కరోనా బాధితులకు జీజీహెచ్‌లో అదనపు పడకలు

ABN , First Publish Date - 2021-05-18T04:08:44+05:30 IST

కరోనా బాధితుల కోసం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మరో 50 పడకలతో ప్రత్యేక జర్మన్‌ షెడ్‌ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు.

కరోనా బాధితులకు  జీజీహెచ్‌లో అదనపు పడకలు
కలెక్టర్‌కు సూచనలిస్తున్న మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌

ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు

మంత్రులు అనిల్‌, గౌతమ్‌రెడ్డి

నెల్లూరు(వైద్యం), మే 17 : కరోనా బాధితుల కోసం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మరో 50 పడకలతో ప్రత్యేక జర్మన్‌ షెడ్‌ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విభాగాన్ని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, పరిశ్రమల శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిలు సోమవారం ప్రారంభించారు. మంత్రి అనిల్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదనపు పడకలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ బాధపడవద్దని, కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వెంటనే చికిత్స చేయించుకుంటే తొందరగా తగ్గుతుందన్నారు. మంత్రి మేకపాటి మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని కరోనా ఆసుపత్రుల్లో పడకలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు ఇప్పటికే జిల్లాలో ఉన్న రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌లను పునరుద్ధరించామని తెలిపారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న దశలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుతున్నామన్నారు. రోజుకు 8వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జేసీలు హరేందిర ప్రసాద్‌, గణేష్‌కుమార్‌, బాపిరెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-05-18T04:08:44+05:30 IST