ఉపాధిలో రూ.30 లక్షల అవినీతి

ABN , First Publish Date - 2020-10-31T07:40:05+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పథకంలో సుమారు రూ.30 లక్షల అవినీతి చోటు చేసుకున్నట్లు 12వ ప్రజావేదికలో అధికారులు గుర్తించారు.

ఉపాధిలో రూ.30 లక్షల అవినీతి

వినుకొండ ప్రజావేదికలో తేల్చిన అధికారులు


వినుకొండ టౌన్‌, అక్టోబరు 30: జాతీయ ఉపాధి హామీ పథకంలో సుమారు రూ.30 లక్షల అవినీతి చోటు చేసుకున్నట్లు 12వ ప్రజావేదికలో అధికారులు గుర్తించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 వరకు మండలంలో జరిగిన రూ.7.91 కోట్ల ఉపాధి పనులపై ఎంపీడీవో శివయ్య అధ్యక్షతన శుక్రవారం ప్రజావేదిక నిర్వహించారు. కొప్పుకొండలో సుమారు రూ.12 లక్షలు, నీలగంగవరంలో సుమారు రూ.10 లక్షలు, జాలలపాలెంలో సుమారు రూ.4 లక్షలు, నాగులవరంలో రూ.1.48 లక్షల అవినీతి చోటు చేసుకున్నట్లు  గుర్తించారు.



కొప్పుకొండలో కాలువ పూడికతీత పనులు రికార్డులకే పరిమితమైనట్లు తేల్చారు. ఫీల్డ్‌అసిస్టెంట్‌పై విచారణకు ఆదేశించారు. జాలలపాలెంలో గ్రామ తీర్మానం లేకుండానే పనులు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఉప్పరపాలెంలో మస్టర్‌ అవకతవకలపై ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కిరణ్‌కుమార్‌ను అధికారులు నిలదీశారు. గ్రామాల్లో ప్రధానంగా మేట్లు ఇచ్చిన మస్టర్‌ నివేదిక అనంతరం ఫీల్డ్‌ అసిస్టెంట్లు కొత్తవారిని చేర్చి నగదు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించి రికవరీకి ఆదేశించారు. కొప్పుకొండ, నీలగంగవరం గ్రామాల్లో సర్ప్‌ పథకం కింద మూడేళ్ల క్రితం నాటిన మొక్కలు రెండేళ్ల క్రితమే లేవని గుర్తించారు. అయితే ఆ మొక్కలు ఉన్నట్లు సబ్సిడీ కింద కొన్ని ప్రాంతాల్లో నగదు డ్రా చేసినట్లు ఇందులో రూ.19 లక్షల మేర అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో అవినీతిపై, ఫీల్డ్‌ అసిస్టెంట్లపై, మొక్కలపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ చేపడతామని డ్వామా జిల్లా ఏపీడీ జోసఫ్‌కుమార్‌ తెలిపారు. ప్రజావేదికలో విజిలెన్స్‌ అధికారి విజయ్‌కుమార్‌, ఏపీవో సురేఖ, ఎస్‌ఆర్‌పీ రమేష్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T07:40:05+05:30 IST