రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు

ABN , First Publish Date - 2020-11-01T10:18:58+05:30 IST

రాత్రివేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు వైసీపీ నాయకులు తెరతీశారు.

రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు

 వైసీపీ నాయకుల హస్తం


కొల్లూరు, అక్టోబరు 31 : రాత్రివేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు వైసీపీ నాయకులు తెరతీశారు. ఈపూరులో మృతుల పేరిట అధికారపార్టీ నేతలు ఇసుక తవ్వకాలకు అనుమతులు తెచ్చారనే వివాదం సమసిపోకముందే మరోచోట ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలకు పూనుకోవడం గమనార్హం! కొల్లూరు మండలంలోని పెసర్లంక వద్ద ఉన్న అరవిందవారధి పరిసరాల్లో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు  ఇసుక అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు సమాచారాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులకు చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తవ్వకాల జరిగేచోటకు వచ్చి కూడా ఈ తతాంగాన్ని అడ్డుకోలేకపోయారు. పది, పదిన్నర గంటల సమయంలో వేమూరు ఎస్‌ఐ లోకేశ్వరరావు వారధి వద్దకు వస్తున్నారని తెలుసుకున్న అక్రమార్కులు యంత్రాన్ని, ట్రాక్టర్లను అక్కడనుంచి తరలించి దాచిపెట్టారు. ఎవరైనా వస్తే సమాచారం ఇచ్చేందుకు ముందస్తుగానే కొల్లూరు కరకట్ట, ఆవులవారిపాలెంఅడ్డరోడ్డు వద్ద అక్రమార్కులు నిఘా ఏర్పాటుచేసుకుని జాగ్రత్తపడ్డారు. అక్రమంగా తవ్విన ఇసుకను పెదలంక, పెసర్లంకతోపాటు మరికొన్ని గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా చేరవేసి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. సహజ వనరులను కాపాడాల్సిన అధికారులు మిన్నకుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-11-01T10:18:58+05:30 IST