కొవిడ్‌ బాధితులు తగ్గినా సాధారణ వైద్యం అందించరా?

ABN , First Publish Date - 2021-01-25T06:40:39+05:30 IST

నిరుపేదలకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడలోని కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రి (స్టేట్‌ కొవిడ్‌ ట్రీటింగ్‌ సెంటర్‌)గా మార్చేయడంతో పది నెలలుగా జిల్లాలోని సాధారణ రోగులకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకుండాపోయింది.

కొవిడ్‌ బాధితులు తగ్గినా సాధారణ వైద్యం అందించరా?

పది నెలలుగా కొవిడ్‌ సెంటర్‌గా జీజీహెచ్‌

సాధారణ వైద్య సేవలందక రోగుల ఇక్కట్లు

ప్రతి సమస్యకూ గుంటూరుకే పరుగులు

ఈఎస్‌ఐలో వైద్యం పరిమితమే 


నిరుపేదలకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడలోని కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రి (స్టేట్‌ కొవిడ్‌ ట్రీటింగ్‌ సెంటర్‌)గా మార్చేయడంతో పది నెలలుగా జిల్లాలోని సాధారణ రోగులకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకుండాపోయింది. కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నా, అక్కడ కరోనా బాధితుల సంఖ్య తగ్గుతున్నా, సాధారణ వైద్య సేవల విభాగాన్ని తెరిచే దిశగా అధికారులు ప్రయత్నించకపోవడంతో పేదలు అత్యవసర వైద్యం కోసం ప్రైవేటును ఆశ్రయించాలంటే భయపడుతున్నారు. 


(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా వెయ్యికి పైగా పడకలతో బోధనాసుపత్రిగా కొనసాగుతున్న కొత్త ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.150 కోట్లు వెచ్చించి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ను నిర్మించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, సకల సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో రోగులకు వైద్యసేవలందించేందుకు సిద్ధంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌కు ప్రారంభోత్సవం కూడా కాకుండానే.. గత ఏడాది మార్చి నెల నుంచి కొవిడ్‌ బాధితులకు ఐసీయూలుగా మార్చేశారు. నాటి నుంచి జిల్లాలోని సాధారణ రోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవల సంగతి పక్కనబెడితే.. సాధారణ వైద్యసేవలు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. అంతకుముందు కడుపు నొప్పి వచ్చినా.. కాలు నొప్పి వచ్చినా.. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా, ప్రమాదాలకు గురైనా, ఏ వేళలోనైనా ఉచితంగానే అత్యవసర వైద్యం అందుతుందన్న భరోసాతో విజయవాడ కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి పరుగులు తీసేవారు. కొవిడ్‌ సెంటర్‌గా మార్చిన తరువాత జీజీహెచ్‌లో సాధారణ వైద్యసేవలను నిలిపివేయడంతో జిల్లాలో ఇంకెక్కడా ప్రభుత్వపరంగా సరైన వైద్యసేవలందక పేద రోగులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. 


ప్రతి సమస్యకూ గుంటూరు వెళ్లాల్సిందే.. 

జీజీహెచ్‌లో సాధారణ వైద్యసేవలు నిలిపివేసిన నాటి నుంచే ఈఎస్‌ఐ ఆసుపత్రిలో తాత్కాలిక ప్రాతిపదికన ఓపీ సేవలను ప్రారంభించారు. అక్కడకు ఏ చిన్న అనారోగ్యంతో వెళ్లినా, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరికైనా ఎమెర్జెన్సీ వైద్యసేవలు, శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితులు ఎదురైతే వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెప్పారు. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే నిరుపేదలకు రవాణా ఖర్చులే తడిసిమోపెడవుతున్నాయి. దీంతో ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లడమే మానేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పోసప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుంటే.. అక్కడ సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. దీంతో పేద రోగులు మెడికల్‌ షాపుల్లో పనిచేసే ఫార్మసిస్టులకు తమ వ్యాధి లక్షణాలు చెప్పి, వారిచ్చే మందులనే వాడుతూ కాలం గడుపుతున్నారు. కరోనా పుణ్యమా అని జిల్లాలో ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకుండా పోవడంతో రకరకాల జబ్బులతో బాధపడుతున్న పేదల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ తీవ్రత తగ్గి.. సాధారణ పరిస్థితులు నెలకొన్నందున ఇప్పటికైనా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలను ప్రారంభించాలని సాధారణ రోగులు గగ్గోలు పెడుతున్నారు. 


కొవిడ్‌ రోగులు 50 మందిలోపే.. 

కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రికి అదనపు పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఇక్కడ సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, పారిశుధ్య కార్మికులు.. ఇలా అన్ని కేటగిరీల్లో 1500 మందికి పైగానే ఉన్నారు. మొదట్లో కరోనా బాధితుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ.. రెండు నెలలుగా జీజీహెచ్‌కు వస్తున్న కొవిడ్‌ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోగులు 50 మంది కూడా లేరు. దీంతో వైద్యులు, సిబ్బంది కొన్ని నెలలుగా దాదాపు ఖాళీగానే ఉంటున్నారు. వార్డుల్లో రోగులు లేక ఆసుపత్రి భవనాలు కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు దాదాపు తగ్గిపోగా.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్నందున ఇప్పటికైనా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలను ప్రారంభించాలని సాధారణ రోగులు కోరుతున్నారు. 

Updated Date - 2021-01-25T06:40:39+05:30 IST