నీళ్లకు డిమాండ్‌

ABN , First Publish Date - 2021-04-12T06:47:03+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు రోజుకు 600

నీళ్లకు డిమాండ్‌

ముదిరిన ఎండల ప్రభావం

ఆగుతూ పోస్తున్న ఇళ్లలో బోర్లు

నగరానికి వాటర్‌బోర్డు నీళ్లే ఆధారం

కరోనాతో పెరిగిన నీటి అవసరాలు

పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచన


నగరంలో నీళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఎండలు ముదురుతుండడంతో నగరవాసుల నీటి అవసరాల పెరిగాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో బోర్ల నీళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో వాటర్‌బోర్డు నీళ్లే ప్రధాన ఆధారంగా మారాయి. నీటి వాడకం పెరగడానికి కరోనా సెకండ్‌ వేవ్‌ కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వాటర్‌బోర్డు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు రోజుకు 600 మిలియన్‌ గ్యాలన్లు అవసరముండగా, ఔటర్‌ పరిధిలోని గ్రామాలతో పాటు శివారు మున్సిపాలిటీల అవసరాలు తీరాలంటే 700 మిలియన్‌ గ్యాలన్లకు పైగా కావాల్సి ఉంటుంది. ఔటర్‌ వరకు విస్తరించిన మహానగరంలో ప్రస్తుతం నల్లా కనెక్షన్లు 10.60లక్షలున్నాయి. ప్రస్తుతం బోర్డు సుమారు 450 మిలియన్‌ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. ఇందులో నాగార్జున్‌సాగర్‌ నుంచి కృష్ణా జలాలను మూడు ఫేజ్‌ల్లో 270 మిలియన్‌ గ్యాలన్లను రోజూ తీసుకొస్తుండగా, ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను 170 మిలియన్‌ గ్యాలన్లను వినియోగిస్తున్నారు. దాంతో పాటు సింగూరు, మంజీరా రిజర్వాయర్లతో పాటు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీళ్లను నగర అవసరాలకు వాడుతున్నారు. 


ముదిరిన ఎండలతో..

సాధారణంగా ఓ వ్యక్తికి రోజుకు 150 లీటర్లను సరఫరా చేయాల్సి ఉంది. కానీ, 66 లీటర్ల నుంచి 71 లీటర్లు మాత్రమే వాటర్‌బోర్డు అందజేస్తోంది. ఇటీవల ప్రభుత్వ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సాధారణ రోజుల్లో ఆ నీటితోనే ప్రజలు అవసరాలను తీర్చుకున్నారు. కానీ వేసవితో నీటి అవసరాలు పెరిగాయి. దీనికి తోడు ముదిరిన ఎండల ప్రభావంతో నగరంలోని ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, మల్కాజిగిరి, మారేడుపల్లి, జూబ్లీహిల్స్‌, బంజారహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్‌, తదితర ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఉన్న బోర్ల నీళ్లు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో బోర్డు సరఫరా చేసే నీరు సరిపోని పరిస్థితి ఏర్పడింది.


కరోనాతో 

సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో నగరవాసులు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆఫీసుకు వెళ్లేముందు, వచ్చిన తర్వాత స్నానాలు చేస్తున్నారు. తినే ముందు, తుమ్మినా, దగ్గినా చేతులను సబ్బులతో శుభ్రం చేస్తున్నారు. తరచూ ఇళ్లను శుభ్రం చేయడం, ఏ రోజు వస్త్రాలను అదే రోజు ఉతికిందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల గతంతో కంటే నీటికి డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది విపరీతమైన ఎండలు, కరోనా ప్రారంభ దశలో భయంకరమైన పరిస్థితులు వచ్చినా వాటర్‌బోర్డు ప్రణాళిక బద్దంగా పని చేసి నీటి ఇబ్బందులు లేకుండా చేసింది. లాక్‌డౌన్‌ తో వాణిజ్య అవసరాలకు నీటి వినియోగం లేకపోవడంతో అంతగా ఇబ్బందులు రాలేదు. ప్రస్తుతం బేవరేజెస్‌, కూల్‌డ్రింక్‌ కంపెనీలకు నీటి సరఫరా పెరిగింది. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, మాల్స్‌ అన్నీ నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో నీటి డిమాండ్‌ ప్రస్తుతం అధికంగా ఉంది. 


పొదుపు మంత్రం 

దుస్తులు ఉతికిన నీళ్లను మరుగుదొడ్డి క్లీనింగ్‌కు వాడడం, కూరగాయలు, గిన్నెలు ఇతరాత్ర కడిగిన నీళ్లను మొక్కలకు వినియోగించడం, వాహనాలను అధిక నీటితో కాకుండా తడి వస్త్రంతో తుడవడం తదితర పద్ధతుల ద్వారా నీటిని పొదుపుగా వాడాలని బోర్డు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


అదనపు నీటి తరలింపునకు ఏర్పాట్లు

గ్రేటర్‌ పరిధిలో 455 మిలియన్‌ గ్యాలన్లు రోజూ సరఫరా చేస్తున్నాం. నీటి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో మరో 40 మిలియన్‌ గ్యాలన్ల నీటిని అదనంగా సరఫరా చేస్తాం. కరోనా నేపథ్యంలో కొన్ని కార్యాలయాలు వర్క్‌ ఫ్రమ్‌ హోం నిర్వహిస్తున్నాయి. వాటికి సరఫరా చేసే నీటిని గృహ అవసరాలకు మళ్లిస్తాం. నగరవాసులు నీటిని పొదుపుగా వాడి సహకరించాలి. 

- దానకిషోర్‌, వాటర్‌బోర్డు ఎండీ

Updated Date - 2021-04-12T06:47:03+05:30 IST