కాంగ్రెస్‌కు ఎన్‌పీ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-08-20T04:23:07+05:30 IST

బీజేపీ కీలక నాయకుల మం త్రాంగం ఫలించింది. మరో నాయకుడి చేరికకు రంగం సిద్ధమైంది. పీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

కాంగ్రెస్‌కు ఎన్‌పీ గుడ్‌బై
ఎన్‌పీ వెంకటేష్‌

నేడు లాంఛనంగా రాజీనామా ప్రకటన

ఫలించిన ఈటల రాయబారం 

రేపు చేరికకు సన్నాహాలు

అనుచరులు, కార్యకర్తలకు ఇప్పటికే సమాచారం


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీజేపీ కీలక నాయకుల మం త్రాంగం ఫలించింది. మరో నాయకుడి చేరికకు రంగం సిద్ధమైంది. పీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన రాజీనామా ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీ యంగా తెలిసింది. కాంగ్రెస్‌ను వీడే అంశంపై  గత కొంతకాలంగా ఊగిసలాటలో ఉన్న ఆయన తాజాగా అనుచరులు, కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ జరిపి, తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను బలంగా ఢీకొట్టాలంటే బీజేపీతోనే సాధ్యమనే భావనతో ఎన్‌పీ వెంకటేశ్‌ కమలంగూటికి చేరుతున్నారని క్యాడర్‌ చెబుతోంది. ఈనెల 21న మునుగోడులో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్‌షా సమ క్షంలో వెంకటేశ్‌ తన వర్గీయులతో బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలు స్తోంది.


ఈటల రాయబారం సఫలీకృతం

కాంగ్రెస్‌లో కొంతకాలంగా అసంతృప్తిగా ఎన్‌పీ వెంకటేశ్‌ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా, ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఈ నెల 9న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన ఇంటికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేయడంతో పాటు, ఆ సమయంలో పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం అప్పట్లో రాజకీయంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఎన్‌పీ వెంకటేశ్‌తో మాట్లాడి నచ్చజెప్పారు. దాంతో పార్టీ మార్పు నిర్ణయాన్ని అప్పట్లో వాయిదా వేసుకున్న ఆయన, తాజాగా బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ నడిపిన రాయబారం కారణంగా కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల దేవరకద్ర పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఈటల ఈయనతో టచ్‌లోకి వచ్చి, పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, రాజకీయ భవిష్యత్‌పై భరోసా కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి డీకే అరుణతో ఉన్న సత్సంబంధాలు, తాజాగా  మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్‌, నాగూరావు నామాజీ నుంచి సైతం పార్టీలోకి వస్తే భరోసా ఉంటుందనే సంకేతాలతో తుది నిర్ణయానికి వచ్చినట్లు ఎన్‌పీ వెంకటేశ్‌ అనుచరులు పేర్కొంటున్నారు. మహబూ బ్‌నగర్‌ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఎన్‌పీ వెంకటేశ్‌ న్యాయవాదిగా గుర్తింపు పొం దారు. తొలుత టీడీపీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేశారు. రాష్ట్ర విభజననంతరం 2017లో డీకేఅరుణ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆతర్వాత పీసీసీ కార్యదర్శిగా నియమితుల య్యారు. 2018 ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపినా, పార్టీ పొత్తుల్లో భాగంగా టీడీపీకి టికెట్‌ కేటాయించడంతో అప్పటి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కి మద్దతుగా పని చేశారు. ఆతర్వాత కూడా పార్టీలో క్రియాశీలకంగానే ఉంటూ వచ్చారు. అయితే 2018 తర్వాత కాంగ్రెస్‌లో ప్రజా సమస్యలపైనా, స్థానిక అంశాలపైనా పోరాడే అంశంలో సరైన మద్దతు, పార్టీ నుంచి ప్రోత్సాహం కరువయిందని ఆయన పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియ జేసినా స్పందన కరువైందని, ఈ నేపథ్యంలో పార్టీని వీడాలనే తుది నిర్ణయానికి వచ్చినట్లు వెంకటేశ్‌ పేర్కొంటుండడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. 

Updated Date - 2022-08-20T04:23:07+05:30 IST