అధికార పక్షం..ద్విముఖ వ్యూహం

ABN , First Publish Date - 2020-09-22T07:27:36+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్‌ లేదా జనవరిలో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్ల ద్వారా పట్టభద్రుల

అధికార పక్షం..ద్విముఖ వ్యూహం

జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ నజర్‌

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి

కార్పొరేటర్లకు బాధ్యతలు

త్వరలో వర్క్‌షాప్‌


మహానగరంలో ఎన్నికల మూడ్‌ కనిపిస్తోంది. రాజకీయ పార్టీలతోపాటు సామాన్యులూ ఎలక్షన్ల అంశంపై చర్చించుకుంటున్నారు. ఎప్పుడన్నది ఖరారు కానప్పటికీ.. జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తప్పకుండా ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో పార్టీలు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా అధికార పక్షం ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్‌ లేదా జనవరిలో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్ల ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. 2017 మార్చి నాటికి డిగ్రీ తత్సమాన అర్హత కలిగిన వారిని పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. సాధారణ ఓటర్‌ జాబితాలో పేరు లేని వారి వివరాలూ నమోదు చేయించనున్నారు. ఇప్పటికే ఒక్కో డివిజన్‌ నుంచి 15 మంది పేర్లను కార్పొరేటర్ల ద్వారా పార్టీ నేతలు సేకరించారు. వీరితో నేరుగా పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు మాట్లాడుతారని చెబుతున్నారు. త్వరలో వారితో వర్క్‌షాప్‌ ఉంటుందని, ఆన్‌లైన్‌లో పట్టభద్రుల ఓటర్ల నమోదు ఎలా చేయాలన్న దానిపై శిక్షణ ఇస్తామని ఓ నాయకుడు చెప్పారు.


సోమవారం పింగలి వెంకట్రామిరెడ్డి హాలులో గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో మంత్రులు, మేయర్‌, డిప్యూటి మేయర్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. కిందటిసారి సరైన వ్యూహం లేకపోవడంతో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని, ఈ సారి విజయం సాధించడమే లక్ష్యంగా పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని సూచించారు. ఒక్కో కార్పొరేటర్‌ తమ డివిజన్‌లో 1000-1500 మంది పట్టభద్రులు, సాధారణ ఓటర్ల పేర్లు నమోదు చేయించాలని లక్ష్యం నిర్ధేశించారు. ఇది గ్రేటర్‌ ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. 


ఓటర్ల నమోదు... విస్తృత ప్రచారం...

ఒకే దెబ్బకు అన్నట్టుగా.. జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. గత పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ విజయం సాధించిందన్నది అధికార పార్టీ వర్గాల భావన. ఈ నేపథ్యంలో అదే వ్యూహం పకడ్భందీగా అమలు చేయాలనుకుంటున్నారు. అంతకుముందుతో పోలిస్తే పార్టీకి నగరంలో కేడర్‌, సంస్థాగత బలం ఉందని ఇది తమకు లాభిస్తుందని గ్రేటర్‌కు చెందిన ఓ నేత తెలిపారు. గ్రేటర్‌లో ఒక్కో డివిజన్‌లో 40 నుంచి 60, 70 వేల వరకు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ డివిజన్లలో పోలయ్యే ఓట్లు 50 శాతంలోపే ఉంటాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదు చేయించే 1000-1500 ఓట్లు విజయానికి దోహదపడుతాయన్నది అధికార పార్టీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. 


అభివృద్ధిపై విస్తృత ప్రచారం

నగరంలో పూర్తయిన, పురోగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, పేదలు ఆత్మగౌరవంగా నివసించేందుకు నిర్మిస్తున్న ఇళ్లు, ఎస్‌ఆర్‌డీపీ వంటి ప్రాజెక్టులకు విస్తృత ప్రచారం కల్పించాలని నేతలు భావిస్తున్నారు. వర్షాలు కొంత తగ్గుముఖం పడితే గ్రేటర్‌లో భారీగా హోర్డింగ్‌ల ఏర్పాటు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నది పార్టీ నేతల యోచనగా తెలుస్తోంది. నగరంలో సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే ప్రచారానికి విశేష స్పందన ఉంటుందని భావిస్తోన్న నేతలు.. పార్టీలోని ఐటీ విభాగానికి బాధ్యతలు అప్పగించి.. వీలైనంత ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు.


సిట్టింగ్‌ కార్పొరేటర్లకూ పలు సూచనలు చేశారు. ‘కొవిడ్‌ దృష్ట్యా మునుపటిలా ప్రచారం నిర్వహించే అవకాశం ఉండదు. మీ డివిజన్ల పరిధిలో గత పరిస్థితులు, అభివృద్ధి పనులతో వచ్చిన మార్పులను ప్రతిబింభించేలా.. నాడు, నేడు ఉందో వివరించేలా ఫొటోలతో బుక్‌లెట్‌లు, వీడియో క్లిప్పింగులు రూపొందించి ప్రచారం చేయాలి’ అని తనను కలిసిన కార్పొరేటర్లకు ఇటీవల కేటీఆర్‌ సూచించినట్టు తెలిసింది. మొత్తంగా గ్రేటర్‌, పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న టీఆర్‌ఎస్‌.. తనదైన వ్యూహంతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది. 

Updated Date - 2020-09-22T07:27:36+05:30 IST