మీకు తెలుసా?.. గూగుల్ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంత సేకరిస్తోందో?

ABN , First Publish Date - 2022-01-28T03:12:45+05:30 IST

మనం ఇప్పుడు ఏ చిన్న సాయం కావాలన్నా వెంటనే గూగుల్‌‌లోకి దూరిపోతున్నాం. మనమొక్కరమే కాదు, ప్రపంచం

మీకు తెలుసా?.. గూగుల్ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంత సేకరిస్తోందో?

న్యూఢిల్లీ: మనం ఇప్పుడు ఏ చిన్న సాయం కావాలన్నా వెంటనే గూగుల్‌‌లోకి దూరిపోతున్నాం. మనమొక్కరమే కాదు, ప్రపంచం మొత్తం ఇప్పుడు గూగుల్‌కు బానిసైంది. అయినదానికి,  కాని దానికి గూగుల్‌లో వెతికేయడాన్ని అందరూ పనిగా పెట్టుకుంటున్నారు. సరే.. అది సమస్త విజ్ఞానాన్ని చిటికెన వేలిలోలోనే ఉంచుతోంది. బాగానే ఉంది. కానీ, అది మీ ఊహకు అందనంతంగా మీ వ్యక్తిగత డేటాను, సమాచారాన్ని సేకరిస్తోందన్న విషయం మీకు తెలుసా?


మీరు చేసే ప్రతీ సెర్చ్, మీరు చూసే ప్రతీ యూట్యూబ్ వీడియోపై అది అనధికారికంగా నిఘా వేస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ కూడా ‘హచ్ డాగ్’లా మీ వెంటే వస్తుంది. అక్కడ మీరెంతకాలం ఉన్నారో గుర్తుపెట్టుకుంటుంది. అంటే, మీరు లేచింది మొదలు తిరిగి నిద్రపోయేంత వరకు మీరు ఏం చేస్తున్నారన్న విషయాలన్నీ అది సంగ్రహిస్తుంది.

 

ఈ గూగుల్ ట్రాకింగ్ అమెరికాలోని ఇండియానా, టెక్సాస్, వాషింగ్టన్ స్టేట్, వాషింగ్టన్, డీసీ అటార్నీల దృష్టిని ఆకర్షించింది. గూగుల్ తమ లొకేషన్‌ను ట్రాక్ చేయకుండా ఆపడం కానీ, అలాగని యూజర్లను మోసం చేసి వారి గోప్యతకు గూగుల్ భంగం కలిగిస్తోందని ఆరోపించడం కానీ దాదాపు అసాధ్యమని వారు అంటున్నారు. దీంతో వారు లొకేషన్ డేటా వినియోగం విషయంలో గూగుల్‌పై దావా వేస్తున్నారు. 


అయితే, గూగుల్ తమ సమాచారాన్ని సేవ్ చేయకుండానే బ్రౌజ్ చేసే అజ్ఞాత మోడ్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో ఉంది. మీ ప్రైవేట్ డేటా గూగుల్‌కు చిక్కకుండా గూగుల్ యాక్సెస్‌ను పరిమితం చేసే సెట్టింగులను ఎంచుకోవడం ద్వారా గూగుల్ నిఘా నుంచి బయటపడవచ్చు. 


మీ పేరు, మీ ముఖం, పుట్టిన రోజు, మీ లింగం, మీరు ఉపయోగించే ఈ-మెయిల్ చిరునామాలు, మీ పాస్‌వర్డ్, ఫోన్ నంబరు వంటివన్నీ గూగుల్‌కు తెలుసు. వీటిలో కొన్ని పబ్లిక్ సమాచారంగా జాబితా చేసింది. అయితే, ఇందులో పాస్‌వర్డ్ లేదు. గూగుల్‌కు మన వ్యక్తిగత సమాచారం చిక్కకుండా ఉండాలంటే ఇలా చేయాలి.


* తొలుత బ్రౌజర్‌ విండోను ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్ పేజీకి వెళ్లాలి.

*  గూగుల్ యూజర్ నేమ్ (జీమెయిల్‌‌తో కానీ, లేకున్నా పరవాలేదు) టైప్ చేయాలి.

* మెనూ బార్‌లోకి వెళ్లి పర్సనల్ ఇన్ఫో, రివ్యూ ఇన్ఫర్మేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ మన ఫొటో, పేరు, బర్త్‌ డే, లింగం, పాస్‌వర్డ్, ఇతర ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబరు డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే మార్చుకోవచ్చు. 

* పబ్లిక్‌గా ఉన్నా పరవాలేదనుకునే సమాచారాన్ని చూడాలనుకుంటే స్క్రోల్ చేసి బాటమ్‌లోకి వెళ్లి ‘అబౌట్ మి’లోకి వెళ్లాలి. 

* ఈ పేజీలో ప్రతి లైన్, వ్యక్తుల ఐకాన్ (ఎవరికైనా కనిపిస్తుంది), కార్యాలయ భవనం చిహ్నం (మీ సంస్థకు మాత్రమే కనిపిస్తుంది) లాక్ చిహ్నం (మీకు మాత్రమే కనిపిస్తుంది)తో లేబుల్ చేసి ఉంటుంది. ఈ అంశాన్ని పబ్లిక్ చేయాలా? సెమీ పబ్లిక్ చేయాలా? లేదంటే పూర్తిగా ప్రైవేట్ చేయాలా? అని నిర్ణయించుకుని దాని ప్రకారం ముందుకెళ్లాలి. అయితే, ఈ సమాచారం పూర్తిగా ప్రైవేట్ చేయడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు.   

Updated Date - 2022-01-28T03:12:45+05:30 IST