వైభవం..తోలేళ్ల ఉత్సవం

ABN , First Publish Date - 2021-10-19T04:26:47+05:30 IST

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో తొలి ఘట్టం పూర్తయ్యింది. సోమవారం తొలేళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాము గరిడీలు, పులి వేషాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలతో సందడి నెలకొంది. కొవిడ్‌ నిబంధనల నడుమ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాన్సాస్‌ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు,

వైభవం..తోలేళ్ల ఉత్సవం
పట్టు వస్త్రాలను తీసుకొస్తున్న అశోక్‌గజపతిరాజు కుటుంబసభ్యులు


పులకించిన భక్తజనం

పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు 

అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు

ప్రత్యేక ఆకర్షణగా పులివేషాలు, సాము గరిడీలు

ఉచిత దర్శనం రద్దు ప్రచారంతో క్యూలైన్లు వెలవెల

సాయంత్రం 5 గంటల తరువాత పెరిగిన రద్దీ

విజయనగరం రూరల్‌, అక్టోబరు 18:

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో తొలి ఘట్టం పూర్తయ్యింది. సోమవారం తొలేళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాము గరిడీలు, పులి వేషాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలతో సందడి నెలకొంది. కొవిడ్‌ నిబంధనల నడుమ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాన్సాస్‌ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె అదితి గజపతిరాజు పురోహితులు నిర్ణయించిన మేరకు ఉదయం 7.45 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు వేదమంత్రాలతో అశోక్‌ కుటుంబాన్ని ఆశీర్వదించారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకు ముందు ఆదివారం రాత్రి 10.35 గంటల సమయంలో అమ్మవారిని తోలేళ్ల ఉత్సవానికి సిద్ధం చేశారు. పంచామృతాలు, నదీ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. సర్వాంగసుందరంగా అలంకరించారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు ఘటాలతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పులివేషాలు, సాముగరిడీలతో కళాకారులు సందడి చేశారు. 

కోట శక్తికి ఘాటాభిషేకం 

తొలేళ్ల ఉత్సవంలో ప్రధానమైనది కోట శక్తికి ఘాటాభిషేకం. హుకుంపేట వాసులు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఘాటాలను తీసుకువచ్చారు. హుకుంపేట, పుచ్చలవీధి, ఉల్లివీధి, గంటస్తంభం మీదుగా అమ్మవారి ఆలయానికి ఘటాలు చేరుకున్నాయి. అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఘటాలను మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణ నడుమ కోట వద్ద  ఉన్న కోట శక్తి వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయం ముందు ఉంచారు. 

 రైతులకు విత్తనాల పంపిణీ 

సిరిమానును అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరమణ అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంతాల రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. వీటిని తీసుకునేందుకు రైతులు అర్ధరాత్రి వరకూ వేచి ఉన్నారు. రాత్రి 12 గంటల వరకూ ప్రక్రియ కొనసాగింది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో పండుగ రోజుల్లో అమ్మవారి ఉచిత దర్శనం లేదంటూ తొలినుంచీ ప్రచారం చేశారు. దీనిపై టీడీపీ భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించడం, అనంతరం జిల్లా అధికార యంత్రాంగానికి, దేవదాయశాఖకు భక్తుల మనోభావాలను తెలియజేయడంతో చివరికి ఉచిత దర్శనాన్ని కల్పించారు. ఉచిత దర్శనం ఉందన్న విషయం చాలామందికి తెలియక ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ క్యూలైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. సాయంత్రం 5 గంటల తరువాత భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది.  




Updated Date - 2021-10-19T04:26:47+05:30 IST