సీఆర్‌ఎంపీ.. ఇదేంటి..?

ABN , First Publish Date - 2022-04-15T17:18:13+05:30 IST

ప్రధాన రహదారులను మెరుగుపర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకొని అమలు చేస్తోన్న కార్యక్రమం

సీఆర్‌ఎంపీ.. ఇదేంటి..?

ఒప్పందం అమలులో గందరగోళం

ఫుట్‌పాత్‌ల నిర్మాణంపై అస్పష్టత

జీహెచ్‌ఎంసీ కార్మికులతో స్వీపింగ్‌

నిర్ణీత స్థాయిలో మిల్లింగ్‌ చేయకుండా నిర్మాణం

పట్టించుకోని అధికారులు

ఠంచనుగా బిల్లుల చెల్లింపు


కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) బిగ్‌ స్కాం.  ఒప్పందంలో ఏముంది, క్షేత్రస్థాయిలో ఏ పనులు జరుగుతున్నాయి, ఉన్నతస్థాయి పర్యవేక్షణ లేదు.. బడా కాంట్రాక్ట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ కార్యక్రమం 

- ఇటీవల జీహెచ్‌ఎంసీ సమావేశంలో పలువురు సభ్యులు


హైదరాబాద్‌ సిటీ: ప్రధాన రహదారులను మెరుగుపర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకొని అమలు చేస్తోన్న కార్యక్రమం సీఆర్‌ఎంపీ.  2020లో సీఆర్‌ఎంపీకి సంబంధించి బడా కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రథమ సంవత్సరం నుంచి ఐదో యేడాది వరకు అప్పగించిన రోడ్ల నిర్వహణ బాధ్యతలు ఆయా సంస్థలవే. ఆ ప్రకారమే టెండర్లు పిలిచి ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఒప్పందం సక్రమంగా అమలవుతోందా..? లేదా..? అన్న దానిపై సంస్థలో ఉన్నత స్థాయి పర్యవేక్షణ కరువైంది. జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో చేసిందే పని.. పెట్టినవే బిల్లులు అన్నట్టుగా పరిస్థితి మారింది. దీంతో సీఆర్‌ఎంపీ అమలు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


ఒప్పంద ఉల్లంఘన..

709 కి.మీలకుగాను 75 శాతానికిపైగా రహదారుల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిందని ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా మిల్లింగ్‌ చేసి(ఇప్పటికే ఉన్న బీటీ రోడ్లపై పొర తొలగించి) కార్పెటింగ్‌ చేయాలి. నిర్ణీత స్థాయిలో మిల్లింగ్‌ చేయకుండానే రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో రహదారుల ఎత్తు గతంలోలానే పెరుగుతోం ది. అగ్రిమెంట్‌లో ప్రధాన రహదారులపై యంత్రాలు, కార్మికులతో పారిశుధ్య నిర్వహణ చేయాలని ఉంది. కానీ, కార్మికుల నియామకం మా వల్ల కాదని సంస్థలు తప్పుకున్నా యి. దీంతో ప్రస్తుతం రోడ్లపై జీహెచ్‌ఎంసీ కార్మికులు పని చేస్తున్నారు. ఆయా ఏజెన్సీలు స్వీపింగ్‌ను యంత్రాలతో చేస్తున్నాయి. ఒక్కో జోన్‌లో రోడ్ల విస్తీర్ణం బట్టి నిత్యం 60 కి.మీ.లు స్వీపింగ్‌ యంత్రాలు తిరగాలని నిబంధనలు చెబుతున్నా, 30-40 కి.మీ.లతోనే సరిపెడ్తున్నారు. ఈ నేపథ్యంలో యంత్రాలు సక్రమంగా స్వీపింగ్‌ చేస్తున్నాయా, లేదా  అన్న ది అనుమానమే. కొన్ని వాహనాలకు జీపీఎస్‌ లేదని, ఉన్నవీ పూర్తిస్థాయిలో పని చేయడం లేదని ఓ అధికారి తెలిపారు. 


గందరగోళం.. పనులు జరగని వైనం

ప్రధాన రహదారుల్లో వరద నీటి డ్రైన్‌లు, సివరేజ్‌ పైపులైన్ల మూతలు పాడైతే కొత్తవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రైవేట్‌ ఏజెన్సీలదే. రోడ్డు నిర్మాణం అనంతరం మూతలు రహదారుల కంటే తక్కువ ఎత్తులో ఉంటే సరిచేయాలి. కానీ, ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫుట్‌పాత్‌లకు సంబంధించి ఒప్పందంలో స్పష్టత లేదని  పాదచారుల బాటల నిర్మాణ పనులు చేపట్టడం లేదు. కేవలం మరమ్మతు.. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే చేస్తున్నారు. టెండర్లు ప్రకటించిన సమయంలో అప్పగించిన స్ర్టెచ్‌ల్లో, రహదారి నుంచి పాదచారుల బాటలు, డ్రైన్‌ల మరమ్మతు, మూతల ఏర్పాటు, పచ్చదనం, పారిశుధ్యం నిర్వహ ణ ఎంపికైన సంస్థలే చేపడతాయని అధికారులు ప్రకటించారు.


అమలులోకి వచ్చే సరికి గందరగోళం నెలకొంది. ఇదే విషయాన్ని కౌన్సిల్‌లో సభ్యులు ప్రస్తావించారు. ఏ పనులు అప్పగించారు, ఏం చేస్తున్నారన్నది పట్టించుకోకుంటే ఎలా.. నిర్లక్ష్యంలో ఎవరి ప్రయోజనమెంత..? అని నిలదీశారు. ఇప్పటికే రూ.750 కోట్లకుపైగా చెల్లింపులు జరిగాయని ఓ అధికారి తెలిపారు. అంతర్గత రహదారుల నిర్మాణం, నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటుండగా, సీఆర్‌ఎంపీ ఏజెన్సీలకు మాత్రం ఎప్పటికప్పుడు బిల్లులిస్తుండడం గమనార్హం. 


మిగులు నిధులు.. అదనపు పనులు..

రూ.1839 కోట్ల సీఆర్‌ఎంపీ పనుల్లో ఎనిమిది నుంచి పది శాతం నిధులు మిగులుతున్నట్టు అధికారులు గుర్తించారు. మిగులు నిధులతో ఆయా జోన్లలో అంతర్గత రహదారుల ని ర్మాణం, నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. ఆరు జోన్లలో 124 ప్రాంతాల్లోని 102.50 కి.మీ.ల రహదారులను ఏజెన్సీలకు అప్పగించారు. వీటికి సంబంధించి కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయని ఖైరతాబాద్‌ జోన్‌ అధికారొకరు తెలిపారు. అదనపు రోడ్ల అప్పగింతతో సీఆర్‌ఎంసీ రహదారుల విస్తీర్ణం 811 కి.మీ.లకు పెరిగింది. గ్రేటర్‌లో 9,103 కి.మీ.ల రహదారులు ఉన్నాయి.

Updated Date - 2022-04-15T17:18:13+05:30 IST