నడుస్తూ వెళ్తున్న యువతి.. స్కూటీపై వెంబడిస్తూ టీజ్ చేసిన కుర్రాళ్లు.. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో..

ABN , First Publish Date - 2021-09-19T02:17:34+05:30 IST

అదో వీఐపీ ఏరియా. అక్కడ బడాబడా రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దలూ నివసిస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశంలో ఉండే సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ.. అంతటి సెక్యూరిటీ కూడా ఓ యువతిని వేధింపుల నుంచి రక్షించలేకపో

నడుస్తూ వెళ్తున్న యువతి.. స్కూటీపై వెంబడిస్తూ టీజ్ చేసిన కుర్రాళ్లు.. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో..

ఇంటర్నెట్ డెస్క్: అదో వీఐపీ ఏరియా. అక్కడ బడాబడా రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దలూ నివసిస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశంలో ఉండే సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ.. అంతటి సెక్యూరిటీ కూడా ఓ యువతిని వేధింపుల నుంచి రక్షించలేకపోయింది. అదే దారిలో వెళ్లే ఓ ప్రయాణికుడు.. ఆ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకూ ఓ యువతిపడ్డ ఇబ్బందిని గుర్తించలేకపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


రాయ్‌పూర్‌లోని శంకర్ నగర్ ప్రాంతంలో ఓ యువతి భగత్ సింగ్ చౌక్‌కు వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇద్దరు ఆకతాయిలు స్కూటీపై అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆ యువతిని ఉద్దేశిస్తూ అసహ్యంగా మాట్లాడారు. తమతోపాటు రావాలని వేధించడం ప్రారంభించారు. దీంతో సదరు యువతికి కన్నీరు ఆగలేదు. ఆ బాధలోనే రోడ్డు వెంబడి నడుచుకుంటూ అక్కడ నుంచి బయల్దేరింది. అయినప్పటికీ ఆ ఆకతాయిలు ఆమెను విడిచిపెట్టలేదు. స్కూటీపై వెనకాలే ఫాలో అయ్యారు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళ్తున్న ఓ ప్రయాణికుడు.. ఈ దృశ్యాలను వీడియో తీశారు. అంతేకాకుండా.. పోలీసులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 



సాక్షాత్తు ఆ రాష్ట్ర స్పీకర్ చరణ్‌దాస్ మహంత్, కొందరు మంత్రులు నివసించే ఏరియాలో ఓ యువతి వేధింపులకు గురికావడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికంగా ఉన్న సెక్యూరిటీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ ఆకతాయిలను.. నితిన్ శర్మ, రాజు శర్మలుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారు మద్యం మత్తులో యువతిని వేధించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనను తమ దృష్టికి తెచ్చిన సదరు ప్రయాణికుడిని పోలీసులు అభినందించారు. కాగా.. ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ ఏరియాలోనే ఓ మహిళకు సెక్యూరిటీ లేకపోతే.. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఏంటిని ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2021-09-19T02:17:34+05:30 IST