164 ఉండేలా చూసుకోవాలని ఈ టెక్ దిగ్గజం తెలిపింది.

Updated Date - 2021-07-20T01:21:21+05:30 IST