ఆ రెండు రాష్ట్రాల్లో ఒక్క అవకాశం ఇవ్వండి: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-02-13T22:44:47+05:30 IST

గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ..

ఆ రెండు రాష్ట్రాల్లో ఒక్క అవకాశం ఇవ్వండి: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. సంక్షేమం, అభివృద్ధి సంబంధిత పనులకు తాము భరోసా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌ను కాంగ్రెస్, బీజేపీ చెరో పదేళ్లు పాలించాయని, గోవాలో కాంగ్రెస్ 27 ఏళ్లు, బీజేపీ 15 ఏళ్లు పాలించాయని అన్నారు. గోవా, ఉత్తరాఖండ్ ప్రజలను కాంగ్రెస్, బీజేపీలు లూటీ చేశాయని ఆరోపించారు. మళ్లీ ఆ పార్టీలకే ఓటు వేస్తే లూటీ ఆగదని చెప్పారు. ఈసారి తమ పార్టీ 'ఆప్' బరిలో ఉందని, సంక్షేమం, అభివృద్ధి పనులకు భరోసా ఇచ్చే ఆప్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.


విద్య, ఆరోగ్యం, విద్యుత్ సహా పలు రంగాల్లో ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేశామని, రెండు రాష్ట్రాల్లోనూ (గోవా, ఉత్తరాఖండ్) తమకు అవకాశమిస్తే ఇదే తరహా అభివృద్ధి చేసి చూపిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. కొండప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో హెల్త్‌కేర్ సేవలు, అన్ని గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాల కోసం ఎవరూ వసల వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వలసలు వెళ్లిన వారిని వెనక్కి రప్పిస్తామన్నారు. గోవాలోనూ ఇదేతరహాలో స్కూళ్లు, ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు పెంచుతామని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యేలా చేసి, భూమి హక్కులు కల్పిస్తామని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.




గోవా సీఎం అభ్యర్థిగా తాము ప్రకటించిన అమిత్ పలేకర్ నిజాయితీ, అవినీతి మచ్చలేని వ్యక్తి అని కేజ్రీవాల్ తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థి కల్నల్ (రిటైర్డ్) అజయ్ కొథియాల్ పదవీ విరమణ చేసిన తర్వాత 10,000 మంది పిల్లలకు ఆర్మీలో చేరేందుకు శిక్షణ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్టేనని, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు బీజేపీలోకి వెళ్లిపోతారని, కాంగ్రెస్‌కు ఓటు వేసి ఓటును వృథా చేసుకోవద్దని అన్నారు. బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేనివారు తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలు, 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 14న పోలింగ్ జరుగనుంది.

Updated Date - 2022-02-13T22:44:47+05:30 IST