జెండా ఆవిష్కరణను అడ్డుకున్నారో జాగ్రత్త : గోవా సీఎం

ABN , First Publish Date - 2021-08-14T22:44:18+05:30 IST

జాతీయ జెండాను ఎగురవేయవద్దని భారత నావికా దళాన్ని

జెండా ఆవిష్కరణను అడ్డుకున్నారో జాగ్రత్త : గోవా సీఎం

పనాజీ : జాతీయ జెండాను ఎగురవేయవద్దని భారత నావికా దళాన్ని తిప్పి పంపిన సావో జసింటో దీవి వాసులపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గోవా పోలీసులు సహకరిస్తారని, జెండాను ఎగురవేయాలని నావికా దళాన్ని కోరారు. 


75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మన దేశంలోని అన్ని దీవుల్లోనూ జాతీయ జెండాను ఎగురవేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను భారత నావికా దళం నిర్వహిస్తుంది. 


భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ హంస స్థావరం అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, గోవా నావికా దళ ప్రాంతం నుంచి ఓ బృందం ఈ రాష్ట్రంలోని దీవులను సందర్శించిందని చెప్పారు. జాతీయ జెండా ఆవిష్కరణకు సావో జసింటో దీవి వాసులు అభ్యంతరం తెలిపారని చెప్పారు. స్థానికుల నిరసనల కారణంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. 


200 మంది నివసించే దీవి

గోవాలోని వాస్కోడి గామా సమీపంలో సావో జసింటో దీవి ఉంది. ఈ దీవి పరిధి సుమారు ఒక కిలోమీటరు ఉంటుంది. ఇక్కడ దాదాపు 200 మంది నివసిస్తున్నారు. ఇక్కడ గతంలో ఓ లైట్ హౌస్ ఉండేది. ఇక్కడి ప్రజలు కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తారు. ఇతర పంటలను సాగు చేయడానికి యోగ్యమైన భూమి లేదు. 


జరగనిచ్చేది లేదు : ఎన్‌సీపీ నేత

గోవా మాజీ రెవిన్యూ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గోవా శాఖ ప్రెసిడెంట్ జోస్ ఫిలిప్ డిసౌజా మాట్లాడుతూ, జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరగనివ్వబోమని తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నావికా దళం అధికారులు చెప్పారన్నారు. నావికా దళమైనా, ప్రభుత్వమైనా, ప్రైవేటు కంపెనీ అయినా, ఇక్కడ అలాంటి కార్యక్రమాలను జరగనిచ్చేది లేదన్నారు. ఈ విషయంలో తాము సమైక్యంగా ఉన్నామన్నారు. ఈ దీవిని ఆక్రమించాలని అనుకుంటున్నారన్నారు. ఈ ఆలోచన నావికా దళానిదైనా, కేంద్ర ప్రభుత్వానిదైనా, దానిని అంగీకరించేది లేదన్నారు. 


గోవా సీఎం హెచ్చరిక

భారత దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం ఓ ట్వీట్‌ ద్వారా హెచ్చరించారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా సావో జసింటో దీవిలో జాతీయ జెండాను భారత నావికా దళం ఆవిష్కరించే కార్యక్రమంపై కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడం దురదృష్టకరం, సిగ్గుచేటు అని పేర్కొన్నారు.  దీనిని ఖండిస్తున్నానని, తన ప్రభుత్వం ఇటువంటి చర్యలను సహించబోదని స్పష్టం చేశారు. మొదట్లో నిర్ణయించినట్లుగానే ఈ దీవిలో జెండాను ఆవిష్కరించాలని భారత నావికా దళాన్ని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గోవా పోలీసులు తమ సహకారాన్ని అందజేస్తారని చెప్పినట్లు తెలిపారు. భారత దేశ వ్యతిరేక చర్యలను ఉక్కు పిడికిలితో తిప్పికొడతామన్నారు. 


Updated Date - 2021-08-14T22:44:18+05:30 IST