గోకులాలు.. గోడుగోడు

ABN , First Publish Date - 2021-08-24T05:16:18+05:30 IST

పాడి రైతులకు, పాడిపరిశ్రమ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి అయ్యే ఖర్చులో లబ్ధిదారుడు పదిశాతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించేలా పథకం రూపకల్పన చేశారు.

గోకులాలు.. గోడుగోడు
మాదినపాడులో పూర్తైన మినీ గోకులం

రెండేళ్లుగా అందని బిల్లులు

మినీ గోకులాల పథకానికి శాపం

ప్రభుత్వం మారడంతో పడకేసిన పథకం 

అప్పులతో షెడ్లు నిర్మించున్న లబ్ధిదారులు లబోదిబో

  


పాడి పరిశ్రమను ప్రోత్సహించాలి. పాడి రైతులకు లబ్ధి చేకూర్చాలి. పశువుల బాగోగులు చూడాలి.. అనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాల పథకాన్ని ప్రవేశపెట్టింది. మినీ గోకులం పథకంలో భాగంగా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. ఒక్కో యూనిట్‌కు రైతు 10 శాతం చెల్లిస్తే మిగతా 90 శాతం ఉపాధిహామీ నిధులతో పూర్తి చేయాల్సి ఉంది.  దీంతో జిల్లాలో పెద్దసంఖ్యలో పాడి రైతులు మినీ గోకులాల షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించి తమ వాటా మొత్తాన్ని కూడా చెల్లించి పేర్లు నమోదు చేయించుకుని షెడ్ల నిర్మాణం చేపట్టారు. తీరా ప్రభుత్వం మారడంతో రెండున్నరేళ్లుగా మినీ గోకులాల లబ్ధిదారులు బిల్లుల కోసం లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి మరీ షెడ్లు నిర్మించుకున్న వారు వడ్డీలు కట్టలేక అల్లాడుతున్నా అధికారులు వీరి గోడు ఆలకించడంలేదు. 



రూ.1.20 కోట్ల బకాయి

నరసరావుపేట నియోజకవర్గంలో పాడి రైతులు 89 గోకులాలను నిర్మించుకున్నారు. ఒక్కొక్క షెడ్‌ రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వ్యయంతో నిర్మించారు. 89 గోకులాల వ్యయం రూ.1.46 కోట్లు. కాగా రెండేళ్ల క్రితం 44.98 లక్షల బిల్లులు చెల్లించారు. ఇంకా సుమారు 1.20 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాలి. ఈ మొత్తం కోసం పాడి రైతులు ఎదురు చూస్తున్నారు. వీరి గోడు పట్టించుకునే వారే కరువయ్యారు. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

పాడి రైతులకు, పాడిపరిశ్రమ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి అయ్యే ఖర్చులో లబ్ధిదారుడు పదిశాతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించేలా పథకం రూపకల్పన చేశారు. ఎంతో ఉపయోగకరమైన ఈ పథకం ద్వారా షెడ్లు నిర్మించుకునేందుకు పెద్దసంఖ్యలో పాడి రైతులు ముందుకు వచ్చారు. పథకంలో భాగంగా రూ.1.80 లక్షలు షెడ్డు నిర్మాణం విలువ అంచనా కాగా ఇందులో రూ.18 వేలు లబ్ధిదారుల వాటాగా చెల్లించారు.  పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణలో షెడ్లు నిర్మాణం జరిగింది. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతవరకు బిల్లులు మంజురయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారేసరికి ఈ పథకానికి గ్రహణం పట్టింది. అప్పటికే నిర్మాణాలు మొదలుపెట్టిన వారు ఎప్పటికైనా బిల్లులు వస్తాయనే ఉద్దేశంతో షెడ్లు పూర్తి చేసుకున్నారు. అయితే బిల్లులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పాడిరైతులు బిల్లుల కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులను ఇప్పించాలని అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. గతంలో పథకంలో చేరి 10 శాతం నగదు కట్టిన వారు కూడా తాము కట్టిన నగదు ఇప్పించాలని కోరుతున్నారు. మినీ గోకులాలు మాకొద్దు అని పాడి రైతులు దరఖాస్తులను కూడా వెనక్కి తీసుకున్నారు. బిల్లులు మంజూరు కావనే ఉద్దేశంతో పాడిరైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.    

 - తెనాలి డివిజన్‌లో 18 మండలాల పరిధిలో 431 మంది లబ్ధిదారులకు మినీ గోకులాలు మంజూరయ్యాయి. అయితే  వీరిలో 146 మంది ఉపసంహరించుకోగా  285 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రారంభించిన మొదటి దశలో మాత్రం ఒక్కొక్కరికి రూ.1000-2000 జమ అయ్యాయి. అది కూడా 10 శాతం లోపు లబ్ధిదారులకు మాత్రమే అందినట్లు సమాచారం. వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 109 మంది లబ్ధిదారుల్లో 75 మంది నిర్మాణాలు చేపట్టలేదు. 34 మంది నిర్మాణాలను వివిధ దశాల్లో పూర్తి చేశారు. వీరిలో ఒకరి పేరు మాత్రమే ఎం బుక్‌లో నమోదు కావడం వల్ల వారి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. తెనాలి నియోజకవర్గంలోని 20 మంది నిర్మాణాలను వివిధ దశల్లో పూర్తి చేశారుకాని ఏ ఒక్కరికి కూడా నిధులు జమ కాలేదు. 

 - మినీ గోకులాల పథకం కింద 2019లో తాడేపల్లి మండలంలో షెడ్లు నిర్మించుకునేందుకు చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. తొలుత 12మంది నిర్మాణానికి మొగ్గు చూపగా, 11 మంది అసలు ప్రారంభించలేదు. ఈ 12 మందిలో ప్రాతూరులో ఒకరు, చిర్రావూరులో ఇద్దరు, నిర్మాణాలు చేసుకున్నారు. మిగిలిన 9మంది నగదును వాపసు తీసుకున్నారు. వీరిలో ప్రాతూరుకు చెందిన రైతుకు రూ.20 వేలు రాగా, మిగిలిన ఇద్దరికి కేవలం రూ.1200 చొప్పునే చెల్లింపులు జరిగాయి.  

 - తాడికొండ మండలంలో 30 మంది మినీ గోకులాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29 మంది రైతులు వారు కట్టాల్సిన 10 శాతం ఖర్చును చెల్లించారు. అనంతరం గోకులం షెడ్లు నిర్మించుకున్న తరువాత బిల్లులు రావనే ఉద్దేశంతో దరఖాస్తులు వెనక్కు తీసుకున్నారు. ఒకరు మాత్రమే బిల్లులతో సంబంధం లేకుండా మినీ గోకులం షెడ్డును నిర్మించుకున్నారు. ఆ రైతుకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు.

 - సత్తెనపల్లి నియోజకవర్గంలో మినీ గోకులం పథకం కింద నిర్మించిన షెడ్లకు బిల్లులు రాక పాడిరైతులు ఇబ్బంది పడుతున్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి, రెంటపాళ్ల, పెదమక్కెనలో ఒక్కొక్కటి చొప్పున, రాజుపాలెం మండలంలో ఏడు, నకరికల్లు మండలంలో 3, ముప్పాళ్ల మండలంలో 4 షెడ్లను లబ్ధిదారులు నిర్మించుకున్నారు. పథకం పూర్తై రెండేళ్లు అవుతున్నా నేటికీ బిల్లులు రాకపోవటంతో కొంతమంది లబ్ధిదారులు తాము కట్టిన రూ.18 వేలు వెనక్కు తీసుకోగా కొంతమంది మొత్తం డబ్బులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. 

- మాచర్ల నియోజకవర్గంలో మినీ గోకులాల షెడ్ల నిర్మాణాలకు సంబంధించి 50 శాతం మాత్రమే బిల్లులు చేశారు. చాలా వరకు నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. మాచర్ల మండలానికి మొత్తం 19 మంజూరు కాగా అందులో 10 షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వెల్దుర్తి మండలానికి 18 మంజూరు కాగా 6, దుర్గి మండలానికి 20 మంజూరు కాగా 14 మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి.  

- గురజాల నియోజకవర్గంలో సుమారు 25కు పైగా మినీ గోకులాలు మంజూరయ్యాయి. వీటిలో 20 వరకు నిర్మాణాలు అప్పట్లోనే పూర్తిచేశారు. ఒక్కొక్క మినీ గోకులానికి రూ.2 లక్షల అంచనాతో షెడ్ల నిర్మాణం పూర్తిచేసినా బిల్లులు మాత్రం అప్పుడప్పుడు కొంత జమ చేశారు. ఇంకా రూ.50 వేలకు పైగా రావాల్సిన లబ్ధిదారులు ఉన్నారు. షెడ్ల నిర్మాణం పూర్తైన వాటిలో ఒకటో రెండో కాస్త దెబ్బతినగా మిగిలినవన్నీ బాగానే ఉన్నప్పటికీ బిల్లులు మాత్రం నేటికీ అందలేదు. గురజాల నియోజకవర్గంలో రెండున్నరేళ్ల క్రితమే పూర్తైన మినీ గోకులాలకు ఇప్పటికీ సుమారు రూ.10 లక్షల పైచీలకే చెల్లింపులు జరగాల్సి ఉంది. 

- వినుకొండ నియోజకవర్గంలో మొత్తం 55 మినీ గోకులాలు, 42 మేకలు, గొర్రెలకు గోకులాలు యజమానులకు మంజూరవగా 23 నిర్మించారు. ఈపూరు మండలంలో 4, నూజెండ్ల మండలంలో 4 మినీగోకులాలకు మాత్రమే సగం బిల్లులు మంజూరయ్యాయి. మిగతా వాటికి బిల్లులు అందిన దాఖలాలు లేవు. 42 మేకలు, గొర్రెల గోకులాలకు 11 పూర్తికాగా వీటిలో 6 యూనిట్లకు మాత్రమే సగం బిల్లులు మంజూరయ్యాయి. 

- చిలకలూరిపేట మండలంలో 45 మంది లబ్ధిదారులు మినీ గోకులాల షెడ్లు నిర్మించుకోగా వీరిలో 27మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగిలినవారికి మాత్రం బిల్లులు చెల్లించలేదు. యడ్లపాడు మండలంలో 14 షెడ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీరిలో 12 మంది నిర్ణీత వ్యవధిలో తమ వాటా చెల్లించగా మిగిలిన ఇద్దరు చెల్లించలేదు. 12 మందిలో ఇద్దరు షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన పదిమందిలో కొందరు బేస్‌ లెవల్‌ నిర్మాణాలు పూర్తిచేయగా మిగిలినవారు ప్రారంభించలేదు. పూర్తయిన షెడ్లకు, బేస్‌లెవల్‌ పూర్తి చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. దీంతో 12 మంది లబ్ధిదారులు తాము చెల్లించిన నగదు తిరిగి తీసుకున్నారు. నాదెండ్ల మండలంలో 6 మినీ గోకులాలు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో వివిధ దశలలో అవి ఆగిపోయాయి.  

- పెదకూరపాడు మండలంలో 24 గోకులాలకు 18, అచ్చంపేట మండలంలో 38కు 26, అమరావతి 52కు 43, క్రోసూరు 16కు 14, బెల్లంకొండ 15కు తొమ్మిది మినీ గోకులాలు నిర్మించారు.  మరికొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగి పోయాయి. అయితే వీటికి సంబంధించి ఇంతవరకు బిల్లులు మంజూరుకాలేదు.  

 

పెరిగిపోతున్న వడ్డీ భారం

పశువులకు మినీ గోకులం ఎంతగానో ఉపయోగపడుతుందని షెడ్డు నిర్మించుకున్నాను. నిర్మాణం పూర్తిచేసి రెండేళ్లకుపైగానే దాటింది. అప్పుడు కొంత, అప్పుడు కొంత జమకాగా ఇంకా రూ.50 వేలు అందాలి. షెడ్డు నిర్మాణానికి తెచ్చిన అప్పు వడ్డీతో పెరిగిపోతుంది. మిగిలిన బకాయి ఎప్పుడిస్తారో తెలియటం లేదు. 

- దాసు, మాదినపాడు


Updated Date - 2021-08-24T05:16:18+05:30 IST