ఎస్ఆర్‎డీపీ-2

ABN , First Publish Date - 2022-04-08T16:51:32+05:30 IST

మహానగరంలోని పలు ప్రాంతాల్లో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణానికి దారులు వేసిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం

ఎస్ఆర్‎డీపీ-2

రూ.3,515 కోట్లతో ప్రతిపాదనలు 

ప్రభుత్వానికి పంపిన జీహెచ్‌ఎంసీ

14 ప్రాంతాల్లో ప్రాజెక్టులు వంతెనలు, సొరంగమార్గం, కారిడార్ల అభివృద్ధి

మొదటి దశ సక్సె్‌సతో రెండో విడత పనులపై దృష్టి

సర్కారు నిధులిస్తేనే పనులు..?

ఆర్థిక భారం భరించే స్థితిలో లేని బల్దియా

ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులు


హైదరాబాద్‌ సిటీ: మహానగరంలోని పలు ప్రాంతాల్లో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణానికి దారులు వేసిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) రెండో దశ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. మొదటి విడత పనులు సక్సెస్‌ కావడంతో మరిన్ని ప్రాజెక్టుల పనులు ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. 14 చోట్ల రూ.3,515 కోట్లతో వంతెనలు, సొరంగ మార్గం, కారిడార్ల అభివృద్ధి చేపట్టేందుకు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఉప్పల్‌ జంక్షన్‌, జూబ్లీ చెక్‌పోస్ట్‌, నానల్‌నగర్‌ జంక్షన్‌, కూకట్‌పల్లి వై జంక్షన్‌, బండ్లగూడ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాలను ప్రతిపాదించారు.


రైల్వే ట్రాక్‌లు ఉన్న ఫలక్‌నుమా, మాణికేశ్వరినగర్‌, చిలకలగూడ, ఆరాంఘర్‌లో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు నిర్మించనున్నారు. దుర్గం చెరువుపై కేబుల్‌ వంతెనకు కొనసాగింపుగా ఖాజాగూడ గుట్ట వద్ద సొరంగ మార్గం (టన్నెల్‌) నిర్మాణం రెండో దశ ప్రతిపాదనల్లో ఉంది. ఈ ప్రాజెక్టులకు ఏకంగా రూ.1080 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. గుట్టను తొలచి దాదాపు 800 మీటర్ల మేర నాలుగు లేన్లుగా సొరంగ మార్గం నిర్మించనున్నారు. ఎస్‌ఆర్‌డీపీ మొదటి విడతలో రూ.6 వేల కోట్ల విలువైన పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. రూ.4 వేల కోట్ల పనులు పూర్తి కాగా, పలు ప్రాంతా ల్లో 13 వంతెనలు, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, నాలుగు అండర్‌పా్‌సలు, మూడు ఆర్‌యూబీ/ఆర్‌ఓబీలు అందుబాటులోకి వచ్చాయి. కొండాపూర్‌, నాగోల్‌, బహదూర్‌పురా తదితర ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. 


పాలనాపరమైన అనుమతుల కోసం..

రెండో దశ ఎస్‌ఆర్‌డీపీ ప్రతిపాదిత ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులివ్వాలని ప్రభుత్వాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.3,515 కోట్లు మంజూరు చేయాలని  కోరింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఈ నిధులు విడుదల చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) పద్ధతిలో వంతెనలు/ఆర్‌ఓబీల నిర్మాణం కోసం టెండర్లు పిలిచేందుకు, భూగర్భంలోని పైపులు, కేబుళ్లు మార్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఆస్తుల సేకరణ, నిర్మాణ పనులు సమాంతరంగా కొనసాగించేలా అనుమతులు ఇవ్వాలన్నారు. నిర్మాణ దశలో ప్రాజెక్టుల పర్యవేక్షణ, పనుల్లో నాణ్యత పరిశీలనకు ప్రాజెక్టు మానిటరింగ్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ) నియమించుకునేందుకు పర్మిషన్‌ కావాలని కోరారు. 12న జరగనున్న కౌన్సిల్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశముంది. 


ఇప్పటికే ఆర్థిక భారం

ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ పనుల ఆర్థిక భారం మోపడంతో జీహెచ్‌ఎంసీ అప్పుల పాలైంది. ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ, ఇతర ప్రాజెక్టుల కోసం రూ.5,000 కోట్లకుపైగా బ్యాంకులు, బాండ్ల జారీ ద్వారా సంస్థ రుణాలు తీసుకుంది. జూన్‌ నుంచి వాయిదాల చెల్లింపు (ప్రిన్సిపల్‌ అమౌంట్‌) ప్రారంభం కానుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా వేతనాలు, వడ్డీలు, రహదారుల నిర్మాణం, నిర్వహణ బిల్లుల చెల్లింపునకే సంస్థ ఆపసోపాలు పడుతోంది.


ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులకు నిధులు వెచ్చించే పరిస్థితి దాదాపుగా లేదు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి పంపిన లేఖలో కోరినట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ పనులు ప్రారంభించే సమయంలోనూ నిధులు మేమిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు నయాపైసా కేటాయించలేదు. కాగా.. సర్కారు నిధులివ్వకుండా రెండో దశ పనులు చేపట్టే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికలలోపు రెండో దశ ప్రాజెక్టుల్లో కొన్ని పనులైనా ప్రారంభించాలనే యోచనలో పాలకులున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-04-08T16:51:32+05:30 IST