నెక్లెస్‌ గండం

ABN , First Publish Date - 2020-07-03T10:47:40+05:30 IST

గోదావరికి వరద సమయంలో పోలవరం పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కొన్నేళ్ల క్రితమే సంరక్షణ చర్యలకు

నెక్లెస్‌ గండం

ముంచుకొస్తున్న గోదావరి వరద

పోలవరంలో కుంగిపోయిన రక్షణగోడ

ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ప్రతిపాదనలు 

కునుకులేక బిక్కుబిక్కుమంటున్న జనం

వరద పోటెత్తితే ఊరంతా గోదారే


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): గోదావరికి వరద సమయంలో పోలవరం పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కొన్నేళ్ల క్రితమే సంరక్షణ చర్యలకు ప్రతిపాదనలు జరిగాయి. గోదావరి  నీరు గ్రామంలోకి రాకుండా చుట్టూ రక్షణ గోడ.. నెక్లెస్‌ బండ్‌ నిర్మించాలని తలపెట్టారు. 2009లోనే అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రక్షణ గోడ నిర్మించేందుకు దాదాపు ఆరు కోట్లు కేటాయించారు. తారు రోడ్డు నిర్మించడంతో పాటు మురుగు నీరు, వర్షపు నీరు ఊళ్లోంచి గోదావరిలో కలిసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి చేరినా పోలవరం రక్షణ విషయంలో ఏ లోటు లేకుండా ఉండాలని ఆదేశించారు.


లంకల్లో రైతులను ఒప్పించి, పెద్దఎత్తున మట్టి తరలించి ఊరు చుట్టూ మట్టిగోడ నిర్మించారు. కానీ చాలా కాలంగా నక్లెస్‌ బండ ఏర్పాటులో నిర్లక్ష్యం తొంగిచూసింది. గడిచిన దశాబ్ద కాలంలో నాలుగుసార్లు వరద ఊరిలోకి ప్రవేశించి.. ప్రజలను బెంబేలేత్తించింది. కొందరు ఇళ్ల నుంచి అప్పట్లో బయటకు రాలేక వరద నీటిలోనే ఊళ్లో చిక్కుకుపో యారు. అప్పుడు రక్షణ బలగాలు రంగంలోకి దిగి ఇళ్లల్లో వున్న వారిని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. ఇళ్లన్నీ బురద మయం అయ్యాయి. అనేక వస్తువులు నీటిలో కొట్టుకుపో యాయి. పరిస్థితి ఇలా ఉధృత రూపం దాల్చినప్పుడు ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో తేలిపోయింది. కానీ ఆ తరువాత రక్షణ బండ విషయంలో చూసి చూడ నట్లు వదిలేయడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెల కొంది. 


తాజాగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టినప్పుడు నదీ ప్రవాహంలో మార్పులు వచ్చాయి. గతంలో ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అత్యంత వేగంగా దిగువకు చేరేది. దీనికి విరుద్దంగా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాల కారణంగా ప్రవాహ వేగంలో మార్పులు వచ్చాయి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో కుడి, ఎడమల వైపు కొంత భాగం మాత్రమే ఇంకా పూడ్చకపోవడంతో ఆ దిశగానే వరద దిగువకు దూసుకురావాల్సి ఉంది. ఈ నేపఽథ్యంలోనే ప్రవాహంలో ఒరవడి తీవ్రత రెండింత లైంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎడమ వైపు నుంచి వస్తున్న నీరు దిగువ కాఫర్‌ డ్యామ్‌ను తాకి అక్కడ నుంచి కుడి వైపునకు చేరి నేరుగా నెక్లెస్‌ బండ ప్రాంతం వైపు దూసుకువస్తోంది. గతేడాది కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన కొద్దిరోజుల తరువాత గోదావరిలో ప్రవాహం భారీఎత్తున పెరిగి నెక్లెస్‌ బండ్‌ కాస్త కొన్ని చోట్ల నదిలోకి కుంగిపోయి మాయంకాగా, మరికొన్నిచోట్ల పలుచబడింది. సుమారు ఆరు వందల మీటర్ల మేర నెక్లెస్‌బండ కోతకు గురైంది. ఇదే అప్పట్లో పోలవరంలో నిద్ర లేని రాత్రులు గడపడానికి కారణమైంది. ప్రమాదం పొంచి ఉండడంతో గ్రామస్తులే గట్టుకు గండి పడకుండా స్వచ్ఛందంగా కాపలాకు దిగాల్సి వచ్చింది.


పెండింగ్‌లోనే ప్రతిపాదనలు 

నెక్లెస్‌ బండ్‌కు పొంచి ఉన్న వరద ప్రమాదం కారణం గా అందరూ అప్రమత్తమై వ్యవహరిస్తుండగా ఇంకా అధికారులు మాత్రం ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం ఇంకా రాలేదంటున్నారు. వాస్తవానికి రక్షణ గోడ కాస్త 30 మీటర్లు ఎత్తున, 15 మీటర్ల వెడల్పున గోదావరి ప్రవాహానికి ఒకింత అడ్డుగా పోలవరం చుట్టూ నిర్మించారు. ఇప్పటికే ఎక్కడికక్కడ బండ్‌కు వున్న అండలు నీటిలో జారిపోతున్నాయి. కొన్నిచోట్ల గట్టు పూర్తిగా బలహీనపడింది. ఈ వేసవిలోనే గట్టు పటిష్టా నికి వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.


దీనిపై ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లకు తగిన ఆదే శాలు జారీ చేయనూలేదు. ఇప్పుడేమో వరద ప్రవాహం తొలి దశలోనే అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఒకవేళ గడిచిన ఏడాది మాదిరిగానే భారీ వరదలు సంభవిస్తే రక్షణ గోడ పటిష్టంగా నిలిచే అవకాశాలు ఏ మాత్రం లే వని గ్రామస్తులంతా ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే పెరి గిన వరదల కారణంగా ఎగువ కాపర్‌ డ్యామ్‌కు వెళ్లేం దుకు నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక మార్గం కొట్టుకు పోయిన విషయాన్ని గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. 


12 కోట్లతో అంచనాలు

‘రింగ్‌బండ్‌ నిర్మాణానికి దాదాపు రూ.12 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ పనులన్నీ పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లకు అప్పగించినట్లు సమాచారం.’ అని గోదావరి హెడ్‌వర్క్స్‌ ఈఈ మోహనరావు తెలిపారు. ‘నివేదిక లైతే ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చాం. స్పష్టమైన ఆదేశాలు అందిన తరువాతే పటిష్ట చర్యలు తీసుకుంటాం’ అని ప్రాజెక్టు డీఈ బాలకృష్ణ చెబుతున్నారు.


కంటి మీద కునుకు లేదు

గోదావరి ఎక్కడ  పోటెత్తుతుందా, ఊరు మీదకు విరుచుకు పడు తుందా అని కంటి మీద కునుకులేకుండా ఉన్నాం. రేయింబవళ్లు కాపలా కాసేందుకు అలవాటు పడ్డాం. రింగ్‌ బండ్‌ మరమ్మతులు ఈ పాటికే చేసి ఉండాలి. కానీ అది జరగలేదు. ఎప్పుడు ఏ క్షణాన  ప్రమాదం ముంచుకొస్తుందో. తక్షణం బండకు రక్షణ చర్యలు తీసుకోవాలి. 

 - సూరవరపు సుబ్బారావు, పాత పోలవరం 


పిల్లా పాపలతో ఉన్నాం 

పిల్లా పాపలతో ఉన్నాం. ఇప్పటికే గట్టు కాస్తా కోతకు గురైంది. ఇంతకు ముందు మురుగు నీరు పోవడానికి గట్టుకు కొంత గండికొట్టారు. ఇప్పుడేమో వర్షాలు మొదలయ్యాయి. గోదా వరిలో నీరు పెరుగుతోంది. ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా గడుపుతున్నాం. దీనికి తగ్గట్టు అధికారులు కదలాలి. రక్షణగోడకు మరమ్మతులు చేపట్టాలి. 

- డేరా ప్రభావతి, పాత పోలవరం


Updated Date - 2020-07-03T10:47:40+05:30 IST