Google location history: గర్భస్రావం ఆసుపత్రులకు వెళ్లేవారికి గూగుల్ ఆసక్తికర వార్త!

ABN , First Publish Date - 2022-07-02T16:35:41+05:30 IST

గర్భస్రావం చేసే ఆసుపత్రులు, గృహ హింస బాధితులకు ఆశ్రయమిచ్చే

Google location history: గర్భస్రావం ఆసుపత్రులకు వెళ్లేవారికి గూగుల్ ఆసక్తికర వార్త!

న్యూయార్క్ : గర్భస్రావం చేసే ఆసుపత్రులు, గృహ హింస బాధితులకు ఆశ్రయమిచ్చే ప్రదేశాలకు వెళ్ళే యూజర్ల లొకేషన్ హిస్టరీని తొలగిస్తామని గూగుల్ శుక్రవారం ప్రకటించింది. యూజర్లలో ఎవరైనా ఈ ప్రదేశాలకు వెళ్లినట్లు తమ సిస్టమ్ గుర్తిస్తే, వారు సందర్శించిన వెంటనే తాము ఈ ఎంట్రీలను లొకేషన్ హిస్టరీ నుంచి తొలగిస్తామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెన్ ఫిట్జ్‌పాట్రిక్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. 


రానున్న కొద్ది వారాల్లో ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపారు. డేటా ప్రైవసీని తమ కంపెనీ తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. వ్యక్తిగత గోప్యత అవసరమైన చోట ఈ చర్యలను అమలు చేస్తామని చెప్పారు. ఈ నిబంధనలను ఫెర్టిలిటీ సెంటర్లు, అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్, వెయిట్ లాస్ క్లినిక్స్‌కు కూడా వర్తిపజేస్తామని చెప్పారు. 


గర్భస్రావాలపై అమెరికా సుప్రీంకోర్టు నిషేధం

గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. ఈ తీర్పునకు అనుగుణంగా కొన్ని రాష్ట్రాలు గర్భస్రావాలపై నిషేధం విధించగా, మరికొన్ని రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలను విధించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. 


ఈ నేపథ్యంలో గర్భస్రావాలపై దర్యాప్తు, విచారణల సందర్భంగా లొకేషన్ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా చూడాలని ఉద్యమకారులు, రాజకీయ నేతలు టెక్ జెయింట్లను కోరుతున్నారు. 


Updated Date - 2022-07-02T16:35:41+05:30 IST