Abn logo
Sep 17 2021 @ 23:51PM

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

తూప్రాన్‌ మండలం యావాపూర్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తున్న బీజేపీ మెదక్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహిచారు.  సెప్టెంబరు 17న తెలంగాణకు పూర్తి స్వాతంత్య్రం లభించిందని సంగారెడ్డి, మెదక్‌ బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం ముందు విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని ప్రకటించిన కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక ఓటు బ్యాంకు రాజకీయల కోసం ఎంఐఎంకు తలొగ్గి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటు అని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమరుల త్యాగాలకు విలువనిస్తూ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

సంగారెడ్డిలో 

సంగారెడ్డిఅర్బన్‌/హత్నూర/జిన్నారం/గుమ్మడిదల/నారాయణఖేడ్‌, సెప్టెంబరు 17 : సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం సందర్భంగా శుక్రవారం సంగారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్మల్‌ సభకు భారీగా తరలివెళ్లారు. అలాగే బైపా్‌సరోడ్డులో జిల్లా కార్యదర్శి జె.మురళీధర్‌రెడ్డి, బాలాజీనగర్‌లో మరో జిల్లా కార్యదర్శి సమరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశ్వంత్‌ ఆధ్వర్యంలో వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కల్వకుంట రోడ్డులో జరిగిన విమోచన దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ప్రముఖ్‌ స్వామి హాజరయ్యారు. హత్నూర మండలంలోని హత్నూర, గుండ్లమాచునూర్‌, బోర్పట్లలో బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేశారు. జిన్నారం మండలం మాధారంలో అమరవీరుల స్తూపం వద్ద మాజీ సర్పంచ్‌ సురేందర్‌గౌడ్‌, జిన్నారంలో బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌, గుమ్మడిదలలో బీజేపీ మండలాధ్యక్షుడు చింతల యాదగిరి,  ఖేడ్‌లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శోభన్‌రాథోడ్‌, ఏబీవీపీ నగర కార్యదర్శి ఆకాష్‌ ఆధ్వర్యంలో  జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.  

మెదక్‌లో

మెదక్‌అర్బన్‌/తూప్రాన్‌రూరల్‌/తూప్రాన్‌/శివ్వంపేట/చిల్‌పచెడ్‌/చేగుంట/ చిన్నశంకరంపేట/అల్లాదుర్గం/హవేళీఘణపూర్‌/రామాయంపేట, సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెదక్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తూప్రాన్‌ మండలం యావాపూర్‌లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టెల ఆంజనేయులు యాదవ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు యాదగిరి, మండల కమిటీ పార్టీ అధ్యక్షుడు సిద్ధిరాములుయాదవ్‌, ప్రదానకార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్‌, బీజేవైఎం అధ్యక్షుడు శేఖర్‌, యావాపూర్‌ గ్రామ కమిటీ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, సురేశ్‌, శేఖర్‌, నాని, రాజు, రమేశ్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

తూప్రాన్‌లో మహంకాళి ఆలయ అవరణలో పట్టణ అఽధ్యక్షుడు రామునిగారి మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. శివ్వంపేట మండలంలోని నవాబుపేట, ఉసిరికపల్లి, తిమ్మాపూర్‌, చిన్నగొట్టిముకలో, చేగుంట, నార్సింగి మండలాల్లో బీజేపీ నాయకులు, చిల్‌పచెడ్‌ మండలంలోని జగ్గంపేటలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌, చిన్నశంకరంపేట, సూరారం, చందంపేట, ఖాజాపూర్‌లో బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు యాదగిరి, అల్లాదుర్గంలోని బీజేపీ కార్యాలయం వద్ద రాములు నేతృత్వంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. హవేళీఘణపూర్‌ మండలంలోని కూచన్‌పల్లి, పోచమ్మరాల్‌, ఫరీద్‌పూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో, రామాయంపేటలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.