వలకు విశ్రాంతి

ABN , First Publish Date - 2020-07-01T10:31:20+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సంప్రదాయ మత్స్యకారుల జీవితాలను ఛిద్రంగా మార్చేసింది. వలకు చిక్కిన మత్స్య సంపదను అమ్ముకునే అవకాశం

వలకు విశ్రాంతి

చేపలు కొనేవారు లేక తగ్గిన వేట.. లాక్‌డౌన్‌తో తెరుచుకోని మార్కెట్లు

మత్స్యకారుల జీవనానికి పెద్ద దెబ్బ

ఆర్థిక ఇబ్బందులతో సతమతం          


నరసాపురం, జూన్‌ 30 : కరోనా లాక్‌డౌన్‌ సంప్రదాయ మత్స్యకారుల జీవితాలను ఛిద్రంగా మార్చేసింది. వలకు చిక్కిన మత్స్య సంపదను అమ్ముకునే అవకాశం లేకుండా చేసింది. చేసేది లేక తాత్కాలికంగా వేటకు విరామం ప్రకటించుకోవాల్సి వస్తోంది. గోదావరి, కాల్వలు, ఉప్పుటేర్లలో వేలాది మంది మత్స్యకారులు ఏళ్ల తరబడి వేటనే నమ్ముకుని జీవిస్తున్నారు. పడవలపై కొంత మంది సంప్రదాయ వేట సాగిస్తుంటే, మరికొందరు వలకట్లపై బతకుతున్నారు. జిల్లాలో 275 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘంలో 500 నుంచి వెయ్యి మంది వరకు సభ్యులు ఉన్నారు. వేట మీదనే ఆఽధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 60 వేల మందికి పైగా ఉన్నారు. అత్యధికంగా కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం, గుటాల, సిద్దాంతం, ఆచంట, యలమంచిలి, దొడ్డిపట్ల, కోడేరు, నరసాపురం, వేములదీవి, బియ్యపుతిప్ప, మొగల్తూరు ప్రాంతాల్లో ఉన్నారు. గోదావరి, ఉప్పుటేర్లలో గాజురొయ్య, కొయ్యంగ, పండుగొప్ప, మగ చిప్ప, ఎర్రగొరక వంటి మత్స్యసంపద పుష్కలంగా లభిస్తుంది.


మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్‌ ఉండడంతో ఒక్కొక్కరి ఆదాయం సగటున  రోజుకు రూ.500పైనే  ఉంటుంది.  జిల్లావ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు లక్షల మంది ఈ వ్యాపారంపై జీవనోపాధి పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా సగటున రోజుకు రెండు నుంచి మూడు కోట్ల వరకు వ్యాపారం జరిగేది. హైదరాబాద్‌, బెంగళూరులతోపాటు ఇతర జిల్లాలకు ఎగుమతి జరిగేది. నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలాప్రాంతాల్లో ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే మార్కెట్‌కు అనుమతిస్తున్నారు.


ఇంటింటికి వెళ్లి మత్స్య సంపద విక్రయించుకునే అవకాశాలు లేకపోయాయి. వేటాడిన సరుకును అమ్ముకునేందుకు సరైన మార్గం లేక డిమాండ్‌ తగ్గిపోయింది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో పెద్దగా విక్రయాలు జరగడం లేదు. దీంతో వేటాడిన మత్స్య సంపదను అమ్ముకోలేక దాచుకోలేక చాలాచోట్ల వేటకు తాత్కాలికంగా విరామం ప్రకటించుకున్నారు. గోదావరి తీరంలో ఎక్కడ చూసినా.. కట్టేసిన ఖాళీ పడవలే కనిపిస్తున్నాయి. ఇటు వేట లేకపోవడంతో చాలా మంది మత్స్యకారులు వలలు, పడవల్ని రిపేరు చేసుకుంటున్నారు. 


అమ్మకాల్లేక విరామం

‘మత్స్య సంపదకు డిమాండ్‌ ఉండడం లేదు. అయినకాడికి అరువుపై అమ్ముకోవాల్సి వస్తోంది. ఉదయం మూడు గంటలు మాత్రమే మార్కెట్‌ జరుగుతుంది. ఆ సమయంలో అమ్మితే సరి. లేకుంటే అంతే. అందుకే వేటకు విరామం ఇచ్చేశా’ అని నరసాపురానికి చెందిన మత్స్యకారుడు విష్ణుమూర్తి వాపోయాడు. ‘లాక్‌డౌన్‌ సడలింపులతో వేట మొదలుపెట్టాం. కరోనా కేసులు పెరుగుతుండడంతో మూడు గంటలు మాత్రమే మార్కెట్‌కు అనుమతి ఇవ్వడంతో వ్యాపారం సాగడం లేదు. వేటకు స్వప్తి చెప్పి అప్పులు చేసుకుని తింటున్నాం’ అని మరో మత్స్యకారుడు బాలకృష్ణ చెబుతున్నారు.



Updated Date - 2020-07-01T10:31:20+05:30 IST