నిషేధమా..నీవెక్కడా..?

ABN , First Publish Date - 2022-04-19T18:03:50+05:30 IST

గ్రేటర్‌లో అధికార, అనధికార హోర్డింగ్‌లు చాలా వరకు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీటివల్ల ముప్పు పొంచి ఉందన్న ఆందోళన

నిషేధమా..నీవెక్కడా..?

నగరంలో తొలగని హోర్డింగ్‌లు.. యూనిపోల్స్‌

పలుచోట్ల పొంచి ఉన్న ముప్పు

గాలి, దుమారంతో కూలే ప్రమాదం

నిర్వహణ విస్మరించిన ఏజెన్సీలు

తొలగింపును పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు


ఆది, సోమవారాల్లో పలు చోట్ల గాలి, దుమారంతో వర్షం కురిసింది. హోర్డింగ్‌ లు, యూనిపోల్స్‌ ఉన్న చోట్ల గాలి, దుమారం స్థానికుల్లో ఆందోళన రేపింది. గత ఘటనలు కళ్ల ముందు కదలాడాయి. హోర్డింగ్‌లు కూలి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంఘటనలు నగరంలో చాలానే ఉన్నాయి. గ్రేటర్‌లో ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం విధించి రెండేళ్లయినా హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ తొలగింపును ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదు. గాలి దుమారంతో వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ కుప్పకూలే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో అధికార, అనధికార హోర్డింగ్‌లు చాలా వరకు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీటివల్ల ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిషేధం అమలులోకి వచ్చినప్పటి నుంచి హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ నిర్వహణను ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. అంతకుముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో క్రమం తప్పకుండా వాటి నిర్మాణ స్థితిని పరిశీలించే వారు. అవసరాన్ని బట్టి మరమ్మతు, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేవారు. రెండేళ్లుగా హోర్డింగ్‌ల పరిస్థితి ఎలా ఉందన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. రానున్నది వర్షాకాలం కావడం.. గాలి దుమారంతో వానలు పడే అవకాశమున్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ కుప్పకూలే ప్రమాదముంది. దీంతో పౌరుల ప్రాణాలకూ ముప్పు ఉంది. గతంలో ఎల్‌బీ స్టేడియం వద్ద హోర్డింగ్‌ కూలి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. జూబ్లీహిల్స్‌ కేబీఆర్‌ పార్కు సమీపంలో ఓ యూనిపోల్‌ కూలి కార్లు ధ్వంసమయ్యాయి. మాదాపూర్‌లోనూ హోర్డింగ్‌ కూలి ఓ కూలీ మృతి చెందారు. ఇతర ప్రాంతాల్లోనూ పలు ఘటనలు జరిగాయి.


వేల సంఖ్యలో..

జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో    అనుమతి ఉన్న హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ 2,651 ఉన్నాయి. గతంలో సర్వే నిర్వహించి 333 అక్రమ హోర్డింగ్‌లు ఉన్నట్టు గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. వాస్తవంగా అధికారిక హోర్డింగ్‌ల కంటే అనుమతి లేని హోర్డింగ్‌లు ఎక్కువగా ఉంటాయని అంచనా. అయినా తూతూమంత్రంగా సర్వే చేపట్టి తొలగింపును మమ అనిపించారు. అనుమతి లేనివిగా గుర్తించిన అక్రమ హోర్డింగ్‌లను పూర్తిస్థాయిలో తొలగించలేదు. రెండు, మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన హోర్డింగ్‌ల్లో చాలా వరకు తుప్పు పట్టడం, నిర్వహణ లేమితో బలహీనంగా మారాయి. హైదరాబాద్‌లో అకాల వర్షాలు కురిసినప్పుడు గంటకు 80-100 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ తాకిడికి నిర్మాణ స్థిరత్వం సరిగా లేని హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ తట్టుకునే అవకాశం లేదు.


స్థిరత్వం పట్టించుకోని వైనం..

గ్రేటర్‌లో 2011 తరువాత హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వడం లేదు. గాలి, వానకు కూలి పౌరులు ప్రమాదాలు జరుగుతోన్న నేపథ్యంలో అనుమతులు నిలిపివేశారు. అయినా తరువాత కూడా వందల సంఖ్యలో కొత్త హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ ఏర్పాటయ్యాయి. ఇవన్నీ అనుమతి లేనివే. జీహెచ్‌ఎంసీ అధికారుల సహకారంతో కొన్ని ఏజెన్సీలు ఇష్టానికి నచ్చినచోట హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడేళ్లకోసారి సంబంధిత ఏజెన్సీలు హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ స్థిరత్వంపై గుర్తింపు ఉన్న స్ట్రక్చరల్‌ ఇంజనీర్ల ద్వారా నివేదిక జీహెచ్‌ఎంసీకి సమర్పించాలి. కానీ, ఈ విషయాన్ని సంస్థలోని ప్రకటనల విభాగం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్రమ హోర్డింగ్‌లు తొలగించాలని ఏజెన్సీలకు గతంలో నోటీసులిచ్చిన అధికారులు.. గడువు అనంతరం వాటిని తామే తొలగించి స్ర్కాప్‌ను ఇష్టానికి విక్రయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో సంస్థ ఖజానాకు రూ.లక్షల్లో గండి పడింది. 

Updated Date - 2022-04-19T18:03:50+05:30 IST