అలా ఇచ్చి.. ఇలా గిచ్చి

ABN , First Publish Date - 2020-11-01T06:43:20+05:30 IST

జిల్లాలో పంచాయతీలకు ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. వీటి పేరుతో వచ్చే కోట్లాది నిధులను అడ్డగోలుగా తన అవసరాలకు దారి మళ్లించేస్తోంది.

అలా ఇచ్చి.. ఇలా గిచ్చి

  • జిల్లాలో పంచాయతీల ఆర్థిక సంఘం నిధులు అడ్డగోలుగా దారి మళ్లింపు
  • కేంద్రం నుంచి రెండుదఫాలుగా జిల్లాకు రూ.270 కోట్లు మంజూరు
  • అయినా ఇవ్వకుండా అయిదు నెలలుగా తొక్కిపెట్టేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • పేరుకు పంచాయతీ ఖాతాల్లో జమ.. కానీ చిల్లిగవ్వ కూడా వాడకుండా అనధికార ఆంక్షలు
  • బిల్లులు పెట్టినా సీఎఫ్‌ఎంఎస్‌,ట్రెజరీ నుంచి మంజూరవక లబోదిబో
  • ఒకపక్క అప్పులు పేరుకుపోయి, పారిశుధ్య నిర్వహణ లేక, జీతాలు చెల్లించలేక ఇక్కట్లు

జిల్లాలో పంచాయతీలకు ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. వీటి పేరుతో వచ్చే కోట్లాది నిధులను అడ్డగోలుగా తన అవసరాలకు దారి మళ్లించేస్తోంది. ఎక్కడికక్కడ ఎన్నో సమస్యలు పంచాయతీలను వేధిస్తున్నా అవేం ఖాతరు చేయకుండా తన అవసరాలను తీర్చుకుంటోంది. రికార్డుల్లో మాత్రం వీటికి నిధులు మంజూరైనట్టు చూపిస్తూ చేతికి ఒక్క రూపాయి అందకుండా అనధికార ఆంక్షలు విధించింది. ఒకపక్క కేంద్రం నుంచి ఠంఛనుగా ఆర్థిక సంఘం నిధులు పుష్కలంగా మంజూరవుతుంటే వాటన్నింటిని గుటుక్కున మింగేస్తూ పంచాయతీలను రోడ్డున పడేస్తోంది. అడిగేనాథుడు లేకపోవడంతో ప్రతి క్వార్టర్‌ నిధులను ఇలాగే స్వాహా చేస్తోంది. ఒకటీరెండు కాదు, ఏకంగా రూ.270 కోట్లు వేరే ఖాతాలకు పంపి వాడేసుకుంది. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో 1,064 పంచాయతీలున్నాయి. వీటికి ఏటా మూడు క్వార్టర్ల కింద కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తుంది. ప్రతి క్వార్టర్‌కు జిల్లాలో అన్ని పంచాయతీలకు కలిపి రూ.135 కోట్లు మంజూరవుతాయి.  వాస్తవానికి ఈ నిధులను ఎప్పటికప్పుడు కేంద్రం ఠంఛనుగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల్లో పంచాయతీల ఖాతాలకు వీటిని జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో పంచాయతీలు తమ పరిధిలో పారిశుఽధ్య నిర్వహణ, రహదారుల మరమ్మతులు, తాగునీటి సమస్యలు పరిష్కరించుకోవడం, గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, సిబ్బందికి జీతాలు చెల్లించడం వంటివన్నీ చేస్తాయి. ఆర్థిక సంఘం నిధులు మినహా పంచాయతీలకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు తక్కువ కావడంతో ఈ నిధులే పెద్దదిక్కు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. పంచాయతీలకు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను అడ్డగోలుగా వాడేస్తోంది. కేంద్రం నుంచి నిధులు వచ్చిన ప్రతిసారి పంచాయతీ ఖాతాలకు మొక్కుబడిగా జమచేస్తూ ఆనక తెలివిగా వాటిని మింగేస్తోంది. పంచాయతీల చేతికి చిల్లిగవ్వ కూడా అందకుండా చేస్తోంది. దీంతో ఇప్పుడు జిల్లాలో అన్ని పంచాయతీలు నిధుల కొరతతో తీవ్రంగా సతమతమవుతున్నాయి. ఏ చిన్న అవసరం కూడా తీర్చుకోవడానికి కాసుల్లేక కటకటలాడుతున్నాయి. మూడు నెలల కిందట 14వ ఆర్థిక సంఘం చివరి క్వార్టర్‌ నిధులు జిల్లాలో అన్ని పంచాయతీలకు కలిపి రూ.135 కోట్లు విడుదలవగా ఆయా ఖాతాలకు జమ చేశారు. దీంతో ప్రతి పంచాయతీ ఖాతాల్లో డబ్బులు పడ్డట్టు సమాచారం వెళ్లింది. తీరా కార్యదర్శులు వీటిని తీయడానిని ప్రయత్నిస్తే చిల్లిగవ్వ కూడా రాక తలలు పట్టుకుంటున్నారు. తీరా విష యం ఆరాతీస్తే పంచాయతీలకు మంజూరు చేసిన నిధులు ఏమాత్రం వినియోగించకుండా ప్రభుత్వమే అనధికార ఆంక్ష లు విధించింది. సీఎఫ్‌ఎంఎస్‌, ట్రెజరీలకు విషయం వివరిం చి పంచాయతీల నుంచి వచ్చే బిల్లులకు డబ్బులు చెల్లించవద్దని చెప్పింది. దీంతో ఇప్పుడు జిల్లాలో ఏ ఒక్క పంచాయతీకి చేతిలో పైసా లేదు. ప్రస్తుతం వర్షాలు..అటు శీతాకాలం సీజన్‌ ఆరంభం నేపథ్యంలో ఎక్కడికక్కడ గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పారిశుధ్య సమస్య దారుణంగా ఉంది. దీనిపై స్థానికుల నుంచి పంచాయతీలకు ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా డబ్బులు లేక ఏంచేయలేని పరిస్థితి. మేజర్‌ పంచాయతీలు కొంతలో కొంత నిధులు ఏదోలా సమీకరించుకుని సమస్యలు పరిష్కరించకుంటుంటే.. మైనర్‌ పంచాయతీలు మాత్రం ముక్కుతూమూలుగుతూ నడుస్తున్నాయి. తాజాగా మూడు రోజుల కిందట 15వ ఆర్థిక సం ఘం నిధులు మళ్లీ రూ.135 కోట్లు జిల్లాలో అన్ని పంచాయతీలకు మంజూరయ్యాయి. దీంతో పంచాయతీ అధికారులు ఆనందపడ్డారు. ఈసారైనా అప్పులు, ఉద్యోగుల జీతాల బకాయిలు తీర్చి గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మింగేస్తోంది. చేతికి ఏమాత్రం పైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏంచేయాలో తెలియక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పేరుకుపోయిన సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఈ నిధులను వచ్చే ఏడాది మార్చి వరకు పంచాయతీలకు చెల్లించవద్దనే ఆదేశాలు ట్రెజరీలకు అనధికారికంగా అందాయి.

Updated Date - 2020-11-01T06:43:20+05:30 IST