గొంతెండుతోంది..!

ABN , First Publish Date - 2022-05-25T06:31:31+05:30 IST

మండలంలోని 33 పంచాయతీల పరిధిలో 155 గ్రామాలు ఉన్నాయి.

గొంతెండుతోంది..!
తీగలమెట్టలో కలుషిత ఊటనీరు పట్టుకుంటున్న మహిళలు

- కొయ్యూరు మండలంలో నీటి కష్టాలు

- సగానికి పైగా గ్రామాలకు తాగునీటి సదుపాయం శూన్యం

- చాలా చోట్ల ఊటనీరే గతి

- కలుషిత జలాలు తాగి అనారోగ్యం

- అల్లాడిపోతున్న జనం

మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సగానికి పైగా గ్రామాలకు మంచినీటి సదుపాయం లేక జనం అల్లాడిపోతున్నారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో కలుషిత కొండవాగు ప్రవాహాల ఊటనీరు తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారు.


కొయ్యూరు, మే 24: మండలంలోని 33 పంచాయతీల పరిధిలో 155 గ్రామాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా కొండలపైనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బూదరాళ్ల, యు.చీడిపాలెం, మఠం భీమవరం, డౌనూరు, మూలపేట అంతాడ, పంచాయతీల పరిధిలో సుమారు 70 గ్రామాలకు ఇప్పటికీ తాగునీటి సదుపాయం లేదు.  దీంతో ఆయా గ్రామాల ఆదివాసీలు కొండవాగు ప్రవాహాల ఊటనీటిపెనేౖ ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాగునీటి వసతి కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామంటున్న ప్రభుత్వ ప్రకటనలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. 

ఊటనీరే గతి

యు.చీడిపాలెం పంచాయతీలో 17 శివారు గ్రామాలుండగా పంచాయతీ కేంద్రం తో పాటు పలకజీడికి మాత్రమే తాగునీటి వసతి ఉంది. మిగిలిన మర్రిపాకలు, పాలసముద్రం, వేమనపాలెం, గొళ్లబంద, ఎండకోట, రేవులకోట, తోటచిలుక, బిల్లుపాలెం, ఉల్లిగుంట, జెర్రిగొంది, కంఠవరం గ్రామాలలో కనీసం మంచినీటి బోర్లు లేవు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు కలుషిత ఊటనీటిని తాగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. 

మఠంభీమవరం పంచాయతీలో...

మఠంభీమవరం పంచాయతీలో 26 శివారు గ్రామాలు ఉండగా మఠంభీవరం, పోతవరం గ్రామాలకు మాత్రమే తాగునీటి వసతి ఉంది. మిగిలిన 10 గ్రామాలలో బోర్లు ఉన్నాయి. అయితే వాటి నుంచి నీరు అంతంత మాత్రంగానే వస్తుండటంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. మిగిలిన 12 గ్రామాలకు ఏవిధమైన తాగునీటి వసతి లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊటనీటికి కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లి తెచ్చుకుంటున్నారు. 

బూదరాళ్ల పంచాయతీలో..

బూదరాళ్ల పంచాయతీ విషయానికి వస్తే మండలంలోనే అతి పెద్ద పంచాయతీగా పేరుంది. 33 శివారు గ్రామాల సమాహార పంచాయతీలో బూదరాళ్ల, బాలరేవుల, గరిమండ వంతమర్రి, కన్నవరం గ్రామాలకు తాగునీటి వసతి ఉంది. అయితే బాలరేవులలో నీరు జిగురుగా ఉంటుంది. అందుకే దీనిని వినియోగించరు. అలాగే చీడిపల్లి, గోధుమలంక, సల్ధిగెడ్డ, కునుకూరు పీటీజీ వీధి, పిట్టలపాడు, గొర్రెలమెట్ట, సింగవరం, కిండంగి, ముకుడుపల్లి తదితర మరో 15 గ్రామాలకు తాగునీటి వసతి లేదు. ఊటనీటినే తాగుతూ వ్యాధులబారిన పడుతున్నారు. 

అంతాడ పంచాయతీలో..

అంతాడ పంచాయతీలో ఆరు గ్రామాలు, డైనూరులో ఐదు, మూలపేట ఎనిమిది శరభన్నపాలెం పంచాయతీలో రెండు, వెలగలపాలెంలో మూడు.. ఇలా ప్రతీ పంచాయతీలో ఒకటి రెండు గ్రామాలకు తాగునీటి సదుపాయం లేదు. గతంలో నిర్మించిన బోర్లుకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో బూదరాళ్ల పంచాయతీలో కొన్ని గ్రామాలకు గ్రావిటీ స్కీమ్‌లు మంజూరైనా ప్రస్తుత పాలకులు వాటి బిల్లుల చెల్లింపులు జరపక పోవటంతో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే ఈ ప్రభుత్వ హయాంలో సోలార్‌ వాటర్‌ పథకాలకు ప్రతిపాదనలు ఉన్నా మంజూరు చేయలేదు. దీంతో మండలంలో సగానికి పైగా గ్రామాలకు తాగునీరు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2022-05-25T06:31:31+05:30 IST