జీజీహెచ్‌లో చీకట్లు

ABN , First Publish Date - 2020-11-30T05:29:11+05:30 IST

నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి(జీజీహెచ్‌)లో ఆదివారం విద్యుత్‌ సరఫరా ఆర్ధంతరంగా ఆగిపోయింది.

జీజీహెచ్‌లో చీకట్లు
విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై ఆ శాఖ సిబ్బంది మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు

ఇక్కట్లు పడ్డ వ్యాధిగ్రస్థులు

ఐడీ భవనంలోకి తరలింపు

జేసీ ప్రభాకర్‌రెడ్డి చొరవతో సరఫరా పునరుద్ధరణకు చర్యలు

అత్యవసర చికిత్స విభాగంలో ఇద్దరి మృతి ?

ధ్రువీకరించని అధికారులు


నెల్లూరు (వైద్యం)నవంబరు 29 : నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి(జీజీహెచ్‌)లో ఆదివారం విద్యుత్‌ సరఫరా ఆర్ధంతరంగా ఆగిపోయింది. సాయంత్రం 4 గంటల నుంచి  కరెంట్‌ నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఎలక్ర్టికల్‌ గదిలోకి నీరు చేరి బ్రేకర్‌ ఫెయిల్యూర్‌ కావటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా వ్యాధిగ్రస్థులు కూడా ఇబ్బందులు పడటంతో ఐడీ భవనానికి తరలించారు. ఐడీ భవనంలో విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకపోవటం తో తాత్కాలికంగా  వ్యాధిగ్రస్థులను తరలించారు. విషయం తెలుసుకున్న జేసీలు ప్రభాకర్‌రెడ్డి, హరేందిరా ప్రసాద్‌, ఆర్టీవో హుస్సేన్‌బాషా, నోడల్‌ అధికారి నాగలక్ష్మి జీజీహెచ్‌కు చేరుకు ని విద్యుత్‌  పునరుద్ధరణకు  చర్యలు చేపట్టారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌  కూడా తన కార్యాలయం నుంచి జీజీహెచ్‌లో పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అర్ధరాత్రికి కూడా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాకపోవటంతో కొత్త భవనంలో ఉన్న అత్యవసర వ్యాధిగ్రస్థులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కాగా ఐసీయూలో ఉన్న ఇద్దరు వ్యాధిగ్రస్థులు మృతి చెందినట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.

Updated Date - 2020-11-30T05:29:11+05:30 IST